Assembly Seats Be Reserved for Women? ఆ రెండు అసెంబ్లీ స్థానాలు మహిళలకేనా?
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:46 PM
Will Those Two Assembly Seats Be Reserved for Women? అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని భావిస్తోన్న కేంద్రం.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును కూడా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఇదే జరిగితే డీలిమిటేషన్ తర్వాత జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలు పెరగనుండగా.. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆరుకు చేరనుంది. ఇక 33 శాతం రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే.. రెండు నియోజక వర్గాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జిల్లాలో కొత్తగా రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం
అవి అతివలకే రిజర్వేషన్ కానున్నట్లు ఊహాగానాలు
కుటుంబాల్లో మహిళలను సిద్ధం చేసే యోచనలో జిల్లా టీడీపీ నేతలు
పార్వతీపురం, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి): అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని భావిస్తోన్న కేంద్రం.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును కూడా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఇదే జరిగితే డీలిమిటేషన్ తర్వాత జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలు పెరగనుండగా.. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆరుకు చేరనుంది. ఇక 33 శాతం రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే.. రెండు నియోజక వర్గాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. సాలూరు నియోజకవర్గం(ఎస్టీ) నుంచి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కురుపాం(ఎస్టీ), పార్వతీపురం (ఎస్సీ), పాలకొండ(ఎస్టీ) ఎమ్మెల్యేలుగా తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ ఉన్నారు. పునర్విభజన తర్వాత మూడు ఎస్టీ, ఒకటి ఎస్సీ, రెండు జనరల్ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లాలో అదనంగా పెరిగే రెండు అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వేషన్ కానున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్‌లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నందున జిల్లా నుంచి రెండు లేదా మూడు నియోజకవర్గాల నుంచి మహిళలు అసెంబ్లీకి వెళ్లనున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆశలు..
రిజర్వేషన్లు అనుకూలిస్తే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్వతీపురం నియోజక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత తన సతీమణిని రంగంలోకి దించేందుకు ఆసక్తి చూపి స్తున్నారు. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన మరో నాయకుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. వీరే కాకుండా జిల్లాలో మరి కొంతమంది నేతలు రిజర్వేషన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలించకపోయినా.. తమ కుటుంబ సభ్యుల్లో మహిళలను ఎన్నికల బరిలో నిలిపేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో..
ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో గజపతినగరం నుంచి పడాల అరుణ మంత్రిగా పనిచేశారు. పాలకొండ, పార్వతీపురం నుంచి అమృతకుమారి, జయమణి ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి బొత్స ఝాన్సీ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఎమ్మెల్సీగా గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలికి వెళ్లారు. కురుపాం నియోజక వర్గం నుంచి ఉపముఖ్యమంత్రిగా పాముల పుష్పశ్రీవాణి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విధంగా అనేక మంది మహిళలు ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా చట్టసభలకు వెళ్లి తమ గళం వినిపించారు.