Will the water reach quickly?త్వరగా నీరందుతుందా?
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:36 AM
Will the water reach quickly? పైఫొటోలో ట్యాంకరు నుంచి తాగునీటిని పట్టుకుంటున్న మహిళ శృంగవరపుకోట మండలం కొత్తూరు గ్రామవాసి. రెండు రోజులుగా తాటిపూడి ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా లేక గ్రామానికి చెందిన ట్యాంకరుతో శనివారం తాగునీరు తీసుకువచ్చారు.
త్వరగా నీరందుతుందా?
సాంకేతిక లోపంతోనే నిలిచిన సరఫరా
తాటిపూడి ప్రాజెక్టు కేబుల్ వైరుకు షార్టేజ్
99 గ్రామాల ప్రజలకు అవస్థలు
లోపం తలెత్తిన చోటును గుర్తించలేకపోతున్న అధికారులు
- పైఫొటోలో ట్యాంకరు నుంచి తాగునీటిని పట్టుకుంటున్న మహిళ శృంగవరపుకోట మండలం కొత్తూరు గ్రామవాసి. రెండు రోజులుగా తాటిపూడి ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా లేక గ్రామానికి చెందిన ట్యాంకరుతో శనివారం తాగునీరు తీసుకువచ్చారు. పంచాయతీ కార్యాలయ రోడ్డుకు మహిళలంతా వచ్చి నీళ్లు పట్టుకున్నారు. నీటి సరఫరాకు ఎందుకు ఆటంకం కలిగిందో తొలుత ఎవరికీ తెలియలేదు. ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరాకు ఉపయోగించే కేబుల్ వైరు షార్టేజ్ కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.
తాటిపూడి ప్రాజెక్టు నుంచి రెండు రోజులుగా తాగునీటి సరఫరా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీనివల్ల 99 గ్రామాలకు తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన ప్రాజెక్టు అధికారులు కేబుల్ వైరు షార్టేజ్ ఎక్కడ జరిగిందో నిర్ధారించే పని ఉన్నారు. లోపం తలెత్తిన చోటును గుర్తిస్తేనే నీటి సరఫరా పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. ఎప్పటికి మరమ్మతులు పూర్తి చేస్తారోనని మహిళలు దిగాలు పడుతున్నారు.
శృంగవరపుకోట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
కొద్దిరోజుల పాటు బురద, నురగతో తాగునీరు సరఫరా చేసిన ఘటనలు గతంలో ఉన్నాయి. వారంలో ఒకట్రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా జరగని రోజులూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు నుంచి జరుగుతున్న తాగునీటి సరఫరా గాడిన పడిందని భావిస్తున్న తరుణంలో కేబుల్ షార్టేజ్ అయింది. కాగా ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నడుస్తోంది. వర్షాలు పడడం లేదు. చెరువుల్లో చుక్కనీరు లేదు. వ్యవసాయ బావులు అడుగంటాయి. గ్రామాల్లో వున్న చేతి బోర్ల నుంచి వచ్చే నీరు తాగేందుకు ఏమేరకు సురక్షితమో తెలియదు. ఈ ప్రాజెక్టు నీటికి ప్రజలు బాగా అలవాటు పడ్డారు. అంతకు ముందు గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు స్థానింగా వున్న బోర్ల నుంచి ఏర్పాటు చేసిన లైన్లను కూడా నిలిపేసారు. శృంగవరపుకోట, మామిడిపల్లి, ధర్మవరం గ్రామాలకు మాత్రం గోస్తనీ నదిలో వున్న ఊట బావుల నుంచి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయం వుంది. మిగిలిన గ్రామాలన్నింటికీ తాటిపూడి ప్రాజెక్టు నుంచి జరిగే తాగునీటి సరఫరాయే ఆధారం. నీటిని పునరుద్ధరించే చర్యలు చేపట్టడంలో ప్రాజెక్టు అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ఆయా గ్రామాలకు అప్పుడప్పుడు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
ఫ శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం గంట్యాడ మండలం నక్కలబంద వద్ద తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలోనే జిల్లాకు చెందిన అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రాజెక్టును తీసుకువచ్చారు. కానీ విభజిత ఆంధ్రప్రదేఽశ్‌లో తొలిసారిగా అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వంలో శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి ఈ ప్రాజెక్టు నిధులు వెనక్కిపోకుండా సీఎం నారాచంద్రబాబునాయుడును ఒప్పించారు. మెదటి దళలో 33 అవాసాలకు తాగునీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. రెండో దశలో 66 అవాసాలకు తాగునీరు అందేలా చేసారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారం చేపట్టింది. ఈ ఐదేళ్లు ప్రాజెక్టును గాలికి వదిలేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన లలితకుమారి మిగిలిన గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు నిధులు రాబట్టారు. మూడో దశ పనులు జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు బాగున్నప్పటికీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో తరచూ తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఎక్కడో ఓ చోట సాంకేతిక లోపం ఏర్పడుతోంది. దీన్ని సరిదిద్దేందుకు రెండు, మూడు రోజులకు పైబడి సమయం తీసుకుంటున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
ఫ తాటిపూడి ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా జరుగుతున్న గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం డీఈ పైడిరాజు తెలిపారు.