సమస్యలపై చర్చిస్తారా..?
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:46 AM
Will You Discuss the Issues..? ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా.. పార్వతీపురం పురపాలక సంఘంలో మాత్రం పరిస్థితి మారడం లేదు. పట్టణాభివృద్ధి అనేది ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రధానంగా తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, డంపింగ్ యార్డు తరలింపు వంటి సమస్యలు పుర వాసులను దీర్ఘకాలంగా వేధిస్తున్నాయి.
తాగునీరు, పారిశుఽధ్యం, వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజల విన్నపం
పార్వతీపురంటౌన్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా.. పార్వతీపురం పురపాలక సంఘంలో మాత్రం పరిస్థితి మారడం లేదు. పట్టణాభివృద్ధి అనేది ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రధానంగా తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, డంపింగ్ యార్డు తరలింపు వంటి సమస్యలు పుర వాసులను దీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకవర్గం చెప్పుకోదగ్గ పనులేవీ చేపట్టలేదు. పట్టణాభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొలువుదీరిన మున్సిపల్ నూతన పాలకవర్గంపైనే ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. సోమవారం నిర్వహించనున్న తొలి సాధారణ సమావేశంలో పాలకవర్గ సభ్యులు పట్టణ సమస్యలపై చర్చించి.. పరిష్కార మార్గాలు చూపాలని వారు కోరుతున్నారు.
ఇవీ సమస్యలు
- జిల్లాకేంద్రవాసులను దశాబ్దాలుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. వేసవి కాలంలోనే కాదు మిగతా రెండు కాలాల్లోనూ తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పట్టణ ప్రజలు బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. 36 వార్డులున్న పట్టణంలో 80 వేలకు మించి ఉన్న జనాభాకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. నాలుగైదు రోజులకొకసారి మాత్రమే కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నారు. ఇక శివారు ప్రాంతవాసులకు రెండు రోజులకొకసారి వచ్చే ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్న గత వైసీపీ పాలకవర్గం ప్రకటనలకే పరిమితమైంది. మొత్తంగా పట్టణవాసులు మాత్రం తాగునీటికి కటకటలాడాల్సి వస్తోంది.
- పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఎక్కడికక్కడే చెత్తాచెదారం దర్శనమిస్తుండగా.. కాలువల్లో పూడికలను సైతం తొలగించడం లేదు. దీంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. తరచూ రోగాలపాలవుతూ ఆస్పత్రులకు క్యూ కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం శాశ్వత, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 115 మంది పారిశుఽధ్య కార్మికులే పనిచేస్తున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ కష్టతరమవుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. వాస్తవంగా ఒక వార్డుకు నలుగురుపారిశుధ్య కార్మికులు ఉండాలి. కానీ ఒక్కరు లేదా ఇద్దరు తోనే ప్రజారోగ్యశాఖాధికారులు నెట్టుకొస్తున్నారు. ఇకపోతే శాశ్వత కార్మికుల్లో కొంత మంది పదవీ విరమణ చేయడంతో కాంట్రాక్టు కార్మికులపై పనిభారం పెరుగుతోంది. ఫలితంగా పారిశుధ్య నిర్వహణ అనేది రోజు రోజుకూ జటిలమవుతుంది. మరోవైపు డంపింగ్ యార్డ్ తరలింపు కూడా కొలిక్కి రావడం లేదు. ఇక వర్షం పడితే చాలు.. పట్టణవాసులకు ముంపు సమస్య తప్పడం లేదు.
- జిల్లాకేంద్రంలో వీధి దీపాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారితో పాటు పలు వార్డుల్లో సక్రమంగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు దృష్టి సారించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
- ఏదేమైనా సుమారు ఏడు నెలల తర్వాత సోమవారం జరిగే తొలి సాధారణ సమావేశంలో పాలకవర్గ సభ్యులు పట్టణా భివృద్ధికి ఎలాంటి కార్యచర్య రూపొందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.