ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:59 PM
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం సీఎంతో మాట్లాడి అభివృద్ధి చేసి తీరుతామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు.
గుర్ల, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం సీఎంతో మాట్లాడి అభివృద్ధి చేసి తీరుతామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. శనివారం పకీరికిట్టాలి గ్రామం వద్ద ఉన్న గడిగెడ్డ రిజర్వాయర్ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆమె వచ్చారు. గతంలో రూ.12 కోట్లు రిజర్వాయర్ అభివృద్ధి కోసం విడుదల చేస్తే పనులు జరగకుండా ఆపేశారని ఆమె అన్నారు. రూ.12 కోట్ల నిధులతో మళ్లీ పనులు ప్రారంభించామన్నారు. జగన్మోహన్‌రెడ్డి హయాంలో కనీసం రోడ్లు గానీ పొలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల గురించి కానీ పట్టించుకోలేదన్నారు. తన తండ్రి అశోక్ గజపతి ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం అహర్నిశలు పని చేశారని గుర్తు చేశారు. తోటపల్లి కాలువ నుంచి సాగునీరు, తాగునీరు విజయనగరం ప్రాంతానికి వెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు. వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంది స్తామన్నారు. మిగిలిన జలాశయాల అభివృద్ధి కోసం మేమంతా సీఎం దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేసి తీరుతామన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు. ఆమెతో పాటు విజయనగరం తెలుగుదేశం పార్టీ నాయకులు కుర్రోతు నర్సింగరావు, గంట రవి, జిల్లా ఇరిగేషన్ శాఖాధికారులు, మండల నాయకులు వెన్నె సన్యాసినాయుడు పాల్గొన్నారు. రిజర్వాయర్‌కు సంబంధించిన జేఈ, ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే పర్యటన సమయంలో కనీసం కనిపించలేదు. మండల స్థాయి అధికారుల జాడలేదు. ఎమ్మెల్యే వచ్చేటప్పుడు మార్గం తెలియక కొంతసేపు ఇబ్బందులు పడ్డారు.