Share News

Municipal Corporation? పురపాలక సంఘంలో ప్రక్షాళన జరిగేనా?

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:11 AM

Will There Be a Clean-Up in the Municipal Corporation? జిల్లాకేంద్రం పార్వతీపురం పురపాలక సంఘాన్ని అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పలు విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయి అధికారులను నియమించడం లేదు. కింది స్థాయి సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాలన గాడి తప్పుతోంది. మున్సిపాల్టీ ఆదాయానికి గండిపడుతోంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

 Municipal Corporation? పురపాలక సంఘంలో  ప్రక్షాళన జరిగేనా?
పార్వతీపురం మున్సిపాల్టీ కార్యాలయం

  • కొన్నాళ్లుగా కీలక పోస్టులు ఖాళీ.. ప్రధాన విభాగాల్లో అధికారులు నిల్‌

  • క్షేత్రస్థాయి స్బిబందితో నెట్టుకొస్తున్న వైనం

  • అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లపై ప్రభావం

  • ప్రజలకు పూర్తిస్థాయిలో అందని సేవలు

  • మున్సిపల్‌ నూతన పాలకవర్గంపైనే ఆశలు

పార్వతీపురం టౌన్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురం పురపాలక సంఘాన్ని అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పలు విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయి అధికారులను నియమించడం లేదు. కింది స్థాయి సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాలన గాడి తప్పుతోంది. మున్సిపాల్టీ ఆదాయానికి గండిపడుతోంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. గత ఏడాదిన్నర కాలంలో సుమారు ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించిన అనంతరం డిప్యూటేషన్‌, బదిలీలపై వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరోవైపు ఇంజనీరింగ్‌, రెవెన్యూ, పట్టణ ప్రణాళికా విభాగాల్లోనూ ప్రధాన అధికారులు లేరు. ఈ ప్రభావం ప్రజారోగ్య విభాగం, అభివృద్ధి పనులపై కూడా పడుతుంది. దీనిపై నూతన పాలకవర్గం దృష్టి సారించి పుర పాలనను గాడిలో పెట్టాలని, మున్సిపాల్టీలో పలు విభాగాలను ప్రక్షాళన చేయాలని జిల్లాకేంద్రవాసులు కోరుతున్నారు.

తాగునీటి సరఫరా విభాగంలో..

పార్వతీపురం మున్సిపాల్టీలోని ఇంజనీరిగ్‌ విభాగంలో డీఈ శ్రీనివాసరాజు, ఏఈ అప్పారావులు మెడికల్‌ లీవ్‌పై వెళ్లిపోయారు. గత నాలుగు నెలలుగా ఆ కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. మరో ఏఈ సన్యాసిరావు ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో తాగునీటి సరఫరానే కాదు.. వీధి దీపాల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. బొబ్బిలి మున్సిపాల్టీ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన డీఈ కిరణ్‌, సచివాలయ ఇంజనీరింగ్‌ సిబ్బందితో ప్రస్తుతం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం పరిపాలన సాగుతుంది. ప్రస్తుతం పట్టణంలో 36 వార్డుల్లో ప్రజలకు వారం, పది రోజులకొకసారి మాత్రమే కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. 70 వేలకు పైగా ఉన్న జనాభాకు రోజుకు 50 వేల లీటర్లు సరఫరా చేయాల్సి ఉంది. కానీ వారానికి కనీసం 50 నుంచి 70 లీటర్ల తాగునీటిని కూడా ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు సరఫరా చేయలేక పోతున్నారు. ఇదిలా ఉండగా ఏటా తాగునీటి సరఫరాకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సాధారణ నిధులను ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చూపుతున్నారు. అయితే ప్రజలకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. రానున్న వేసవి సీజన్‌లోగా డీఈ, ఏఈలను నియమించకపోతే పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు రెట్టింపయ్యే అవకాశం ఉంది.

రెవెన్యూ విభాగంలో..

పురపాలక సంఘం రెవెన్యూ విభాగంలో గత ఐదు నెలలుగా ప్రధాన అధికారి లేరు. దీంతో పన్నుల వసూళ్లపై పర్యవేక్షణ కొరవడింది. ప్రస్తుతం సచివాలయ అధికారులు, సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. కిందస్థాయి ఉద్యోగులపై పన్నులు వసూళ్ల భారం పడుతుండడంతో రోజు రోజుకూ మున్సిపాల్టీ ఆదాయం తగ్గుతోంది. రెవెన్యూ విభాగంలో ప్రధాన అధికారి ఈ ఏడాది మే నెలలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆర్‌ఐ-2 ఈశ్వరరావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారనే కారణంతో ఆయన్ని సస్పెండ్‌ చేశారు. దీంతో మున్సిపల్‌ రెవెన్యూ విభాగం ఆర్‌ఐ-1 వినయ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఏడాది కిందట నుంచి మున్సిపాల్టీలో మేనేజర్‌ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పుర ఎన్నికలకు ముందు సాలూరు మున్సిపాల్టీకి చెందిన ఆర్‌వో ఆశిష్‌కుమార్‌ పార్వతీపురం మేనేజర్‌గా నియమించారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన తరచూ సెలవు పెడుతున్నారు. మరోవైపు వారంలో రెండు రోజులు పార్వతీపురం, మూడు రోజులు సాలూరులో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

పట్టణ ప్రణాళిక విభాగంలో...

గత రెండేళ్లుగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఏ బాధ్యతలు స్వీకరిస్తారో.. ఎప్పుడు డిప్యూటేషన్‌పై వెళ్లిపోతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇదే అదునుగా పట్టణంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏడాది కిందట విశాఖ గ్రేటర్‌ కార్పొరేషన్‌ నుంచి బదిలీపై వచ్చిన వెంకట నారాయణ పట్టణ ప్రణాళిక విభాగం అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు ఆయా విభాగాల అధికారులతో వాగ్వాదాలు, ఘర్షణలు పడుతుండేవారు. అంతే కాకుండా తరచూ సెలవులపై వెళ్లిపోవడం వల్ల కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. మరోవైపు పుర ఎన్నికల సమయంలో.. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించడం వల్ల టీపీవో నారాయణను సస్పెండ్‌ చేశారు. వాస్తవంగా ఈ విభాగంలో ముగ్గురు అధికారులు ఉండాలి. కానీ ఉన్న ఒక్కాగానొక్క అధికారి కూడా సస్పెండ్‌ కావడంతో ఆ విభాగం గాడి తప్పుతుంది.

ఉన్నతాధికారులకు నివేదించా..

ఇంజనీరింగ్‌, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల్లో అధికారుల కొరతపై రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన విభాగం ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్‌కు నివేదికలు అందజేశాం. అంతే కాకుండా ఆయా విభాగాల్లో ప్రస్తుతం ఉన్న అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసి.. పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్‌ నూతన పాలకవర్గంతో చర్చించి.. అధికారుల భర్తీకి చర్యలు తీసుకుంటాం.

- బి.రామ్‌ గోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పార్వతీపురం

Updated Date - Nov 17 , 2026 | 12:11 AM