Share News

Vacate? ఖాళీ చేయాల్సిందేనా?

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:40 PM

Will They Have to Vacate? జిల్లాకేంద్రంలో వివిధ శాఖల అధికారులకు పెద్ద కష్టమే వచ్చింది. పట్టణంలో ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్స్‌, ఇతర అద్దె భవనాల కోసం తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. అయితే వాటి అద్దెలు చూసి ఆందోళన చెందుతున్నారు.

 Vacate? ఖాళీ చేయాల్సిందేనా?
పార్వతీపురంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్‌ భవనం

  • ప్రైవేట్‌ భవన సముదాయం ఖాళీ చేయాలని అఽధికారులపై యజమాని ఒత్తిడి

  • అద్దె భవనాల కోసం అన్వేషణ

  • జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త కార్యాలయం కడితే ఒట్టు

పార్వతీపురం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో వివిధ శాఖల అధికారులకు పెద్ద కష్టమే వచ్చింది. పట్టణంలో ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్స్‌, ఇతర అద్దె భవనాల కోసం తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. అయితే వాటి అద్దెలు చూసి ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పార్వతీ పురంలోని ఓ అద్దె భవన సముదాయంలో సుమారు నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే వచ్చే ఏడాదిలో తన భవనం ఖాళీ చేయాలని సంబంధిత యజమాని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాగా ఏర్పాటైన తర్వాత పార్వతీపురంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాల భవన సముదాయాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇందులో విద్య, ఉద్యాన, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు సుమారు 40 శాఖలకు పైబడి కార్యాలయాలను నేటికీ నిర్వహిస్తున్నారు. ఒక్కో కార్యాలయం విస్తీర్ణం బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. అయితే ఇటీవల ఆ ప్రైవేట్‌ భవన యజమాని వచ్చే ఏడాది మార్చి నెలలోపు కార్యాలయాలను ఖాళీ చేయాలని జిల్లా అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రైవేట్‌ భవనాల అన్వేషణలో పడ్డారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయం ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో వివిధశాఖల అధికారులు ఉన్నారు. మరికొందరు ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్స్‌లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌ యజమానులు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇంకొందరు మాత్రం అధిక మొత్తంలో అద్దె డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో వివిధ శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

కొత్తగా ఒక భవనం కట్టలే..

పార్వతీపురం జిల్లాకేంద్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఒక భవనం కూడా నిర్మించలేదు. ఎంతో హడావుడిగా జిల్లాలను ఏర్పాటు చేసిన నాటి వైసీపీ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతులపై దృష్టి సారించలేదు. దీంతో పార్వతీపురం డివిజన్‌ కేంద్రంగా ఉన్న సమయంలో ఉన్న ప్రభుత్వ భవనాలే నేటికీ కొనసాగుతున్నాయి. అప్పటి కార్యాలయాల్లో కొన్నింటిని జిల్లా కేంద్ర కార్యాలయాలుగా పేరు మార్చారు. ఆర్‌అండ్‌బీతో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ తది తర డివిజన్‌ కార్యాలయాలను జిల్లా కార్యాలయంగా మార్చి నిర్వహిస్తున్నారు. డివిజన్‌ సిబ్బందితో పాటు జిల్లా అధికారులు కలిసి ఇరుకైన గదుల్లో విధులు నిర్వహించాల్సి వస్తోంది.

జిల్లా అధికారులు ఏమన్నారంటే..

- ‘మా శాఖకు సంబంధించి కార్యాలయం ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రైవేటు అపార్ట్‌మెంట్‌లో అద్దెకు భవనాలను తీసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. కానీ అద్దె ఎక్కువగా చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అద్దె చెల్లించగలం. అధికంగా చెల్లించాలంటే మా జీతాలు నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు.’ అని ఓ శాఖ జిల్లా అధికారి తెలిపారు.

- ‘ప్రస్తుతం ప్రైవేట్‌ భవనంలో కార్యాలయం నిర్వహిస్తున్నాం. కానీ ఖాళీ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. పార్వతీపురంలో అద్దెలు అధికంగా పెంచేశారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. నివాసాలకే కాదు కార్యాలయాలకు కూడా అపార్ట్‌మెంట్స్‌ కావాలంటే నెలకు రూ.15వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంది.’ అని ఒక జిల్లాశాఖ కార్యాలయం అధికారి చెప్పారు.

Updated Date - Oct 04 , 2026 | 11:40 PM