YTC వైటీసీకి పూర్వ వైభవం వచ్చేనా?
ABN , Publish Date - May 20 , 2026 | 11:34 PM
Will YTC Regain Its Former Glory? గిరిజన యువతకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సాలూరులో ఏర్పాటు చేసిన వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్) నేడు వెలవెలబోతోంది. ఇక్కడున్న గిరిజన గర్భిణుల వసతిగృహం కూడా ఇటీవల మూతపడింది.
పక్కదారి పట్టిన నిధులు.. సక్రమంగా జీతాలు చెల్లించని వైనం
గాడి తప్పిన యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహణ
ఇప్పటికే మూతబడిన గిరిజన గర్భిణుల వసతి గృహం
వాటి స్థానంలో బర్త్ వేయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేసిన కూటమి సర్కారు
వైటీసీని కూడా తిరిగి వినియోగంలోకి తేవాలని గిరిజనుల విన్నపం
సాలూరు, మే20(ఆంధ్రజ్యోతి): గిరిజన యువతకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సాలూరులో ఏర్పాటు చేసిన వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్) నేడు వెలవెలబోతోంది. ఇక్కడున్న గిరిజన గర్భిణుల వసతిగృహం కూడా ఇటీవల మూతపడింది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా గిరిజన గర్భిణుల కోసం ఏరియా ఆసుపత్రిలో బర్త్ వేయిటింగ్ హాల్స్‌ను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అదేవిధంగా గిరిజన యువత కోసం వైటీసీకి పూర్వ వైభవం తేవాలని స్థానికులు, గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- సాలూరు పట్టణంలో 2015లో వైటీసీ ఏర్పాటు చేశారు. బీఎస్సీ, ఐఏపీ నిధులు సుమారు రూ.42 లక్షలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మారుమూల గ్రామాలకు చెందిన గిరిజన యువతకు కంప్యూటర్, టైలరింగ్, కారు డ్రైవింగ్, ఎలక్ర్టికల్, ప్లంబింగ్, రిటైల్ మార్కెటింగ్, సెల్‌ఫోన్ రిపేర్ తదితర వాటిల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం సుమారు మూడు వేల మందికి పైగా యువతకు ఉపాధి మార్గం చూపించారు. ఓ వైపు శిక్షణలు నిర్వహిస్తూనే.. మాతా శిశు మరణాల నివారణలో భాగంగా గిరిజన గర్భిణుల కోసం 2018లో ఈ వైటీసీ భవనంలోనే మరోవైపు వసతి గృహం ఏర్పాటు చేశారు. ప్రారంభించిన అనతికాలంలోనే జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇక్కడ సుమారు రెండు వేల మందికి పైగా గిరిజన గర్భిణులు సేవలు పొందారు. ఏడో నెల దాటిన గిరిజన గర్భిణులను ఆశాలు ఈ వసతి గృహంలో చేర్పించేవారు. వారికి పౌష్టికాహారంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందించేవారు. ఇందుకోసం ప్రత్యేకమైన వైద్య సిబ్బంది ఉండేవారు. గిరిజన గర్భిణులను అత్యవసర వేళల్లో ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను సమకూర్చారు. అయితే వైసీపీ సర్కారు అఽధికారంలోకి వచ్చాక ఈ రెండింటి పరిస్థితి దారుణంగా తయారైంది. నిర్వహణ గాడి తప్పడం, సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం తదితర కారణాలతో వైటీసీ, గిరిజన గర్భిణుల వసతి గృహం ప్రాభవం కోల్పోయాయి.
- గిరిజన గర్భిణుల వసతిగృహం నిర్వహణకు అప్పట్లో అఽధికారులు రూ.కోటిని బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. దాని నుంచి వచ్చే వడ్డీతో పాటు అదనంగా ఐటీడీఏతో పాటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసేవి. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వైటీసీ, గిరిజన గర్భిణుల వసతిగృహంపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వసతి గృహం నిర్వహణకు డిపాజిట్ చేసిన కోటి రూపాయలను సైతం అప్పట్లో దారి మళ్లించారనే ఆరోపణలు న్నాయి. మొత్తంగా వసతిగృహం నిర్వహణ గాడి తప్పడంతో గిరిజన గర్భిణులు ఇక్కడుకు రావడం తగ్గించారు. దీంతో ఇటీవల కాలంలో దీనిని మూసివేశారు.
- అప్పట్లో వైటీసీ పాటు గిరిజన గర్భిణుల వసతి గృహంలో నియామకాలు ఏ ప్రతిపాదికన జరిగాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉద్యోగాలు విషయంలో ద్వితీయశ్రేణి వైసీపీ నాయకులు, కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మొత్తంగా జీతాలు రాక ఆయా సిబ్బంది అప్పటి నేతలు, ఐటీడీఏ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైటీసీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతాలు విడుదల చేసింది. గిరిజన గర్భిణులు నెల రోజుల ముందుగానే సాలూరు ఏరియా ఆసుపత్రిలో చేరేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం బర్త్ వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేసింది. గిరిజన గర్భిణులు ప్రసవం అయ్యేంత వరకు అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.
నెల రోజులు పాటు ఉండొచ్చు..
గిరిజన గర్భిణులు నెల రోజుల ముందుగానే సమీప ఏరియా ఆసుపత్రిలో ఉన్న బర్త్ వెయిటింగ్ హాల్‌కు రావొచ్చు. వారికి ఆసుపత్రి వైద్య సిబ్బంది అన్ని రకాల సేవలు అందిస్తారు.
-శివకుమార్, ప్రోగ్రాం ఆఫీసర్, సాలూరు
=================================
ఎలాంటి శిక్షణలు లేవు..
వైటీసీలో ప్రస్తుతం ఎలాంటి శిక్షణలు ఇవ్వడం లేదు. పై అధికారుల ఆదేశాల మేరకు త్వరలో గిరిజన యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. ప్రస్తుతానికి నేనొక్కడినే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా.
ఎన్.విద్యాసాగర్, వైటీసీ మేనేజర్, సాలూరు