Share News

Promises? హామీలుగానే మిగిలిపోతాయా?

ABN , Publish Date - May 03 , 2026 | 11:46 PM

Will They Remain Just Promises? జిల్లాను దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. శాశ్వత పరిష్కారం లభించడం లేదు. చివరకు అవి ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

  Promises? హామీలుగానే మిగిలిపోతాయా?
పూర్ణపాడు-లాబేసు వంతెన ఇలా..

  • ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కారానికి చర్యలేవీ?

  • కొలిక్కిరాని సాగునీటి ప్రాజెక్టుల పనులు

  • ప్రశ్నార్థకంగా రహదారుల విస్తరణ.. బైపాస్‌ నిర్మాణం

  • గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు పూర్తయ్యేదెప్పుడో?

  • మహిళలకు ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యేనా!

  • వంతెనల పనులకు లభించని మోక్షం

  • ప్రకటనలకే పరిమితమైన గత వైసీపీ సర్కారు

  • మన్యం వాసులకు తప్పని ఇబ్బందులు

  • కూటమి ప్రభుత్వంపై ఆశలు

పార్వతీపురం, మే3(ఆంధ్రజ్యోతి): జిల్లాను దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. శాశ్వత పరిష్కారం లభించడం లేదు. చివరకు అవి ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల విస్తీర్ణం, వంతెనలు, గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణం, మహిళల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణం ఇంకా పూర్తవడం లేదు. గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యమే ఇందుకు కారణం. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో గిరిజన యువతకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నత చదువుల కోసం పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. మరికొందరు స్థామత లేక చదువులకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు.

- జిల్లా కేంద్రం పార్వతీపురంలో బైపాస్‌ రహదారి నిర్మాణం కోసం పట్టణవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. దీని పనులకు అడుగులు పడకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుంది. ప్రధానంగా పట్టణం మీదుగా ఒడిశాకు చెందిన భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో చాలా సేపు ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. రహదారికి ఇరువైపులా బైక్‌లు, కార్లు ఇతర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు పాదచారులు సైతం నరకం చూస్తున్నారు.

- డివిజన్‌ కేంద్రం పాలకొండలో రహదారుల విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుఏకూ ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. నిత్యం పాలకొండ మీదుగా పార్వతీపురం, శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు రాకపోకలు సాగిస్తుం టాయి. అయితే రద్దీగా ఉండే ఈ మార్గంపై దృష్టి సారించకపోవడంతో వాహనదారుల కష్టాలు రెట్టింపవుతున్నాయి.

- సాలూరు కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని గత వైసీపీ పాలకులు ఇచ్చిన హామీ గాలిలోనే కలిసిపోయింది. సాలూరుతో పాటు పార్వతీపురంలోనూ మహిళల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

- కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీని నిర్మాణానికి వివిధ కారణాలతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో టెండర్లు పిలిచినా ఫలితం ఉండడం లేదు. 20 శాతం మాత్రమే మిగిలిన ఉన్న పనులను పూర్తిచేస్తే సుమారు 30 గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయి.

- జంఝావతి హైలెవెల్‌ కెనాల్‌ పరిస్థితి దయనీయంగా మారింది. పార్వతీపురం, సీతానగరం తదితర మండలాలకు హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా సాగునీరు అందిస్తామన్న గత పాలకులు ప్రకట నలకే పరిమితమయ్యారు. దీంతో ఇందుకోసం ఆ ప్రాంతవాసులు భూములు త్యాగం చేసినా.. ఫలితం లేకపోయింది. మొత్తంగా 24 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు.. కేవలం 9 వేల ఎకరాలకే పరిమితమైంది. దీంతో శివారు ప్రాంత రైతులు ఏటా వరుణుడిపై ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది.

- పార్వతీపురం మండలంలో అడారుగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం మధ్యలో నిలిచిపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో రూ.ఐదు కోట్లు ఖర్చుపెట్టి పనులు చేపట్టినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఒక్క ఎకరాకు కూడా నీరందించలేని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - May 03 , 2026 | 11:46 PM