Share News

వెలుగు తీగలు.. మృత్యు పాశాలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:28 AM

జిల్లాలో ఒక్క సెప్టెంబరు నెలలోనే ఇన్ని విద్యుత్‌ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

వెలుగు తీగలు.. మృత్యు పాశాలు

-తరచూ విద్యుత్‌ ప్రమాదాలు

- ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

- ధ్వంసం అవుతున్న ఆస్తులు

- వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే మేలు

- గత నెల 17న సంతకవిటి మండలం ఎం.ఆర్‌.అగ్రహారంలోని ఓ షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.1.20 కోట్ల విలువచేసే ఫర్నిచర్‌తో పాటు ఫ్యాన్లు, బీరువాలు, ఇతరత్రా సామగ్రి కాలి బూడిదయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్య్యూట్‌తోనే ప్రమాదం సంభవించిందని నిర్ధారించారు.

- గత నెల 24న తెర్లాం మండలం ఆమిటి గ్రామంలో విద్యుత్‌ స్తంభం కూలి మురపాక సుబ్బాయమ్మ అనే మహిళ మృతి చెందింది. తన ఇంటి సమీపంలోని చెట్టును తొలగించే ప్రయత్నంలో వాలిపోయి ఉన్న విద్యుత్‌ స్తంభం కూలిపోయి ఆమెపై పడడంతో మృత్యువాత పడింది.

- గత నెల 25న గుర్ల మండలం పాలవలస గ్రామంలో బుక్కూరు రాము ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. కుమార్తె పెళ్లికోసం బీరువాలో ఉంచిన రెండు లక్షల నగదుతో పాటు రెండుతులాల బంగారం కాలిపోయింది.

- గత 25న తెర్లాం మండలం అప్పలంపేట పొలాల్లో విద్యుత్‌వైరు తెగిపడి అదే గ్రామానికి చెందిన పోలిరాజు మృతి చెందగా, 26న ఎల్‌.కోట మండలం కిత్తన్నపేటకు చెందిన బంగారయ్య విశాఖ ఇండస్ట్రియల్‌ ఏరియాలో తెగిపడి ఉన్న విద్యుత్‌తీగపై కాలు వేయడంతో మృతి చెందాడు.

రాజాం రూరల్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక్క సెప్టెంబరు నెలలోనే ఇన్ని విద్యుత్‌ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇళ్లల్లో వెలుగులు నింపే విద్యుత్‌ తీగలే రైతులు, ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. చిన్నచిన్న నిర్లక్ష్యాల కారణంగా ఎందరో కరెంట్‌ వైర్లకు బలైపోతున్నారు. ఫలితంగా వారి కుటుంబాల్లో చీకట్లో అలముకుంటున్నాయి. ఎక్కువగా సర్వీసు వైర్లు, వ్యవసాయ మోటార్ల వద్ద షాక్‌కు గురై పలువురు మృతి చెందుతున్నారు. వ్యాపార స్థలాల్లో షార్ట్‌ సర్క్యూట్‌తో లక్షలాది రూపాయల విలువైన ఆస్తి బుగ్గిపాలవుతుంది. నాణ్యతలేని వైర్లు వినియోగించడం, అనుసంధానంగా ఉన్న జీఐ వైరును ఇనుప వస్తువులు, రేకులు, ఫెన్సింగ్‌ తీగలకు కట్టడం వంటి చిన్నపాటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ రోజులతో పాటు వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అప్రమత్తంగా లేకుంటే విలువైన ఆస్తులతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటా, బయటా విద్యుత్‌ ప్రమాదాల నుంచి బయటపడే మార్గాలు పరిశీలిస్తే..

ఈ జాగ్రత్తలు పాటించండి..

- తడిచేతులతో కరెంట్‌ స్విచ్‌లు వేయకూడదు.

- ఇంటికి ఎర్తింగ్‌ తప్పనిసరిగా వేయించాలి.

- డాబాలపై బట్టలు ఆరవేసినపుడు, తీసినపుడు విద్యుత్‌వైర్లను గమనించాలి. వాటికి తడిబట్టలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

- సర్వీస్‌ తీగలకు అనుసంధానంగా వేసే సపోర్ట్‌ వైర్‌ను ఇనుప చువ్వలకు కట్టకూడదు.

- ఐఎస్‌ఐ బ్రాండ్‌ ఉన్న వైర్లను వైరింగ్‌కు ఉపయోగించాలి.

- విద్యుత్‌ తీగలను ప్లగ్‌ లేకుండా నేరుగా స్విచ్‌బోర్డులో పెట్టకూడదు.

- తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లకూడదు. దానిచుట్టూ వేసిన ఇనుప కంచెను తాకకూడదు.

- వర్షం పడే సమయంలో విద్యుత్‌ స్తంభాలను ముట్టుకోకూడదు. ప్రధానంగా ఇనుప స్తంభాలను తాకకూడదు.

- ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ట్రాన్స్‌కో సిబ్బంది లేకుండా ఫీజులు వేసే ప్రయత్నం చేయకూడదు. పూర్తిగా అవగాహన ఉంటే తప్ప విద్యుత్‌ మరమ్మతులు చేయకూడదు. ఏబీ స్విచ్‌ల ఆపరేట్‌ చేయకూడదు.

- తెగిపడిన, వేలాడుతున్న, తక్కువ ఎత్తులో ఉన్న, లూజుగా ఉన్న విద్యుత్‌ తీగలను తాకకూడదు. స్తంభాలకు ఆధారంగా ఏర్పాటుచేసే స్టే వైర్లను కూడా ముట్టుకోకూడదు.

- పొలాలకు వేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా ఇవ్వకూడదు.

- బోరు, మోటారు స్విచ్‌లను లేదా మోటారులో లోపం ఏర్పడినపుడు తడి చేతులతో గాని, తడి ప్రదేశంలో నిల్చొని గాని తాకకూడదు. మోటార్లకు తప్పనిసరిగా ఎర్త్‌ వేయించాలి.

- మోటార్లు, స్టాటర్ల వద్ద తడిలేని రబ్బరు ట్యూబ్‌ను వేసుకోవాలి.

- పొలాలు, తోటల్లో తీగలు పడిఉంటే వాటిని నేరుగా తాకకూడదు. సంబంధిత అధికారులకు సమాచారం అందివ్వాలి.

- విద్యుత్‌కు సంబంధించిన సమస్యలుంటే 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌చేయాలి.

Updated Date - Oct 03 , 2026 | 12:28 AM