సాగు నీరిస్తారా? లేదా?
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:03 AM
‘జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులు వరి ఎదలు, నారు వేసుకున్నారు.
- ఎరువుల కార్డుల సంగతేంటి?
- ప్రజాప్రతినిఽధులు గైర్హాజరైతే ఎలా?
- నిలదీసిన సభ్యులు
- వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
- ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై చర్చ
విజయనగరం కంటోన్మెంట్, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులు వరి ఎదలు, నారు వేసుకున్నారు. ప్రాజెక్టుల ద్వారా పంటలకు సాగునీరు ఇస్తారా? లేదా? అధికారులు సమాధానం చెప్పాలి. ఎరువుల పంపిణీకి రైతులకు ఇచ్చిన కార్డులతో ప్రయోజనం ఉండడం లేదు. బాధ్యత గల ప్రజాప్రతినిఽధులు సమావేశానికి గైర్హాజరైతే ఎలా?’ అని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎస్.రామ్‌సుందరరెడ్డి, ఎన్.ప్రభాకర్‌రెడ్డి హాజరైన ఈ సమావేశంలో వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, వైద్యంపై ప్రధానంగా చర్చ జరగడంతో పాటు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘సాగు ఎలా’ అనే కథనంపై కూడా చర్చ సాగింది.
13,736 హెక్టార్లలో ఖరీఫ్ సాగు..
మొదట వ్యవసాయశాఖపై చర్చ జరిగింది. జిల్లా సంయుక్త సంచాలకుడు వీటీ రామారావు మాట్లాడుతూ.. ‘ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైంది. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 8,746 హెక్టార్లలో సాగవ్వగా, ఈ ఏడాది 13,736 హెక్టార్లకు పెరిగింది. 41,816టన్నుల వరి విత్తనాలు అవసరం కాగా, 40,582 టన్నులు వచ్చాయి. ఇంకా 12టన్నులు రావల్సి ఉంది. ఇప్పటికే 93ు శాతం పంపిణీ చేశాం. జిల్లాకు 33,677 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. అదనంగా 16,889 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. అందుకు రైతులకు కార్డులను పంపిణీ చేశాం. ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా ఇస్తాం.’ అని అన్నారు. దీనిపై పలువురు సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తారు. కలెక్టర్ ఎస్.రామ్‌సుందరరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక యాప్‌తో అందరికీ ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. పద్మాపురం రెవెన్యూ పరిధిలో 3వేల ఎకరాల ఇనాం భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, వీటికి ఎరువులు ఇవ్వడం లేదని పాచిపెంట ఎంపీపీ బడ్నాన ప్రమీల సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
తోటపల్లి నీరు విడుదల చేశాం..
జిల్లాలో తోటపల్లి కాలువ నుంచి ఈనెల 2న సాగునీరు విడుదల చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. 1.30లక్షల ఎకరాలకు ఈ నీరు అందుతుందని చెప్పారు. ‘మడ్డువలస జలాశయంలో ప్రస్తుతానికి కేవలం 15రోజులకు సరిపడినంత నీరు మాత్రమే ఉంది. తాటిపూడిలో సంతృప్తికరంగా నీరు ఉంది. 9,426ఎకరాలకు ఈనెల 25న విడుదల చేస్తాం. పెద్ద గెడ్డలో ద్వారా ఆగస్టు మొదట వారంలో ఇస్తాం.’ అని అన్నారు. వెంగళరాయ సాగర్‌కు సంబంధించి 24,700ఎకరాలపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు స్పందిస్తూ.. మొత్తం 87,000 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుందా...లేదా..? అని అధికారులను నిలదీశారు. తోటపల్లి నుంచి 200 క్యూసెక్కుల నీరు వదిలితే చీపురుపల్లి మీదుగా ఎచ్చెర్లకు ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. బొబ్బిలి మండలం చింతాడలో తోటపల్లి కాలువ వ్యర్థాలతో పేరుకుపోయింది. పాచిపెంట పెద్దగెడ్డ డంపింగ్ యార్డుగా మారిపోయింది. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న అధికారులు ఏం సమాధానం చెబుతారు.’ అని నిలదీశారు.
ఎమ్మెల్యేలు వచ్చుంటే బాగుండేది..
రైతుల సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వచ్చి ఉండి ఉంటే బాగుండేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులకు మేలు జరిగి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై జడ్పీ చైర్మన్ స్పందిస్తూ ప్రజాప్రతినిఽధుల గైర్హాజరు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. గజపతినగరం జడ్పీటీసీ సభ్యుడు గార తవుడు మాట్లాడుతూ.. తమ ఎంపీపీ స్వగ్రామంలో ఇద్దరు మహిళలకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని, దీనిపై వాకబు చేస్తే వీఐపీ లేఖలతో వచ్చినట్లు తేలిందన్నారు. ఇదెక్కడ న్యాయం అని నిలదీశారు. ఎస్.కోట నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల ఇళ్లకు అధికారులు వెళ్తున్నారనిచ టెండర్లు లేకుండా పనులు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఏడాది నవంబరు నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజి ప్రాంగణంలో సేవలు ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని జిల్లా వైద్యాధికారి ఎస్. జీవనరాణి వెల్లడించారు. జిల్లాలను ప్రగతి మార్గంలో నడిపించి గుర్తింపు తెచ్చిన కలెక్టర్లను జడ్పీ చైర్మన్ సన్మానించారు. సమావేశానికి వచ్చిన కొంతమంది సభ్యులు హాయిగా నిద్రపోవడం కనిపించింది. ముందుగా ఇటీవల పడవ ప్రమాదంలో చనిపోయిన భోగాపురం మండలం ముక్కాం మత్స్యకారులకు సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.