Works Be Completed… పనులు పూర్తయ్యేనా.. గొంతు తడిపేనా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:15 PM
Will the Works Be Completed… or Just Empty Promises? ఇంటింటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో చేపట్టిన జల్ జీవన్‌మిషన్ (జేజేఎం) పనులు పూర్తిగా పడకేశాయి. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం.
సకాలంలో బిల్లులు చెల్లించని వైసీపీ సర్కారు
చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
కూటమి ప్రభుత్వంపైనే ఆ భారం
మన్యంవాసులకు తప్పని తాగునీటికష్టాలు
పార్వతీపురం,ఫిబ్రవరి17(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో చేపట్టిన జల్ జీవన్‌మిషన్ (జేజేఎం) పనులు పూర్తిగా పడకేశాయి. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. వాస్తవంగా 2022, ఫిబ్రవరి 16న ఈ పనులకు శ్రీకారం చుట్టారు. జీవో నెంబరు 918, 917 ప్రకారం 2013 పనులకు రూ.289 కోట్లు మంజూరు చేశారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రావడం లేదు. అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు వాటిపై దృష్టిసారించడం లేదు. కొన్ని చోట్ల కుళాయిలు ఏర్పాటు చేసినా.. నీరు సరఫరా చేయడం లేదు. దీంతో అవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మొత్తంగా జిల్లావాసులు తాగునీటి కష్టాలు ఎదుర్కోవల్సి వస్తోంది.
ఇదీ పరిస్థితి..
- పార్వతీపురం నియోజకవర్గంలో రూ.28కోట్లతో 171 జేజేఎం పనులు మంజూరు చేయగా ఇప్పటివరకు కేవలం 115 పనులు మాత్రమే పూర్తి చేశారు. 47 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 9 పనులు పూర్తిగా ప్రారంభం కాలేదు. 66 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి.
- సాలూరులో 489 పనులకు గాను రూ. 76కోట్లు మంజూరు చేశారు. 298 పనులు పూర్తి చేశారు. 66 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 130 పనులు ప్రారంభం కాలేదు.
- పాలకొండలో 730 పనులను రూ. 121 కోట్ల అంచనాలతో చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 194 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 397 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 147 పనులు ప్రారంభం కాలేదు.
- కురుపాంలో 615 పనులకు రూ.65 కోట్లు మంజూరు చేశారు. అయితే 176 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 131 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. మరో 308 పనులు ప్రారం భం కాలేదు. మొత్తంగా జిల్లాలో 773 పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. మరో 646 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. వాటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
బిల్లుల పెండింగ్...
గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదు. నేటికీ బిల్లులు పెండిం గ్‌లోనే ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో సుమారు రూ.21 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. అవి మంజూర కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు నిలిపివేశారు.
సెలవులో జిల్లా అధికారి...
ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ జిల్లా అధికారిగా జాయిన్ అయిన రజాక్ ఆరు నెలల్లో.. కొన్ని నెలలు సెలవు పెట్టారు. ఇప్పుడు మెడికల్ లీవ్‌పై వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ద్వారా చేపడుతున్న నిర్మాణాలతో పాటు జేజేఎం పనులను పర్యవేక్షించే వారే కరువయ్యారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.