Will Thirst Be Quenched? పనులు పూర్తయ్యేనా.. గొంతు తడిపేనా?
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:00 AM
Will the Works Be Completed… Will Thirst Be Quenched? భామిని మండలంలోని జల్‌జీవన్‌మిషన్ (జేజేఎం) పనులు కొలిక్కిరావడం లేదు. గడువు ముంచుకొస్తున్నా.. నిర్మాణాలు ఊపందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జూలై నాటికి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి కని పించడం లేదు.
ముంచుకొస్తున్న గడువు
జూలైలోగా నిర్మాణాల పూర్తిపై సందేహాలు
కొన్నిచోట్ల పైప్‌లైన్, కుళాయిల ఏర్పాటుతో సరి
గ్రామీణులకు తప్పని తాగునీటి ఇక్కట్లు
భామిని, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): భామిని మండలంలోని జల్‌జీవన్‌మిషన్ (జేజేఎం) పనులు కొలిక్కిరావడం లేదు. గడువు ముంచుకొస్తున్నా.. నిర్మాణాలు ఊపందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జూలై నాటికి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి కని పించడం లేదు. వాస్తవానికి గత ఏడాది జూలైలోనే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. జూన్ మొదటి వారంలో వంశధార నదికి వరద పోటెత్తింది. దీంతో సింగిడి వద్ద నదీ గర్భంలో జరు గుతున్న పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై వరకు గడువు పెంచారు. అయితే ప్రస్తుత పనులు చూస్తే.. నత్తకు పోటీపడేలా సాగుతున్నాయి. వేసవి నేపథ్యంలో.. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని మండల వాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- జలజీవన్‌మిషన్‌లో భాగంగా మండలంలో 54 గ్రామాల్లో కుళాయిల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ఇందు కోసం 40 వాటర్ ట్యాంక్‌లను నిర్మించాల్సి ఉంది. అన్ని గ్రామాలకు ఒకే రక్షిత పథకం ద్వారా నీటి సరఫరా చేసేందుకు గత రెండేళ్ల కిందట కేంద్రం రూ.60 కోట్లు మంజూరు చేసింది.
- సింగిడి సమీపంలో వంశధార నదిలో బావులను నిర్మించి.. మోటార్ల ద్వారా పసుకుడి కొండపైన 90 వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుకు నీటిని తరలించాల్సి ఉంది. అటు బత్తిలి, ఇటు కొరమ వరకు పైపులైన్ ద్వారా తాగునీరు అందించాలన్నదే ఈ పథకం ఉద్దేశం.
- సింగిడి వద్ద వంశధార నదిలో బావి , అండర్ గ్రౌండ్ పైపులైన్ పనులతో పాటు వాటర్ ట్యాంకు, పైపులైన్ పనులు పూర్తిచేయలేకపోతున్నారు. సబ్ కాంట్రాక్టర్లు తరచూ మారుతుం డడమే ఈ పరిస్థితి కారణం. మొత్తంగా మండలంలో 72 కిలోమీటర్లు మేర పైపులైన్లు వేయాల్సి ఉండగా ... అరకొరగానే పనులు జరుగుతున్నాయి. మరోవైపు గ్రామాల్లో పైపులైన్ల ఏర్పాటు కోసం సీసీ రోడ్లు, కాలువలు తవ్వి వదిలేయడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు.
- నేరడి, బిల్లుమడ, భామిని, ఇసుకగూడ గ్రామాల్లో పైపులైన్ వరకే జేజేఎం పనులు పరిమితమయ్యాయి.
- వంశధార నది గర్భంలో రెండు బావులు, నదీతీరాన మరో బావిని నిర్మించేందుకు డిజైన్ చేశారు. నదీతీరాన 9 మీటర్ల వెడల్పు 15 మీటర్లు లోతున బావి పనులు పూర్తయ్యాయి. నదీ గర్భంలో ఆరు మీటర్ల వెడల్పు 15 మీటర్ల లోతుగా రెండు బావి పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఇక రెండో బావి నుంచి నదీ తీరంలో ఉన్న బావికి అనుసంధానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇసుక తవ్వుతున్న కొలదీ నీరు ఊరుతుండడంతో నదీ గర్భంలో 110 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ పైపులైన్ పనులు ముందుకు సాగడం లేదు.
- పసుకుడి కొండ మీద ఏర్పాటు చేస్తున్న వాటర్ ట్యాంక్ పనులు పూర్తికాగా మండలంలో 40 వాటర్ ట్యాంకులకు గాను 17 పూర్తయ్యాయి.
మే 15లోగా పూర్తి చేస్తాం..
వంశధార నదీ గర్భంలో పైపులైన్ల పనులను మే 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మండలంలో 40 వాటర్ ట్యాంక్‌లు నిర్మించాల్సి ఉండగా 17 రక్షిత నీటి పథకం ట్యాంకు పనులు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులు పూర్తయ్యాక సింగిడి వద్ద 95 హెచ్‌పీతో కూడిన రెండు మోటార్లు ఏర్పాటు చేసి పసుకుడి కొండపై ఉన్న ట్యాంక్‌ను నీటిని పంపించేందుకు చొరవ తీసుకుంటాం.
- ఎ.సందీప్ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, భామిని