Share News

ఈసారైనా సరిగా చేస్తారా?

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:33 AM

జిల్లాలో నాలుగో విడత సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ, మండల సర్వేయర్‌, వీఆర్వోలు, వీఆర్‌ఏలతో కూడిన 146 బృందాలు ప్రక్రియను ప్రారంభించాయి.

ఈసారైనా సరిగా చేస్తారా?
ఎస్‌.కోట మండలం కొట్టాం రెవెన్యూ గ్రామంలో రైతుల సమక్షంలో రీ సర్వే చేస్తున్న సర్వే, రెవెన్యూ అధికారులు

రాజాం/శృంగవరపుకోట, జనవరి 17(ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నాలుగో విడత సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ, మండల సర్వేయర్‌, వీఆర్వోలు, వీఆర్‌ఏలతో కూడిన 146 బృందాలు ప్రక్రియను ప్రారంభించాయి. ఆర్‌ఐ, డిప్యూ టీ తహసీల్దారు, తహసీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్య వేక్షణ చేపడుతున్నారు. ఒక్కో బృందం రోజుకు 25 ఎకరా లు తగ్గకుండా సర్వే చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచే శారు. జూలై నాటికి ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ సర్వే పై రైతుల్లో ఒకరకమైన ఆందోళన నెలకొంది. ఈసారైనా సక్రమంగా జరుగుతుందా? అన్న అనుమానాలు ఉన్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. విజయనగరం డివిజన్‌లో 44 గ్రామాల్లో 64,648.62 ఎకరాలను 56 బృందాలు సర్వే చేయనున్నాయి. ఇక చీపురుపల్లి డివిజన్లో 51 గ్రామాల్లో 54,857 ఎకరాలను 62 బృందాలు సర్వే చేయనున్నాయి. బొబ్బిలి డివిజన్‌ విషయానికి వస్తే 31 గ్రామాల్లో 42,348 ఎకరాలను 31 బృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ నెల 2న సర్వే ప్రారంభమైంది. 126 గ్రామాల్లో 1,61,854 ఎకరాల్లో ఈ సర్వే జరపనున్నారు. అయితే గత అనుభవాలతో రైతుల్లో ఆందోళన వీడలేదు. సర్వే బృందాలు పొలాలకు వచ్చాయని తెలుసుకుని రైతులు పరుగులు పెట్టడం కనిపిస్తోంది. అయితే ఈసారి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పిదాలు లేకుండా.. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

రైతుల్లో అవే ఆందోళనలు..

వైసీపీ హయాంలో జరిగిన భూముల రీసర్వేలో తప్పిదాలు రైతుల కళ్లల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రీ సర్వే పేరుతో నానా అవస్థలు పడ్డారు. జాయింట్‌ ఎల్‌బీఎంలు, విస్తీర్ణంలో వ్యత్యాసాలు, నిషేధిత జాబితాల్లో చేర్చడం వంటివి రైతుల పాలిట శాపంగా మారాయి. అయితే అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ సరిచేసి రీసర్వే ప్రక్రియ చేపడతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు విడతల్లో రీ సర్వేచేశారు. కానీ ఇటీవల పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లాయి. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన మాత్రం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ల స్థానంలో ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌లు కేటాయించారు. దీంతో రిజిస్ర్టేషన్లు జరగక ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఎల్పీఎంల వినియోగంతో పాత సమాచారం కనిపించేది కాదు. వందలకొద్దీ జేఎల్‌పీఎంలను ఇచ్చారు. ఒక్కో ఎల్‌పీఎంలో నలుగురైదుగురు రైతుల పేర్లను చేర్చారు. భూమిలో కొంతభాగం అమ్మాలనుకుంటే తహసీల్దారు ద్వారా సబ్‌ డివిజన్‌ చేయించుకోవాల్సి వచ్చేది. అందుకే ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని భూముల రీ సర్వే ప్రక్రియ జాగ్రత్తగా చేయాలని రైతులు కోరుతున్నారు.

రైతుల సమక్షంలో కొలతలు..

‘మన కొట్టాం రెవెన్యూ భూముల రీసర్వే నిమిత్తం మెదటి బ్యాచ్‌ సర్వే నెంబర్లు 195, 196, 197, 201, 200, రెండో బ్యాచ్‌ సర్వే నెంబర్లు 34, 35, 36, 37, 38, 46 ఉన్నాయి. రీ సర్వే బృందాలు వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ మీ భూములను చూపించాలి. ఆధార్‌, ఫోన్‌ నెంబర్లతో పాటు పూర్తి పేరును నమోదు చేసుకోవాలి’.. రీసర్వే బృం దం నుంచి ఓ రైతు మొబైల్‌కు వచ్చిన వాట్సాప్‌ మేసేజ్‌ ఇది. ఇప్పటి వరకు జరిగిన రీ సర్వే గ్రామాల్లోని భూముల్లో సగానికి పైగా తప్పులు దొర్లాయి. తప్పులను సరిదిద్దేందుకు అధికారులు ఇప్పుడు మళ్లీ సర్వే చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తలెత్తిన రీ సర్వే సమస్యలను కూటమి ప్రభు త్వం సరిదిద్దేందుకు పూనుకుంది. అప్పట్లో జారీ అయిన పట్టాదారు పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుంది. వాటిని కొత్తగా ముద్రించి ఈనెల 2నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా పంపిణి చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా పట్టా దారు పాసు పుస్తకాల్లో మాజీ సీఎం జగన్‌ ఫొటోను మాత్ర మే తప్పించారు. దీని స్థానంలో రాజముద్ర, రైతు ఫొటోను ముద్రించారు. విస్తీర్ణం, సర్వే నెంబర్లు, జాయింట్‌ ఎల్‌పీ ఎంలు, రైతు పేర్లలో తప్పులు, భూ యజమాని స్థానంలో వేరొకరి ఫొటో వంటివి ఉండడంతో రైతులు తెల్లముఖం వేశారు. ప్రతి గ్రామంలోనూ 40 నుంచి 60 శాతం రీ సర్వే పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు కనిపిస్తున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ అధికారుల తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రీసర్వే చేపడుతున్నారు. చిన్న తప్పు కూడా లేకుండా ఈసారి పక్కాగా రీ సర్వే చేయడంతో పాటు జూలై నాటిని పూర్తి చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నారు. రీ సర్వే గ్రామాల్లో భూ కొలతలకు ముందు రైతులకు సమాచారం ఇస్తున్నారు. చుట్టుపక్కల రైతులను కూడా రప్పిస్తున్నారు.

రైతుల సమక్షంలో సర్వే..

జిల్లా వ్యాప్తంగా 146 బృందాలతో భూముల సర్వే చేపడుతున్నాం. రైతుల సమక్షంలోనే ఈ సర్వే జరుగుతుంది. ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గత అనుభవాలను, లోపాలను పరిగణలోకి తీసుకుని ఈసారి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాం.

-విజయ్‌కుమార్‌, సర్వేశాఖ ఏడీ, విజయనగరం

Updated Date - Jan 18 , 2026 | 12:33 AM