Urban Development? పట్టణాభివృద్ధిని పరుగులు పెట్టిస్తారా?
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:56 PM
Will They Accelerate Urban Development? జిల్లాలో కీలక నియోజకవర్గం.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసం ఉంటున్న ప్రాంతం.. అయినప్పటికీ సాలూరు పురపాలక సంఘం అభివృద్ధి ఎవరికీ పట్టడం లేదు. గత వైసీపీ పాలకవర్గం మున్సిపాల్టీలో ప్రజా సమస్యలను గాలికొదిలేసింది.
నేడు బాధ్యతల స్వీకరణ
గాడి తప్పిన ‘పుర’పాలన
నిధులున్నా పూర్తికాని పనులు
మున్సిపాల్టీలో అధికారుల తీరుపై విమర్శలు
సాలూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కీలక నియోజకవర్గం.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసం ఉంటున్న ప్రాంతం.. అయినప్పటికీ సాలూరు పురపాలక సంఘం అభివృద్ధి ఎవరికీ పట్టడం లేదు. గత వైసీపీ పాలకవర్గం మున్సిపాల్టీలో ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ చేపట్టలేదు. ఇక్కడి అధికారులు కూడా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు మంజూరవుతున్నా.. పూర్తిస్థాయిలో ఖర్చుచేయలేని స్థితిలో ఉన్నారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చు. నేడు మున్సిపాల్టీ నూతన కమిషనర్‌గా బి.శంకరరావు బాధ్యతలు స్వీకరించనున్న నేప థ్యంలో పట్టణ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పురపాలక సంఘంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.
ఇవీ సమస్యలు
- సాలూరు దండిగాం రోడ్డులో ఎనిమిదేళ్ల కిందట సుమారు రూ.36 లక్షలతో నిర్మించిన రైతు బజార్‌ను నేటికి వినియోగంలోకి రాలేదు. పట్టణంలో మాంసం, చేపల దుకాణాలనైనా అక్కడికి పంపిస్తే బజార్ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
- మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 2016లో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. అందులో 13 షాపులు నిరుపయోగంగా మారాయి. కొన్నేళ్లుగా వాటి ఎలాంటి అద్దెలు రావడం లేదు. ప్రస్తుతం అవి పూర్తిగా పాడయ్యాయి.
- పట్టణంలో సామూహిక మరుగుదొడ్లు పూర్తిగా మరమ్మతులకు గురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పట్టణ రహదారికి ఇరువైపులా రోడ్లు, కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడ పడితే అక్కడే మున్సిపాల్టీ స్థలంలో యథేచ్ఛగా షాపుల నిర్మాణం చేపడుతున్నారు.
- ఇకపోతే మున్సిపాల్టీలో 15కు పైగా పైలెట్ వాటర్ స్కీంలు మూలకు చేరాయి. వాటి రిపేరుపై ఎవరూ దృష్టి సారించడం లేదు. మరోవైపు పట్టణంలో పార్క్‌లేవీ వినియోగంలో లేవు. ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ప్రాతిపాదనలకే పరిమితమైంది.
- మున్సిపాల్టీ కార్యాలయంలోని కీలక విభాగాల్లో పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.
- పట్టణంలో 14 స్వర్ణ వార్డు సచివాలయాలు ఉన్నాయి. అయితే దాదాపుగా అన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
- సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, బైపాస్ రోడ్డులో విద్యుదీకరణ పనులకు మోక్షం కలగడం లేదు. అవన్నీ ప్రతిపాదలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు బైపాస్ రోడ్డులో 15 మందికి పైగానే మృత్యువాత పడినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక పెద్దబజార్‌ను పట్టించకునే వారే కరువయ్యారు. సాలూరు డంపింగ్‌యార్డులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా అధికారుల పర్యవేక్షణ లోపం మున్సిపల్ అభివృద్ధికి శాపంగా మారింది.
ఖాతాల్లోనే నిధులు..
పట్టణాభివృద్ధికి కేంద్రం నిధులు మంజురు చేస్తున్నా.. పనులు మాత్రం జరగడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.50 కోట్లు, బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ రూ.66 లక్షలు, కాలువ పూడిక తీతకు రూ.24 లక్షలు, పెద్దబజార్ అభివృద్ధికి ఎన్నో ఏళ్ల కిందట రూ.50 లక్షలు మంజూర య్యాయి. బుడా నిధులు రూ.1.07 కోట్లతో పాటు ఇటీవల హెచ్‌ఏఎం కింద రూ.31 కోట్లు మంజురయ్యాయి. అయితే ఈ నిధులన్నీ ఆయా ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. మున్సిపాల్టీ ఆదాయాన్ని పెంపునకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
తరచూ అధికారుల మార్పు
ఈ ఏడాది ఆగస్టులో కమిషనర్ రత్నకుమార్ రిటైర్డ్ అయ్యారు. సెప్టెంబరులో ఇన్‌చార్జి కమిషనర్‌గా డీఈ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అయితే సర్, తుఫాన్ విధుల్లో నిమగ్నమవడంతో మున్సిపాల్టీలో ప్రత్యేక మార్కు చూపించలేకపోయారు. గత ఐదేళ్లలో పది మంది కంటే ఎక్కువగానే కమిషనర్లు మారారు. ఇద్దరు ప్రత్యేకాధికారులు మారారు. అభివృద్ధి మాత్రం ఏమీ జరగలేదు. నూతన కమిషనర్ అయినా పురపాలనపై దృష్టి సారించి.. గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.