Will you be willing to give up TDR bonds? టీడీఆర్ బాండ్లకు ముందుకొస్తారా?
ABN , Publish Date - May 05 , 2026 | 12:25 AM
Will you be willing to give up TDR bonds? పట్టణాలు, నగరాల్లో రోడ్ల విస్తరణ పనులకు చేపట్టే భూసేకరణలో సంబంధిత యజమానులకు నష్టపరిహారానికి బదులు టీడీఆర్ బాండ్లను ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ భూ యజమానులు ముందుకొస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొన్నిచోట్ల వ్యతిరేకత వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ముందుకు రాకుంటే విస్తరణ సాగడం కష్టమే.
టీడీఆర్ బాండ్లకు
ముందుకొస్తారా?
రోడ్ల విస్తరణకు కొత్త విధానాన్ని సూచించిన ప్రభుత్వం
పరిహారం కోరకుండా టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని సలహా
బొబ్బిలి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
పట్టణాలు, నగరాల్లో రోడ్ల విస్తరణ పనులకు చేపట్టే భూసేకరణలో సంబంధిత యజమానులకు నష్టపరిహారానికి బదులు టీడీఆర్ బాండ్లను ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ భూ యజమానులు ముందుకొస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొన్నిచోట్ల వ్యతిరేకత వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ముందుకు రాకుంటే విస్తరణ సాగడం కష్టమే.
రోడ్ల విస్తరణకు ప్రైవేట్ స్థలాలు, భవంతులను సేకరించినప్పుడు వాటి విలువకు నాలుగురెట్ల విలువతో కూడిన టీడీఆర్ (ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్) బాండ్లను స్థలాలు కోల్పోయిన యజమానులకు అందజేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే బొబ్బిలి పట్టణంలోని రెండు ప్రధాన రహదారులను 30 సంవత్సరాలుగా విస్తరించాలని పట్టణ ప్రజలంతా గట్టిగా కోరుతున్నారు. ఇరుకైన రోడ్లలో నిత్యం వాహనాలు, జనం రద్దీతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఏప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ రోడ్ల విస్తరణ హామీ నెరవేరడం లేదు. ఇటీవల బొబ్బిలి పర్యటనకు వచ్చిన మున్సిపల్ మంత్రి పి.నారాయణ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన తీసుకొచ్చారు. మెయిన్‌రోడ్లకు ఇరువైపులా ఉన్న వారు టీడీఆర్ బాండ్లను పరిహారంగా తీసుకొని అంగీకారపత్రాలను ఇస్తే రోడ్ల విస్తరణ పనులను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఎటువంటి పరిహారం లేకుండా టీడీఆర్ బాండ్లు తీసుకొని రోడ్ల విస్తరణకు అందరూ అంగీకరిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఫ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బొబ్బిలి పట్టణంలోని కోర్టు జంక్షన్ నుంచి పోలీసుస్టేషన్, చర్చిసెంటరు, రోడ్డు మీదుగా అమ్మిగారి కోనేరు గట్టు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు నష్టపరిహారం చెల్లించనిదే విస్తరణ పనులకు అంగీకరించేది లేదని ఇళ్ల యజమానులు భీష్మించారు. అప్పట్టో చాలామంది కోర్టును ఆశ్రయించడంతో సుమారు పదేళ్ల పాటు ఆ రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగలేదు. ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీఆర్ బాండ్ల జారీ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆ రోడ్డు విస్తరణకు నోచుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
ఫ టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి పలువురు అధికారులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి నివేదికలు పంపిన సంగతి తెలిసిందే. మరి కొత్త విధానంలో బొబ్బిలి మార్కెట్ రోడ్లు విస్తరిస్తాయో లేదో చూడాలి.