Will you leave it at that?అలా వదిలేస్తారా?
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:21 AM
Will you just leave it at that? సోంపురం- అనందపురం రోడ్డు విస్తరణకు 2021 అక్టోబర్ 20న భూమిపూజ చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.39కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. దీంతో సమీప ప్రజలు, అటు వెళ్లే ప్రయాణికులు ఎంతో ఊరట చెందారు. అవస్థలు తప్పుతాయని భావించారు.
అలా వదిలేస్తారా?
సోంపురం-అనందపురం రోడ్డులో సగం సగం పనులు
గుంతల రహదారిగా మారిన వైనం
గత ప్రభుత్వంలో విస్తరణ మొదలు
ఎక్కడికక్కడే అసంపూర్తి పనులు
నేతలు, అధికారులకు అనేకమార్లు విన్నపాలు
నాలుగేళ్లకు పైగా వేపాడ ప్రజలకు తప్పని అవస్థలు
- ఐదేళ్ల క్రితం వేపాడలోని సోంపురం- అనందపురం రోడ్డు విస్తరణకు నివాసాల అరుగులు, మెట్లు తొలగించారు. అప్పటి నుంచి కాలువల నిర్మాణం చేపట్టలేదు. రోడ్డుపై నుంచి ఇళ్లల్లోకి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాంట్రాక్టరు రోడ్డు విస్తరణ పనులు ఆపేయడంతో మండల కేంద్రాలకు వచ్చేవారంతా అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా తవ్వి వదిలేసిన చోట కాలువ నిర్మాణం చేపట్టడంతో పాటు త్వరితగతిన రోడ్డు విస్తరణ పూర్తి చేయించండి.
- సోమవారం జరిగిన కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వేపాడ ప్రజల విజ్ఞప్తి
సోంపురం- అనందపురం రోడ్డు విస్తరణకు 2021 అక్టోబర్ 20న భూమిపూజ చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.39కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. దీంతో సమీప ప్రజలు, అటు వెళ్లే ప్రయాణికులు ఎంతో ఊరట చెందారు. అవస్థలు తప్పుతాయని భావించారు. కానీ ఇబ్బందులు రెట్టింపయ్యాయి. విస్తరణ కోసమని ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు. దీంతో రోడ్డంతా గుంతలు, గుంతలుగా తయారైంది. వర్షాలు పడినప్పుడు వాటిల్లో నీరు చేరుతోంది. రాత్రి సమయంలో ద్విచక్రవాహనదారులు కింద పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన ఈ రోడ్డును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఎదురు చూశారు. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో నిరాశ పడుతున్నారు.
శృంగవరపుకోట, జూలై 8 (ఆంధ్రజ్యోతి):
వేపాడ మండల పరిధిలో దాదాపు 16 కిలోమీటర్లు పొడవున్న రోడ్డు ఇది. 32 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఎస్.కోట, ఎల్.కోట, జామి, గంట్యాడ, విజయగనరం, అరకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీంతో ఈ రోడ్డు విస్తరణ కోసం స్థానికులు ఆశగా ఎదురుచూశారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.39కోట్లు అంచనా వ్యయంతో విస్తరణ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. 2021 అక్టోబర్ 20న భూమి పూజ చేశారు. రోడ్డు వెడల్పును పెంచేందుకు రోడ్డుకు ఆనుకుని వున్న గ్రామాల ఇళ్లకు మార్కింగ్‌లు ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో మార్కింగ్ ప్రకారం యజమానులు ఖాళీ చేశారు. మరికొన్ని గ్రామాల్లో రోడ్డువేసేస్తామంటూ అధికారులు మెట్లను తొలగించారు. రోడ్డు పనులు పూర్తికాని గ్రామాల్లో విస్తరణలో స్థలమెంత పోతుందో తెలియక కొత్త నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారు. గుంతలుగా వున్న రోడ్డులో ప్రమాణం చేసేందుకు నాలుగేళ్లగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు
గుంతల్లో నీరు చేరి
లక్కవరపుకోట మండలం సోంపురం కూడలి నుంచి అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అనందపురం కూడలి వరకు కొంత దూరం వరకు తారు రోడ్డు చేపట్టిన కాంట్రాక్టరు మరి కొంతదూరం రోడ్డు నిర్మాణం కోసం తవ్వి వదిలేసారు. దీంతో రోడ్డంతా గుంతలు, గుంతలుగా తయారైంది. వర్షాలు పడినప్పుడు వాటిల్లో నీరు చేరుతోంది. రాత్రి సమయంలో ద్విచక్రవాహన దారులు కింద పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన ఈ రోడ్డును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఎదురు చూశారు. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో నిరాశ పడుతున్నారు.
కొంత వరకు నిర్మించి వదిలేసి..
ఈ ఏడాది జనవరిలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి కారును అదిరెడ్డి అప్పారావు, దేబార్కి కిరణ్ తదితరులు స్థానికులతో కలసి ఆపి రోడ్డు దుస్థితిని వివరించారు. వినతిపత్రం అందించారు. పండగ తరువాత పనులు చేసేలా చర్యలు తీసుకుంటానని ఆమె మాట ఇచ్చారు. ఆ తరువాత రోడ్డు పనుల్లో కొంత కదలిక వచ్చింది. ఆతవ కూడలి నుంచి సీతంపేట దాటేవరకు వున్న పలు మలుపులను తొలగించారు. ఇందుకు సేకరించిన భూమిలో రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిలో కూడా రాతి పిక్క, రాతి క్రషర్‌ను పరిచి వదిలేసారు. ఆ తరువాత విస్తరణ పనులు ఆపేయడంతో ఇవిప్పుడు పైకి లేచిపోయాయి. వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
విసిగి ఆందోళన చేసి..
వర్షాలకు ఈ రోడ్డులో వున్న గుంతల్లో నీరు చేరడంతో చిన్నపాటి కుంటలుగా కనిపిస్తున్నాయి. నడిచేందుకు కూడా వీలు లేకపోవడంతో స్థానికులు నాలుగు రోజుల క్రితం గుంతల వద్ద ఆందోళన చేశారు. తహసీల్దార్ జె.రాములమ్మ, ఎంపీడీవో సూర్యనారాయణలకు వినతిపత్రం అందించారు. అంతటితో అగకుండా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో విన్నవించారు. పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని గ్రీవెన్స్ అధికారులు హామీ ఇచ్చినట్లు స్థానిక నాయకుడు నిరుజోగి శ్రీనివాసరావు తెలిపారు.
ఎక్కడ చూసినా గుంతలే
సీతంపేట గ్రామానికి ఇరువైపులా కిలోమీటరుకు పైబడి రోడ్డు విస్తరణకు తవ్వేసి వదిలేశారు. రాతిపిక్కను పరిచారు. అది వర్షాలకు పైకి లేచిపోయింది. గుంతలు, గుంతలుగా మారింది. దబ్బిరాజుపేట గ్రామానికి వెళ్లే లింకు రోడ్డు వద్ద వల్లంపూడి కళ్లాల వద్ద వున్న బస్ షెల్డర్ సమీపంలో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. బరువుతో వచ్చే వాహనాలు ఎక్కడ బోల్తా పడతాయోనని డ్రైవర్‌లు భయపడుతున్నారు. వేపాడ-వల్లపూడి జంటగ్రామాల మధ్య కూడా ఇలాంటి గోతులే వున్నాయి. జగ్గయ్యపేట దాటిన తరువాత వేపాడ వెళ్లే రోడ్డులో మలుపు వద్ద గుంతలు వుండడంతో ప్రమాదంగా మారాయి. భర్తవానిపాలెం సమీపంలోను ఇదే పరిస్థితి.