ఒకేతాటిపైకి వచ్చేనా?
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:58 PM
మండలంలో ఎన్నడూ లేనివిధంగా ప్రాదేశికాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.
- భోగాపురంలో కూటమి పార్టీల్లో కొరవడిన సఖ్యత
- ఎవరికి వారే నామినేషన్లు దాఖలు
భోగాపురం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎన్నడూ లేనివిధంగా ప్రాదేశికాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. 16 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 127 నామినేషన్లు వచ్చాయి. కూటమి పార్టీల్లో సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారే నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి 33, జనసేన 30, బీజేపీ 6 స్థానాల్లో నామినేషన్లు వేసింది. ప్రధానంగా ఎంపీపీ పీఠం కోసం పోటీ నెలకొంది. రాష్ట్రమార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు సతీమణి, మాజీ ఎంపీపీ కర్రోతు మంగమ్మ (కవులవాడ), టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ సతీమణి కర్రోతు లక్ష్మి (పోలిపల్లి), మాజీ ఎంపీపీ మట్టా ఇందుమతి (గూడెపువలస) ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. భోగాపురం జడ్పీటీసీ అభ్యర్థిగా కర్రోతు బంగార్రాజు కుమార్తె కర్రోతు చంద్రకళ నామినేషన్ వేయగా, జనసేన నుంచి గీతకార్మిక కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, జనసేన సీనియర్ నాయకుడు చెల్లుబోయిన నరిసింగరావు సతీమణి చెల్లుబోయిన నవ్యశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కూటమి పార్టీల్లో ఐక్యత లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా కూటమి పెద్దలు కలుగజేసుకుంటారా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. కూటమి ఒకతాటిపైకి వస్తుందా? వస్తే ఎంపీపీ పీఠం, జడ్పీటీసీ స్థానం ఎవరకి దక్కుతుంది? ఒకరికి ఒకరు సహకరించుకుంటారా? అన్నది త్వరలో తేలనుంది.