Share News

మల్టీ స్పెషాలటీ ఆసుపత్రుల పనులు పూర్తయ్యేనా?

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:33 PM

మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని, ఇక గడువు పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తూ కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

 మల్టీ స్పెషాలటీ ఆసుపత్రుల పనులు పూర్తయ్యేనా?
సీతంపేటలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి

-ఇక గడువు ఇచ్చేది లేదన్న ప్రభుత్వం

- డిసెంబరులోగా పూర్తి చేయాల్సిందేనని ఆదేశాలు

-పార్వతీపురంలో 60 శాతం..

-సీతంపేటలో 25 శాతం పనుల పెండింగ్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని, ఇక గడువు పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తూ కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమయ్యాయి. ఐదేళ్లలో పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే, డిజైన్లు మార్చడం తదితర సమస్యలు వల్ల రెండేళ్లవుతున్నా పనులు పూర్తికాలేదు. ఇప్పటికే ప్రభుత్వం పార్వతీపురం ఆసుపత్రి పనుల పూర్తికి ఏడాది గడువు ఇచ్చింది. ఇకగడువు పెంచేది లేదని, డిసెంబరులోగా పనులు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్‌శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రూ.49.26 కోట్ల అంచనాతో ప్రారంభమైన పనులు ఇప్పటివరకు రూ.12.5 కోట్ల పనులు అంటే 40 శాతం పూరయ్యాయి. ఇంకా రూ.37 కోట్లు పనులు (60 శాతం) పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు ఎనిమిది నెలల్లో పూర్తవుతాయో? లేదో చూడాలి.

సీతంపేటలో పరిస్థితి..

గత వైసీపీ ప్రభుత్వంలో సీతంపేట మండల కేంద్రంలో రూ.35 కోట్ల అంచనాతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో చేపట్టిన పనులకు జగన్‌ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.30 కోట్లు చెల్లించింది. అధికంగా బిల్లులు చెల్లించినా పనులు పూర్తికాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 75శాతం పనులు జరగ్గా ఇంకా 25శాతం పెండింగ్‌ ఉన్నాయి. దీంతో పనుల వేగవంతానికి ఇంజనీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్వతీపురం, సీతంపేటలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. జిల్లా నుంచి విజయనగరం, విశాఖకు రెఫరల్‌ కేసులు తగ్గుముఖం పడతాయి. ఇప్పటికైనా పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

జూన్‌కు పూర్తిచేస్తాం

సీతంపేట ఆసుపత్రికి సంబంధించి ప్రభుత్వం సుమారు రూ.30 కోట్ల వరకు బిల్లుల చెల్లింపు చేసింది. కాంట్రాక్టర్లకు ఎటువంటి బకాయిలు లేవు. జూన్‌ లోపు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

-సిమ్మన్న, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఏపీఎంఐడీసీ

డిసెంబర్‌లోపు పూర్తి చేయాలి

వాస్తవంగా గత ఏడాది నవంబర్‌లోగా పార్వతీపురం ఆస్పత్రి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ డిజైన్లు మారడం వల్ల ఆలస్యం జరిగింది. సంవత్సరం గడువు కావాలని ప్రభుత్వాన్ని కోరితే గడువు ఇచ్చింది. ఇక ఇదే చివరి గడువు. పనులు డిసెంబరు 31లోగా పూర్తి చేయాలి.

-ప్రసన్నకుమార్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఏపీఎంఐడీసీ, పార్వతీపురం

Updated Date - Apr 24 , 2026 | 11:33 PM