Share News

Set Things Right? పరిష్కరిస్తారా.. గాడిలో పెడతారా?

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:25 AM

Will You Solve It and Set Things Right? పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం జరిగే ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ పీవో వైశాలి తదితరులు హాజరుకానున్నారు.

 Set Things Right? పరిష్కరిస్తారా..  గాడిలో పెడతారా?
పార్వతీపురం ఐటీడీఏ

  • ఐదేళ్ల తర్వాత నిర్వహణ

  • కొండంత ఆశతో గిరిజనులు

పార్వతీపురం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం జరిగే ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ పీవో వైశాలి తదితరులు హాజరుకానున్నారు. సుమారు ఐదేళ్ల తర్వాత సమావేశం జరుగుతుండడంతో గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలపై చర్చించి.. పరిష్కార మార్గం చూపించాలని, ఐటీడీఏ పాలనను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.

సమస్యలివీ..

- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. కానీ పనులు మాత్రం పూర్తికావడం లేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- గిరిజన వసతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. మెనూ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైట్‌ బిల్లులు మంజూరైన ప్రతిసారీ మామలూ రూపంలో పర్సంటీజీలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది.దీంతో విద్యార్థులకు పోషకాహారం అందడం లేదు.

- పార్వతీపురం, సీతంపేట కేంద్రాలుగా నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. పనులు నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో వాటిని నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే నిధులు మంజూరు చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు కాస్త జరుగుతున్నా.. ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

- గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు గత వైసీపీ ప్రభుత్వంలోనే నిలిచిపోయాయి. చేపట్టిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లంచకపోవడమే ఇందుకు కారణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు పునఃప్రారంభమవుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆశించారు. అయితే నేటికీ పనులు పూర్తికాలేదు. దీంతో గిరిజన విద్యార్థులు ఇంజనీరింగ్‌ విద్య కోసం పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

- ఏళ్లు గడుస్తున్నా.. పార్వతీపురం మండలంలో అడారుగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. రూ.ఐదు కోట్లు వెచ్చించానా.. పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీని ద్వారా ఒక్క ఎకరాకు నీరందడం లేదు. ఈ రిజర్వాయర్‌ పూర్తయితే గిరిజన ప్రాంతాల్లో రైతులకు సాగునీటి ఇక్కట్లు తీరుతాయి.

- గిరిజన ప్రాంతాల్లో సాగునీరు వనరులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రతి గ్రామానికి పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేయాలి. ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ పరిధిలో వైద్యుల నియామకానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాన్‌షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌గా గుర్తించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అయితే నేటికీ మోక్షం కలగలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

-నిధులు మంజూరైనా గిరి శిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణం పూర్తి కావడం లేదు. బిల్లులు చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో చాలాచోట్ల నిర్మాణాలు జరగడం లేదు.

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏకు చెందిన కోట్లాది రూపాయలను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. దీనిపై చర్చించి తిరిగి ఐటీడీఏకు నిధులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- గతంలో పార్వతీపురం ఐటీడీఏ వెలుగు ఏపీడీ హయాంలో యంత్రాల కొనుగోలుతో పాటు నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ పూర్తయినా... ఇంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

- గిరిజన ప్రాంతవాసులను బెంబేలెత్తిస్తున్న ఏనుగులను కుంకీల సాయంతో కట్టడి చేయాల్సి ఉంది. గజరాజులు రోజుకో ప్రాంతంలో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తుండడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:25 AM