Share News

Garbage Problem? చెత్త సమస్యకు.. చెక్‌ పెడతారా?

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:07 PM

Will They Put an End to the Garbage Problem? దశాబ్దాలు గడుస్తున్నా.. జిల్లా కేంద్రంలో డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి నోచడం లేదు. యార్డు తరలింపు అనేది ఎన్నికల హామీగానే మారింది. దీంతో పట్టణవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. పార్వతీపురం మున్సిపాల్టీ శివారు.. రాయగడ అంతర్రాష్ట్ర రోడ్డుకు అనుకుని ఉన్న డంపింగ్‌ యార్డు వల్ల నిత్యం పాదచారులు, వాహనదారులు, చుట్టు పక్కల నివాసితులు నానా అవస్థలు పడుతున్నారు.

  Garbage Problem? చెత్త సమస్యకు..  చెక్‌ పెడతారా?
పట్టణ శివారులో డంపింగ్‌యార్డు ఇలా..

  • నిర్వహణపై నిర్లక్ష్యం.. తరలింపులో జాప్యం

  • అంతర్రాష్ట రహదారిలో రాకపోకలకు ఇక్కట్లు

  • నూతన మున్సిపల్‌ పాలకవర్గం దృష్టి సారించాలని విన్నపం

పార్వతీపురం టౌన్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలు గడుస్తున్నా.. జిల్లా కేంద్రంలో డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి నోచడం లేదు. యార్డు తరలింపు అనేది ఎన్నికల హామీగానే మారింది. దీంతో పట్టణవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. పార్వతీపురం మున్సిపాల్టీ శివారు.. రాయగడ అంతర్రాష్ట్ర రోడ్డుకు అనుకుని ఉన్న డంపింగ్‌ యార్డు వల్ల నిత్యం పాదచారులు, వాహనదారులు, చుట్టు పక్కల నివాసితులు నానా అవస్థలు పడుతున్నారు. గత పదేళ్లలో పట్టణ జనాభా బాగా పెరిగింది. అయినప్పటికీ యార్డు నిర్వహణ, దాని తరలింపునకు సంబంధించి ప్రత్యామ్నాయ స్థలం ఎంపికపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మొత్తంగా అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై జిల్లాకేంద్రవాసులు పెదవి విరుస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం పంచాయతీగా ఉన్నప్పుడు.. అప్పటి జనాభా 23 వేలు మంది ఉండేవారు. వారికి తగ్గట్టుగా రాయగడ రోడ్డు శివారులోని 5 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేశారు. 1959లో పార్వతీపురం పురపాలక సంఘంగా ఏర్పడింది. 2002లో గ్రేడ్‌-1 మున్సిపాల్టీగా ఏర్పడింది. నాలుగేళ్ల కిందట జిల్లా కేంద్రంగా మారింది. పట్టణ జనాభా 70 వేలు దాటిపోయింది. రోజుకు కనీసం 15 నుంచి 20 టన్నుల చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో యార్డులో చెత్తలు, వ్యర్థాలు పెరిగిపోతున్నా.. దాని తరలింపు ప్రతిపాదనలకు మాత్రం మోక్షం లభించడం లేదు.

- 2008లో డంపింగ్‌ యార్డు తరలింపునకు సంబంధించి అప్పటి మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. రెవెన్యూ అధికారులు సంగంవలస పంచాయతీ పరిధి పిట్టవలస సమీపంలోని 8 ఎకరాలు సేకరించారు. అయితే అప్పట్లో మరికి పంచాయతీవాసులు డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయరాదంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొన్నేళ్లుగా డంపింగ్‌ యార్డు తరలింపు వాయిదా పడుతూ వస్తుంది.

- 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డంపింగ్‌ యార్డు కోసం రావికోన బట్టివలస సమీపంలో ఐదెకరాలను కేటాయించారు. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకు ఎటు వంటి ఇబ్బంది కలగకుండా చెత్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుకు అప్పటి పాలకవర్గ పచ్చజెండా ఊపింది. అయితే వైసీపీ నాయకులు అభ్యంతరాలు తెలపడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీ నాయకులు మాత్రం డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు.

- 2006లో డంపింగ్‌ యార్డులో రూ.5 లక్షలతో చెత్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, రోజురోజుకూ పెరుగుతున్న చెత్త వల్ల ఆ కేంద్రం డంపింగ్‌ యార్డు కిందకు వెళ్లిపోయింది.

- అంత ర్రాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న డంపింగ్‌ యార్డు నుంచి నిత్యం దుర్వాసన వస్తుండడంతో పాదచారులు, వాహనచోదకులు ముక్కులు మూసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వేసవి కాలంలో అయితే చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీంతో పొగ వల్ల సమీప ప్రాంతవాసులతో పాటు ప్రయాణికులకు కూడా ఇక్కట్లు తప్పడం లేదు. వర్షాకాలంలో బురదగా మారి.. యార్డులోకి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోడ్డుపైనే చెత్తని పడేస్తున్నారు. వ్యర్థాల్లోకి నీరు చేరి, ఈగలు, దోమలు, దుర్గంధంతో స్థానికులు తరచూ రోగాలపాలవుతున్నారు.

- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. డంపింగ్‌ యార్డులో తడి, పొడి చెత్తలను వేరు చేసేందుకు ప్రోసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రక్రియ గడువు కాలం ముగియడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. మరికొద్దిరోజుల్లో కొలువుదీరనున్న నూతన మున్సిపల్‌ పాలకవర్గం ఈ సమస్యపై దృష్టి సారించి.. శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లాకేంద్రవాసులు కోరుతున్నారు.

తప్పని ఇబ్బందులు

ప్రభుత్వాలు, అధికారులు మారినా.. పట్టణంలో డంపింగ్‌ యార్డు సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నూతన పాలకవర్గం స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.

- పి. సన్యాసిరావు, ప్రజా నాయకుడు, పార్వతీపురం

===============================

దృష్టి సారించాలి..

జిల్లా కేంద్రవాసులను దశాబ్దాలుగా డంపంగ్‌ యార్డు సమస్య వేధిస్తోంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కార మార్గం చూపించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా నూతన పాలకవర్గ సభ్యులు దీనిపై దృష్టి సారించాలి.

- సూరిబాబు, వివేకానంద కాలనీ, పార్వతీపురం

===============================

తరలింపునకు చర్యలు

నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం డంపింగ్‌ యార్డు తరలింపునకు చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. పాలకవర్గం అనుమతితో యార్డు ఏర్పాటు స్థలానికి సంబంధించి కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు తెలియజేస్తాం.

- బి.రామ్‌ గోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పార్వతీపురం

Updated Date - Nov 11 , 2026 | 11:07 PM