మన్యంపై కరుణ చూపిస్తారా?
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:14 AM
జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తికాకపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు.
- జిల్లాలో అనేక సమస్యలు
- పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు
- నిర్మాణానికి నోచుకోని నూతన కలెక్టరేట్
- వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలదీ ఇదే పరిస్థితి
- నిలిచిన పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు
- కుంకీ ఏనుగు రాకకోసం ఎదురుచూపు
- రేపటి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ఆశలు
పార్వతీపురం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తికాకపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. అనేక గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపోవడంతో ఇప్పటికీ డోలీల మోతలు తప్పడం లేదు. ఏనుగుల సమస్య నిత్యం వెంటాడుతోంది. నూతన కలెక్టరేట్ నిర్మాణానికి నోచుకోవడం లేదు. చాలా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. అధికారుల కొరత వేధిస్తోంది. నిధులు లేక కళాశాలలు, రోడ్లు, వంతెనలు తదితర పనులు పూర్తికావడం లేదు. ఇవన్నీ గాడిన పడాలంటే బడ్జెట్‌లో కేటాయింపులు కీలకం. జిల్లాకు అత్యధికంగా నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.
సాగునీటి ప్రాజెక్టులు..
జిల్లాలో జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పూర్వోదయ పథకం కింద ఈ ప్రాజెక్టుకు రూ.59 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మరికొన్ని నిధులను సమకూర్చి పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. పార్వతీపురం మండలం అడారుగెడ్డ రిజర్వాయర్ పెండింగ్ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత జిల్లా ప్రజాప్రతినిధులపై ఉంది. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పూర్వోదయ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అసెంబ్లీలో జిల్లా ప్రజాప్రతినిధులు ప్రస్తావించాలి. వీఆర్‌ఎస్, పెద్దగెడ్డ, పెదంకలం ప్రాజెక్టులకు సంబంధించి జపాన్ నిధులతో చేపడుతున్న ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరిగే విధంగా చూడాలి. బిల్లులు చెల్లించడంతో పాటు మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. గుమ్మలక్ష్మీపురం మండలంలో రేగిడి గెడ్డ, గుమ్మడి గెడ్డ, వట్టిగెడ్డ, అనుసంధానం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఈ పనులు పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏనుగుల సమస్య..
కురుపాం, పాలకొండ, పార్వతీపురం నియోజకవర్గాల ప్రజలు ఏనుగులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏనుగులు ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో సీతానగరం మండలంలో ఎలిఫెంట్ కారిడర్‌ను నిర్మిస్తోంది. ఈ పనులు పూర్తి కావస్తున్నాయి. అయితే, ఏనుగులను ఈ ప్రాంతానికి తరలించేందుకు కుంకీ ఏనుగును జిల్లాకు ఎప్పుడు పంపిస్తారో అనేదానిపై అటవీశాఖ నుంచి స్పష్టమైన హామీని పొందాల్సి ఉంది. దీనిపై అసెంబ్లీలో చర్చించాలి.
కలెక్టరేట్ నిర్మాణమెప్పుడో?
కొత్త జిల్లా ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ నూతన కలెక్టరేట్‌కు నోచుకోలేదు. కేవలం స్థల పరిశీలన చేసి వదిలేశారే తప్ప పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే విధంగా జిల్లాలో చాలా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, జిల్లా రిజిస్ట్రేషన్, తదితర ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అదే విధంగా చాలా శాఖలకు పూర్తిస్థాయిలో అధికారులు లేరు. గృహ నిర్మాణ, వ్యవసాయ తదితర శాఖలకు అధికారులు లేకపోవడంతో ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదు.
ఇతర సమస్యలు..

నిలిచిన పూర్ణపాడు-లాభేసు వంతెన పనులు
- జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
-కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు మధ్యలో ఆగిపోయాయి. ఈపనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలి. దీనిపై ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాల్లో జిల్లా ప్రజాప్రతినిధులు ప్రస్తావించాలి.
- పార్వతీపురం మండలం ఎంఆర్‌నగరం, జియ్యమ్మవలస మండలం చినమేరంగి తదితర ప్రాంతాల్లో పాలిటెక్నిక్ కళాశాల లు ఉన్నాయి. ఈ కళాశాలలకు అనుసంధానంగా వసతిగృహాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. వసతిగృహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
- కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులు పూర్తికావాలంటే అదనపు నిధులు అవసరం.
- బలిజిపేట, సీతంపేట మండలాల్లో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు ప్రస్తావించారు. కానీ, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ విషయాన్ని మరోసారి అసెంబ్లీలో ప్రస్తావించాలి.
-పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. నిధుల మంజూరులో జాప్యం కారణంగా పనులు ముందుకు కదలడం లేదు. వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేసి ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలి.
- పార్వతీపురంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య ప్రజలను వెంటాడుతోంది. పార్వతీపురం పట్టణంలో వర్షాకాలంలో బురద నీరు వస్తుంది. వేసవిలో మూడు రోజులకు లేదా నాలుగు రోజులకు ఒకసారి కొళాయి నీరు వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
- జిల్లాలో అనేక గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు. దీంతో డోలీ మోతాలు తప్పడం లేదు. కొన్ని గ్రామాల రోడ్లకు నిధులు మంజూరైనా అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు జరగడం లేదు. దీనిపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించాలి.
-పార్వతీపురం మండలంలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రానైట్ తవ్వకాలకు గతంలో అటవీశాఖ అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. దీనిపై అటవీశాఖ కోర్టుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంది.
- జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు జలపాతా లు, పార్కుల వద్ద రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలి.