Share News

ఈ ఏడాదైనా ఉచిత సీట్లు ఇస్తారా?

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:33 PM

విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ పేదలకు 25 శాతం సీట్లను కేటాయించాలి.

ఈ ఏడాదైనా ఉచిత సీట్లు ఇస్తారా?

- సక్రమంగా అమలు కాని విద్యాహక్కు చట్టం

- 25 శాతం సీట్లను కేటాయించని వైనం

- ఈసారి పక్కాగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం

- ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

రాజాం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ పేదలకు 25 శాతం సీట్లను కేటాయించాలి. కానీ జిల్లాలో ఇదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. సాధారణ విద్యార్థులనే పేదలుగా చూపి గత కొంతకాలంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు మభ్యపెడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఇది అమలవుతోంది. గత మూడేళ్లలో 2,350 మందికి సీట్లు ఇచ్చినట్టు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్ల ప్రక్రియ పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది 4 వేల సీట్లు భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే, అధికారుల పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది.

వైసీపీ హయాంలో నిర్వీర్యం..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాహక్కు చట్టం నిర్వీర్యమైందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఉచిత అడ్మిషన్లకు సంబంధించి రూ.8వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 ఫీజును ప్రభుత్వమే నేరుగా ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెల్లించాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం అమ్మఒడితో మెలిక పెట్టింది. తల్లిదండ్రుల నుంచి ఫీజును తీసుకోవాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది. నేరుగా యాజమాన్యాలకు ఈ డబ్బులు విడుదల చేయకపోవడంతో పథకం సక్రమంగా అమలుకాలేదు. పుస్తకాలతో పాటు యూనిఫాం సొంత డబ్బులతో కొనుగోలు చేయాలని.. అడ్మిషన్‌, పరీక్ష ఫీజులంటూ గుంజేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల బలవంతంగా ఫీజులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపాలను సరిచేస్తే కానీ.. ఈ ఉచిత అడ్మిషన్లకు తల్లిదండ్రులు ఆసక్తి చూపే అవకాశం లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

ఉచిత అడ్మిషన్లకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు అంచెల్లో నిర్ధారించిన తరువాత విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, బీసీ మైనార్టీ, అగ్రకులాల్లో పేదలను ప్రధాన పరిగణగా తీసుకుంటారు. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5 శాతం, షెడ్యూల్డ్‌ కులాల వారికి 10 శాతం, ఎస్టీ పిల్లలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఓసీ గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వారికి రూ.1.20 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంత కుటుంబాలకు రూ.1.44 లక్షలు మించకుండా వార్షికాదాయం ఉంటే 6 శాతం సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పాఠశాలకు 3 కిలోమీటర్ల లోపల ఉండాలి. వివరాల కోసం మండల విద్యాశాఖ కార్యాలయాలకు సంప్రదించాల్సి ఉంటుంది.

పేద విద్యార్థుల కోసమే..

పేద విద్యార్థుల కోసమే ప్రభుత్వం విద్యాహక్కు చట్టం అమలుచేస్తోంది. ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. న్యాయస్థానం సైతం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చి తరువాత ఫీజులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అలా చేసిన యాజమాన్యాలపై చర్యలు తప్పవు. కచ్చితంగా అన్ని పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే.

-మాణిక్యాంనాయుడు, డీఈవో, విజయనగరం

Updated Date - Apr 11 , 2026 | 11:33 PM