Will they restore its former glory? పూర్వవైభవం తీసుకొస్తారా?
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:38 PM
Will they restore its former glory? బొబ్బిలి మునిసిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు స్వీకరించనుంది. చైర్‌పర్సన్ రాంబార్కి రేణుకాదేవి స్వప్నతో పాటు మరో 36 మంది కౌన్సిలర్లు పదవుల్లో కొలువుదీరనున్నారు.
పూర్వవైభవం తీసుకొస్తారా?
బొబ్బిలి కొత్త పాలకవర్గంపై ప్రజల్లో ఎన్నో ఆశలు
మౌలిక సమస్యలు పరిష్కరించాలని విన్నపాలు
రోడ్ల విస్తరణ అత్యవసరం
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు గాడిన పడుతుందా?
కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల కబ్జాపర్వం
నేడు కొలువుదీరనున్న పాలకవర్గం
బొబ్బిలి నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మునిసిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు స్వీకరించనుంది. చైర్‌పర్సన్ రాంబార్కి రేణుకాదేవి స్వప్నతో పాటు మరో 36 మంది కౌన్సిలర్లు పదవుల్లో కొలువుదీరనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు నూతన పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి. సవాళ్లతో కూడిన ఈ సమస్యలన్నింటినీ కొత్త పాలకులు పరిష్కరించడానికి చొరవ చూపాలని పురవాసులు కోరుకుంటున్నారు.
- రోడ్ల విస్తరణ సమస్య ఎప్పటి నుంచో ఉంది. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ ప్రతీ రోజూ కిటకిటలాడుతుండడంతో జనం రాకపోకలకు, వాహనాల సంచారానికి, ముఖ్యంగా బడిపిల్లలకు చాలా అసౌకర్యంగా ఉంటోంది. రైల్వే జంక్షన్ నుంచి గాంధీబొమ్మ జంక్షన్, కృష్ణాటాకీస్, తాండ్రపాపారాయ జంక్షన్ మీదుగా బజారు రోడ్లను, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాలేజీ రోడ్డు మీదుగా పూల్‌బాగ్ గొల్లపల్లి బైపాస్ జంక్షన్ వరకు గల రోడ్డును అత్యవసరంగా విస్తరించాల్సి ఉంది.
- జాతీయ స్ధాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ పార్కు నిర్వహణా తీరు అధ్వానంగా మారింది. మళ్లీ దానికి పూర్వవైభవం తీసుకురావాలి. ఇంటింటి చెత్తసేకరణ, ప్లాస్టిక్ నిషేధం వంటి వాటిలో సాధించిన గుర్తింపునకు మరింత పదును పెట్టాలి.
- తాగునీటి సరఫరా తీరు పట్ల ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొంది. అక్రమ కుళాయి కనెక్షన్ల భరతం పడతామంటూ ప్రతీ పాలకవర్గం శపథం చేయడమే తప్ప చర్యలు తీసుకోలేకపోతున్నారు.
- పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ప్రధాన వీధులలో మురుగుకాలువల్లో నుంచి నీరు ఎక్కడికక్కడే బయటకు వచ్చేస్తోంది.
- బొబ్బిలికి ప్రతిరోజూ వచ్చే వారి సౌకర్యం కోసం సులబ్‌కాంప్లెక్స్‌లు వంటివి ఏర్పాటు చేస్తామని గత అనేక పాలకవర్గాలు మాటిచ్చి అమలు చేయలేకపోయాయి.
- టౌన్‌ప్లానింగ్ విభాగంలో గతంలో అనేక ఆరోపణలొచ్చాయి. ఇప్పటికీ పలువురు అధికారులు, సిబ్బందిపై విచారణలు జరుగుతున్నాయి.
- పట్టణంలో చెరువులు, ప్రభుత్వ స్ధలాలు పెద్దఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి. వాటిని కట్టడి చేయాల్సి ఉంది. చెరువులన్నిటినీ సుందరంగా తీర్చిదిద్దడానికి ఓ పక్కా కార్యాచరణను రూపొందించాలి. ఇండోర్‌స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలి.
మళ్లీ నెగ్గిన తాజా మాజీలు
బొబ్బిలి మునిసిపాలిటీలో గత పాలకవర్గ హయాంలో ఉన్న 12 మంది తాజా మాజీ కౌన్సిలర్లకు ప్రజలు మళ్లీ పట్టం కట్టి కౌన్సిల్‌కు పంపుతున్నారు. వారిలో మాజీ వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ గతంలో 19 వవార్డుకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఈ సారి 21 వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 54 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలుపొందారు. 4వవ వార్డు నుంచి టీడీపీ తరపున బొత్స సురేష్ 8 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన గతంలో 3 వ వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. 5వ వార్డు నుంచి టీడీపీ తరపున వెలగాడ హైమావతి 588 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమె వరుసగా మూదో సారి గెలిచి హేట్రిక్ సాధించారు. 6వ వార్డు నుంచి టీడీపీ తరపున గెంబలి శ్రీనివాసరావు 157 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలిచారు. గత పాలకవర్గంలో టీడీపీ ఫ్లోర్‌లీడరుగా పనిచేశారు. 7వ వార్డు నుంచి దిబ్బ సునీత టీడీపీ తరపున పోటీ 95 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలుపొందారు. ఆమె గత పాలకవర్గంలో వైసీపీ తరపున, ఇప్పుడు టీడీపీ తరపున గెలిచారు. 10 వ వార్డు నుంచి కాకల గోవిందమ్మ టీడీపీ తరపున మళ్లీ 82 ఓట్లతో మళ్లీ గెలుపొందారు. 13వ వార్డు నుంచి బొట్ట తిరుపతి టీడీపీ తరపున మళ్లీ 391 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 20 వ వార్డు నుంచి టీడీపీ తరపున సాలా స్వప్న దేవి 227 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలుపొందారు. ఆమె గతంలో 20వ వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. 24 వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి మరిశర్ల రామారావునాయుడు మళ్లీ గెలిచారు. 28 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా ఇంటి గోవిందరావు 15 ఓట్లతో మళ్లీ గెలిచారు. ఆయన గత పాలకవర్గంలో 24 వ వార్డునుంచి వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించారు. 30వ వార్డు నుంచి కళ్యంపూడి లక్ష్మి టీడీపీ తరపున 82 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలుపొందారు. ఆమె గతంలో 25 వ వార్డు నుంచి గెలుపొందారు. 36 వ వార్డు నుంచి వైసీపీ తరపున చోడిగంజి అనసూయమ్మ 89 ఓట్ల మెజారిటీతో మళ్లీ గెలిచారు. ఆమె గతంలో 31 వ వార్డుకు ప్రాతినిధ్యం వహించారు.