Will there be factory crushing?ఫ్యాక్ట‘రీ క్రషింగ్’ ఉంటుందా?
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:32 AM
Will there be factory crushing? ఉమ్మడి జిల్లాకు ఏకైక ఆధారమైన సంకిలి ఈఐడీ ప్యారీ(ఇండియా) చక్కెర కర్మాగారం అందరూ అనుమానిస్తున్నట్టే చెరకు రైతులకు షాక్ ఇచ్చింది. ఈఏడాది క్రషింగ్ సీజన్‌కు డోకా లేకపోయినా, 2027-28 క్రషింగ్ సీజన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రైతులు చెరుకు సాగుకు విరామం ఇవ్వాలని సూచించింది. ఈ ప్రకటనతో చెరుకు రైతుల్లో కలవరం మొదలైంది. సూపర్ ఎల్‌నినో పరిస్థితులతో ఒక్క క్రషింగ్ సీజన్ మూసివేస్తున్నట్లు ప్రకటించినా, తర్వాత క్రషింగ్ సీజన్ యథావిధిగా సాగుతుందో.. లేదోనని సందేహ పడుతున్నారు.
ఫ్యాక్ట‘రీ క్రషింగ్’ ఉంటుందా?
సంకిలి కర్మాగారం లాకౌట్ దిశగా అడుగులా..!
మనుగడపై రైతుల్లో సందేహాలు
ఒక క్రషింగ్ సీజన్‌కే స్పష్టత ఇచ్చిన యాజమాన్యం
అనిశ్చితిలో తర్వాత క్రషింగ్
సూపర్ ఎల్‌నినో పేరుతో బ్రేక్ ఇవ్వనున్న ఫ్యాక్టరీ
ఉమ్మడి జిల్లాకు ఏకైక ఆధారమైన సంకిలి ఈఐడీ ప్యారీ(ఇండియా) చక్కెర కర్మాగారం అందరూ అనుమానిస్తున్నట్టే చెరకు రైతులకు షాక్ ఇచ్చింది. ఈఏడాది క్రషింగ్ సీజన్‌కు డోకా లేకపోయినా, 2027-28 క్రషింగ్ సీజన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రైతులు చెరుకు సాగుకు విరామం ఇవ్వాలని సూచించింది. ఈ ప్రకటనతో చెరుకు రైతుల్లో కలవరం మొదలైంది. సూపర్ ఎల్‌నినో పరిస్థితులతో ఒక్క క్రషింగ్ సీజన్ మూసివేస్తున్నట్లు ప్రకటించినా, తర్వాత క్రషింగ్ సీజన్ యథావిధిగా సాగుతుందో.. లేదోనని సందేహ పడుతున్నారు.
రేగిడి, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి):
భవిష్యత్ క్రషింగ్‌పై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడంతో చెరుకు రైతులు అయోమయంలో పడ్డారు. ఫ్యాక్టరీ మనుగుడపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. లాకౌట్ దిశగా అడుగులు పడుతున్నట్లు రైతులు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ మనుగడ అనేది వందలాది ఉద్యోగుల, వేలాది రైతుల భవిష్యత్‌తో ముడిపడి ఉంది. తాజా పరిణామాలపై ప్రభుత్వ నేతలు ఉదాసీనంగా వ్యవహరించకుండా సమస్యను తక్షణం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. యాజమాన్య ప్రకటనపై రైతులను కూడగట్టి పోరుబాటకు సిద్ధం చేయాలని రైతుసంఘం భావిస్తోంది.
సుగర్ ఫ్యాక్టరీ నేపథ్యం ఇలా..
రాజాంకు చెందిన పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జునరావు 1997లో సంకిలిలో చక్కెర పరిశ్రమను స్థాపించారు. అనతి కాలంలోనే దీనికి అనుబంధంగా పవర్‌ప్లాంట్, డిస్టలరీ(ఇథనాల్) ప్లాంట్‌లు ఏర్పడ్డాయి. నాడు రైతుల నుంచి దాదాపు 200 ఎకరాల
వరకు భూసేకరణ చేసి కార్మగారం స్ధాపించారు. 12ఏళ్ల పాటు నడిపిన జీఎంఆర్ తర్వాత కాలంలో చెన్నై ఈఐడీ ప్యారీ సంస్థకు ప్లాంట్‌ను విక్రయించారు. అయితే ఫ్యాక్టరీ 30 ఏళ్లుగా తిరుగులేకుండా ముందుకు నడిచింది. ఒక దశలో(2006) ఏడాదికి 6లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు పంటను గానుగాడింది. మొదట్లో రోజుకు 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో నడిచిన ప్లాంట్ అనతి కాలంలో రోజుకు 5000 టన్నుల క్రషింగ్ మార్క్‌ను దాటింది. పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేల మందికి పైబడి ఉపాధి అందించిన చరిత్ర ఉంది. అయితే గత నాలుగేళ్లుగా చెరుకు సాగు గణనీయంగా తగ్గింది. ఇందుకు మేనేజ్‌మెంట్ నిర్ణయాలు కూడా దోహదపడుతున్నాయి. ఓసారి జీఎం వచ్చి డిస్టలరీ ప్లాంట్‌ను ప్రోత్సహించి కేన్‌సిబ్బందిని తొలగించారు. చెరుకు పంట విస్తీర్ణం పెరిగేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రైతులనూ ప్రోత్సహించలేదు. వెరసి ఈఏడాది క్రషింగ్ సామర్థ్యం 50వేల మెట్రిక్ టన్నులకు పడిపోయినట్లు రైతులు చెబుతున్నారు. మరోవైపు వచ్చే సీజన్‌లో క్రషింగ్ ఉండదని యాజమాన్యం ప్రకటించింది. దీంతో రైతుల్లో సందేహాలు పెరిగాయి. ఫ్యాక్టరీ మనుగడ సాగిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
లాకౌట్‌కు అడుగులా..?
సూపర్ ఎల్‌నినోతో 2027-28 క్రషింగ్ సీజన్‌కు రైతులు చెరుకు సాగు చేయొద్దు అని యాజమాన్యం ప్రకటించడం, తర్వాత క్రషింగ్ సీజన్ గురించి ప్రస్తావించకపోవడంపై రైతుల్లో అయోమయం నెలకొంది. ఫ్యాక్టరీ మూత ఏడాదికేనా లేక లాకౌట్‌కు అడుగులా అన్న చర్చ రైతుల్లో బలంగా వినిపిస్తోంది. దీనిపై యాజమాన్యం సరైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కర్మాగార ఫీల్డ్‌స్టాఫ్, ఉన్నతోద్యోగులను దశలవారీగా తొలగించడం, కొందరిని బదిలీ చేయడం, కేన్ డివిజన్ ప్రాంతీయ కార్యాలయాలు దశలవారీగా ఎత్తివేయడం తదితర పరిణామాలను గమనిస్తున్న రైతులు పరిశ్రమ లాకౌట్ అయ్యేలా ఉందంటున్నారు.
సుగర్ ఫ్యాక్టరీ నడిచేలా చూడాలి
కర్రి పోలయ్య, చెరకు రైతు, సంకిలి
మా గ్రామంలో 200 ఎకరాలు ఇచ్చి సుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించాం. రైతులు బాగుంటారనే అప్పట్లో తక్కువ ధరకు భూములు ఇచ్చాం. ఇప్పుడు యాజమాన్యం చెక్కర పరిశ్రమను ఒక ఏడాది మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత ఏడాది కోసం ఏమీ ప్రస్తావించలేదు. ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకొని ఫ్యాక్టరీ నడిచేలా చూడాలి. లేదంటే మా భూములు వెనక్కు ఇచ్చేయాలి.
ఫ్యాక్టరీ పరిస్థితి బాగాలేకే
వెంకట్ సూర్యతేజ, జీఎం, సంకిలి సుగర్స్
సూపర్ ఎల్‌నినో, ఇతర కారణాలతో చెరకు సాగు పూర్తిగా పడిపోవడం, చక్కెర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉండడంతో 2027-28 క్రషింగ్ సీజన్ నిలిపివేస్తున్నాం. ఈ విషయాన్ని రైతులకు ముందుగానే తెలియజేశాం. తర్వాత సీజన్ కోసం ఏమీ నిర్ణయం తీసుకోలేదు. లాకౌట్ అనేది ఇప్పుడే చెప్పలేం.