Share News

Collapses? కూలితేగానీ పట్టించుకోరా?

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:48 PM

Will They Care Only After It Collapses? తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువపై ఉన్న కల్వర్టు పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. ఇది కూలితే.. ఆంధ్రాతో పాటు ఒడిశాకు పూర్తిగా రాకపోకలు స్తంభించనున్నాయి. వాస్తవంగా బ్రిటిష్‌ వారి హయాంలో నిర్మించిన ఈ కల్వర్టుకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు.

 Collapses? కూలితేగానీ పట్టించుకోరా?
తోటపల్లి కాలువపై కల్వర్టు పరిస్థితి ఇదీ..

  • జల వనరులు, ఆర్‌అండ్‌బీ మధ్య కొరవడిన సమన్వయం

  • బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువపై ఉన్న కల్వర్టు పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. ఇది కూలితే.. ఆంధ్రాతో పాటు ఒడిశాకు పూర్తిగా రాకపోకలు స్తంభించనున్నాయి. వాస్తవంగా బ్రిటిష్‌ వారి హయాంలో నిర్మించిన ఈ కల్వర్టుకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఇరువైపులా ఖాళీ ప్రాంతం ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండా జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలతో పాటు ఒడిశా ప్రాంతానికి నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కాగా కల్వర్టుకు ఇరువైపులా మలుపులు, పిచ్చి మొక్కలు ఉండడంతో కొన్నిసార్లు ఈ దారిలో ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు. ప్రధానంగా జల వనరులశాఖ అధికారులు ఈ కల్వర్టు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. అయితే 2006లో ఎడమ ప్రధాన కాలువ నిర్మించడంతో.. దీనివైపు అంతగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం రాకపోకలకే కల్వర్టు పరిమితం కావడంతో జల వనరులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ఈ మార్గంలో రహదారి విస్తరణ బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు అప్పగించంతో ఇరు శాఖల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో కల్వర్టు నిర్మాణానికి నోచుకోవడం లేదు. తోటపల్లికి చెందిన పలువురు ముందుకు వచ్చి కల్వర్టుకు ఆనుకుని రక్షణ గోడలను నిర్మించారు. అయితే భారీ వాహనాలు ఢీకొట్టడంతో యథాస్థితికి చేరుకుంది. నిత్యం ఈ ప్రాంతంలో వాహనదారులు బిక్కుబిక్కుమంటూనే రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ వాసిరెడ్డి రామ్మోహనరావును వివరణ కోరగా.. ‘ప్రధాన కల్వర్టుకు ఆనుకుని నిర్మాణం చేపట్టేందుకు రూ. 3 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు నిర్వహిస్తాం. ప్రస్తుతం ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపడుతున్నాం’ అని తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 11:48 PM