Will the Targets Be Achieved? లక్ష్యాలు చేరుకుంటారా?
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:50 PM
Will the Targets Be Achieved? మరో మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంటి పన్నుల వసూళ్లకు మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పరుగులు పెడుతున్నారు.
ముగియనున్న ఆర్థిక సంవత్సరం
పన్ను వసూళ్లకు అధికారుల పరుగులు
జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం కూడా వసూలు కాలే..
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్, మార్చి28(ఆంధ్రజ్యోతి): మరో మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంటి పన్నుల వసూళ్లకు మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పరుగులు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే.. పార్వతీ పురం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీల్లో శతశాతం పన్నులు వసూలు కాలేదు. ఏటా మార్చి నెలలో హడావుడి చేస్తే అధికారులు ముందస్తు కార్యచరణ రూపొందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్వతీపురం మున్సిపాల్టీలో ఇంటి, వాణిజ్య సముదాయాల నుంచి రూ.7.72 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.3.88 కోట్లు రాబట్టినట్లు రెవెన్యూ అధికారి డి.రూబేను శనివారం తెలిపారు. ఈనెలాఖరులోగా రూ.3.83 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉందన్నారు. కాగా గత మూడేళ్లలో పరిస్థితిని చూస్తే.. పన్నుల వసూళ్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలున్నాయి. 2023-24లో ప్రైవేటు, ప్రభుత్వ పన్నుల వసూళ్లకు సంబంధించి రూ.13 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.2.61 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన మున్సిపాల్టీగా రికార్డు నెలకొల్పారు. 2024-25లో రూ.14.80 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.4.98 కోట్లు మాత్రమే రాబట్టారు. 2025-26కు గాను ప్రభుత్వ, ప్రైవేట్ పన్నుల వసూళ్లకు సంబంధించి రూ.17.61 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.4.20 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఇంకా మూడురోజులే గడువు ఉండడంతో పన్ను వసూళ్లకు రెవెన్యూ అధికారులు శ్రమిస్తున్నారు.
సాలూరు పురపాలక సంఘంలో రూ.5.28 కోట్ల మేర పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ. 2.46 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు.
పాలకొండ నగరపంచాయతీకి సంబంధించి మొత్తం రూ.మూడు కోట్ల మేర పన్ను బకాయిలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు రూ. 1.73 కోట్ల మేర వసూలు చేశారు.