Share News

కౌలు వివాదం పరిష్కారమయ్యేనా?

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:25 AM

మండలంలోని శ్రీరంగరాజపురం గ్రామంలో సీతారామస్వామి గ్రూపు దేవాలయానికి 47.56 ఎకరాలు ఉన్నాయి.

కౌలు వివాదం పరిష్కారమయ్యేనా?
సీతారామస్వామి ఆలయం

-సీతారామ భూముల వేలం పాటపై కాలయాపన

-12ఏళ్లుగా నిర్వహించని వైనం

-ఈ భూములపై ఇరువర్గాల మధ్య వివాదం

-19న వేలం నిర్వహిస్తామంటున్న అధికారులు

గజపతినగరం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీరంగరాజపురం గ్రామంలో సీతారామస్వామి గ్రూపు దేవాలయానికి 47.56 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను గ్రామానికి చెందిన 18 మంది రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఒక ఎకరాకు రూ.1200 చొప్పున కౌలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతీ మూడేళ్లకు ఒకసారి వేలం పాట నిర్వహించి ఆ భూములను కౌలుకు ఇవ్వాల్సి ఉంది. కానీ, గత 12 ఏళ్లుగా వేలం పాట నిర్వహించడం లేదు. పైగా ఏళ్ల తరబడి కౌలు బకాయిలు కూడా ఉన్నాయి. దీంతో దేవాలయం ఆదాయానికి గండి పడుతుంది. దీప, దూప నైవేద్యాలతో పాటు ప్రతి ఏటా సీతారాముల కల్యాణం కూడా దాతల సహాయంతో జరిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో సెంటు భూమి లేని వారు చాలామంది ఉన్నారని, అటువంటి వారికి దేవాలయ భూములను అప్పగించాలనే డిమాండ్‌ వచ్చింది. తమకు అవకాశం ఇస్తే సాగు చేసుకుని కౌలు చెల్లించుకుంటామని కొంతమంది రైతులు ఇటీవల గ్రామ పెద్దల వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై 18 మంది కౌలు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవదాయ భూమిని తమ తాతల నాటి నుంచి నేటికి 70 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కావాలంటే శిస్తు పెంచుకోవాలని అందుకు, తాము సమ్మతమేనని అన్నారు. ప్రతిఏటా వారే సాగు చేసుకుంటే పేదల పరిస్థితి ఏమిటని గ్రామానికి చెందిన పలువురు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 21న దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ జి.శ్యామ్‌ ప్రసాద్‌, స్థానిక ఈవో శ్రీరామ్‌ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించేందుకు సమాయత్తం కాగా, కౌలు రైతులు అడ్డుకున్నారు. వీరికి రైతుసంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, సీపీఎం నాయకుడు జి.శ్రీనివాస్‌ మద్దతుగా నిలిచారు. రెండు వర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పారు. వేలం పాట నిర్వహణకు పది రోజుల సమయం కావాలని కౌలు రైతులతో పాటు గ్రామ పెద్దలు కోరారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. అయితే, యాభై రోజులు అవుతున్నా ఇంత వరకూ ఆ ఊసే ఎత్తకపోవడంపై గ్రామానికి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, పాలకుల ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. దేవదాయ భూములు చేతులు మారుతున్నాయని దీనిపై సమగ్ర సర్వే చేపట్టి వాటిని పరిరక్షించుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేలం పాట నిర్వహించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై గజపతినగరం దేవదాయశాఖ ఈవో శ్రీరామ్‌ను వివరణ కోరగా.. ‘జిల్లా అదికారుల ఆదేశాల మేరకు ఈనెల 19న సీతారామస్వామి దేవాలయ ప్రాంగణంలో వేలం పాట నిర్వహించాలని నిర్ణయించాం. పాటదారులు పాల్గొనాలి.’అని కోరారు.

Updated Date - Jun 13 , 2026 | 12:25 AM