Will there be a yield? దిగుబడి వస్తుందా?
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:45 PM
Will there be a yield? వేపాడ మండలం బొద్దాం శివారు కొత్తబొద్దాంకు చెందిన రైతు దేముడుకు రెండు ఎకరాల పొలం ఉంది. జూలై నుంచి ఆగస్టు మధ్యలో అడపాదడపా పడిన చినుకులకు పొలంలో చేరిన నీరు సరిపోక సమీపంలో ఉన్న చెరువు నుంచి ఇంజన్ ద్వారా నీళ్లు తోడి ఓ ఎకరంలో ఉబాలు పూర్తిచేశాడు.
దిగుబడి వస్తుందా?
ఇటీవల వర్షాలకు ఒకరిని చూసి ఒకరు నాట్లు
చెరువులు నిండడంతో రైతుల్లో ధీమా
ఎంతోకొంత దిగుబడులు వస్తాయని నమ్మకం
అంతలోనే ఎండలు చూసి పెరుగుతున్న సందేహం
శృంగవరపుకోట, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి):
- వేపాడ మండలం బొద్దాం శివారు కొత్తబొద్దాంకు చెందిన రైతు దేముడుకు రెండు ఎకరాల పొలం ఉంది. జూలై నుంచి ఆగస్టు మధ్యలో అడపాదడపా పడిన చినుకులకు పొలంలో చేరిన నీరు సరిపోక సమీపంలో ఉన్న చెరువు నుంచి ఇంజన్ ద్వారా నీళ్లు తోడి ఓ ఎకరంలో ఉబాలు పూర్తిచేశాడు. మిగిలిన ఎకరా పొలంలో కూడా ఇటీవల కురిసిన వర్షాలకు వరినాట్లు వేశాడు. ఆ తర్వాత వరుసగా కాస్తున్న ఎండలు చూసి దిగుబడిపై భయపడుతున్నాడు.
వాయుగుండం ప్రభావంతో గత వారం జిల్లాలో మంగళవారం నుంచి గురువారం వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. చెరువులు, బందలు, నేలబావులు తదితర సాగునీటి వనరుల్లో సమృద్ధిగా నీరు చేరింది. దీంతో ఒకరిని చూసి మరొకరు వరినాట్లు వేశారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిన పరిస్థితిలో పదిరోజుల కిందటి వరకూ చాలా మంది రైతులు నాట్లుకు వెనకడుగు వేశారు. ఆ తర్వాత కురిసిన వానలకు ఆశలు చిగురించి ఉబాలుకు దిగారు. కనీసం తిండి గింజలైనా చేతికి వస్తాయన్న ఆలోచనతో ముందుపడ్డారు. ఈ వారం చూస్తే మళ్లీ ఎండలు మండుతున్నాయి. దీంతో రైతులంతా సందేహంలో పడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి వర్షాలు లేవు. అప్పుడప్పుడు వర్షం పడినప్పటికీ వరి నాట్లు నాటేందుకు అనుగుణంగా పొలాల్లో నీరు చేరలేదు. జూలై, ఆగస్టు నెలల్లో కూడా జిల్లాలో సాధారణం కంటే 37.22 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఆగస్టు నెలాఖరులో వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. దీంతో జిల్లాలో అప్పటివరకు 90 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. అవి కూడా రిజర్వాయర్‌లు, బావులు, మోటార్లు వున్న ప్రాంతాల్లో మాత్రమే వేయగలిగారు. సెప్టెంబరు 21 వరకు జిల్లాలో సరైన వర్షాలు లేవు. ఈ పరిస్థితిలో రిజర్వాయర్‌ల నీటి మట్టాలు పడిపోయాయి. బావుల్లోనూ నీళ్లు అట్టడుగుకు వెళ్లాయి. బోర్లు దాదాపుగా మందగించాయి. పిలక దశకు రావాల్సిన పంట భూమిలోనే వుండిపోయింది. వారం కిందటి వరకు చెరువుల్లో చుక్క నీరు లేదు. ఇక ఈ ఏడాది ఖరీఫ్‌పై రైతన్న ఆఽశ వదిలేసుకున్నాడు. పంట మాట దేవుడెరుగు రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బందులు పడాల్సివస్తుందేమోనేని ఆందోళన చెందారు. ఇలాంటి పరిస్థితిలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో విరివిగా వర్షాలు పడ్డాయి. దీంతో అన్నదాతల్లో ఓపక్క అనందం.. మరో పక్క సందిగ్ధం కనిపించింది. ఎంతోకొంత దిగుబడులు రాకపోతాయానని ఉబాలుకు సిద్ధపడ్డారు. అత్యధిక శాతం మంది వరి నాట్లు వేసేందుకే మొగ్గుచూపారు. వరి నారు కోసం పొలంలో విత్తనాలు జల్లి అప్పటికే రెండు నెలలు దాటడంతో నారు బాగా ముదిరిపోయింది. అయినా నారు సరిపడినంత వరకు ఉబాలు చేపట్టారు. తాజాగా చేపట్టిన వరి నాట్లుకు ఒకే దఫా యూరియాను వాడకుండా రెండు మూడు దఫాలు కొంచెం, కొంచెం వాడాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఏదైనాగాని గతం వారం పరిస్థితితో పోల్చుకుంటూ ప్రస్తుత వాతావరణం చూసి రైతులు అయోమయంలో పడుతున్నారు.