Share News

జాతరకు రోడ్లు బాగుపడేనా?

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:35 PM

ఉత్తరాంధ్రలో రెండో అతిపెద్ద అమ్మవారి ఉత్సవంగా పేరుగాంచిన శంబర పోలమాంబ జాతర మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది.

జాతరకు రోడ్లు బాగుపడేనా?
మక్కువ-సాలూరు రోడ్డులో పాయకపాడు సమీపంలో అధ్వానంగా ఉన్న దృశ్యం

- వారం రోజుల్లో శంబర ఉత్సవాలు

-అధ్వానంగా రహదారులు

- ఎక్కడికక్కడే గోతులు, రాళ్లు

మక్కువరూరల్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో రెండో అతిపెద్ద అమ్మవారి ఉత్సవంగా పేరుగాంచిన శంబర పోలమాంబ జాతర మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఈ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, భక్తుల రాకపోకలకు అవసరమైన రోడ్లను బాగు చేసేందుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. శంబరకు వచ్చే రోడ్లు గోతులు, రాళ్లతో నిండి ఉండడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ పరిస్థితి..

శంబర జాతరకు వచ్చే భక్తులకు రెండు రోడ్లే ప్రధానమైనవి. ఒకటి సాలూరు-మక్కువ రహదారి, మరొకటి బొబ్బిలి-మక్కువ రోడ్డు. ప్రస్తుతం ఈ రెండు కూడా అధ్వానంగా ఉన్నాయి. శంబర జాతరకు విజయనగరం, ఎస్‌.కోట, రాజాం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడపనుంది. ఈ మేరకు రోడ్లను బాగు చేయాలని మంత్రి సంధ్యారాణి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ, కొంతమంది అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాక్ష్యాత్తు రాష్ట్రమంత్రి, కలెక్టర్‌ స్వయంగా చెప్పి ఆదేశాలిచ్చినా సాలూరు, బొబ్బిలి రోడ్లను జాతరకు సిద్ధం చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్లు పాడైన చోట సిమెంట్‌, ఇసుక మిక్సింగ్‌ వేయడంతో పాటు తారు కూడా వేసి గోతులను కప్పేవారు. దీనివల్ల పండుగ జరిగిన మూడు రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేవి. కానీ, నేడు కనీసం గోతులను కూడా పూర్తిస్థాయిలో పూడ్చటం లేదు. వెట్‌మిక్స్‌ వేస్తున్నామంటూ కొద్దిపాటి సిమెంటు, ఇసుకను 40ఎంఎం మెటల్‌తో కలిపి అక్కడక్కడ గోతుల్లో వేస్తున్నారు. అనంతరం నీటితో తడపకపోవడం, రోలింగ్‌ చేయకపోవడంతో రాళ్లు తేలి మళ్లీ గోతులు ఏర్పడుతున్నాయి. మక్కువ-సాలూరు రోడ్డు బాగు చేయకపోవడంతో బాగువలస నుంచి మక్కువకు వచ్చే సుమారు 15గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా సాలూరు మీదుగా శంబర వెళ్లాలంటే చుట్టూ తిరిగి రానుపోను 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే మక్కువ మీదుగా అయితే 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శంబరకు చేరుకోవచ్చు. జాతరకు వారం రోజులే సమయం ఉన్నందున ఇప్పటికైనా ఈ రోడ్లను బాగు చేయాలని భక్తులు కోరుతున్నారు.

పూర్తికాని గోముఖి కాజ్‌వే

పార్వతీపురం, బొబ్బిలితో పాటు పలు ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, నాటుబళ్లతో భక్తులు జాతరకు చేరుకోవాలంటే శంబర పణుకు వీధి సమీపంలో గోముఖి నదిపై నిర్మించిన కాజ్‌వేను దాటాలి. అయితే, ఈ కాజ్‌వే పనులు పూర్తికాలేదు. గతేడాది కూటమి ప్రభుత్వం గోముఖి నదిపై రూ.9లక్షలతో కాజ్‌వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే, చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. కాజువేకు రెండు పక్కల అప్రోచ్‌ రోడ్డుతో పాటు కాజువే నుంచి పణుకు వీధివరకు రోడ్డు నిర్మించలేదు. కాజ్‌వేకు రెండు పక్కలా కలిపేందుకు మెటల్‌ కుప్పలు వేసి వదిలేశారు. దీంతో ఈ ఏడాది భక్తులకు ఇబ్బందులు తప్పేలాలేవు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ జేఈ విజయకుమార్‌ను వివరణ కోరగా.. ‘శంబర పండుగకు ముందే రోడ్లు బాగుచేస్తాం. కాజువేకు రెండువైపులా అప్రోచ్‌ రోడ్లు వేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

పోటోలు=19మక్కువరూరల్‌. 1.మక్కువ-బొబ్బిలి రోడ్డులో గోతులు పూడ్చని దృశ్యం

.2. సాలూరు-మక్కువ రోడ్డులో పాయకపాడు సమీపంలో అధ్వానంగా ఉన్న దృశ్యం

3. శంబర పణుకు వీధి సమీపంలో అసంపూర్తిగా గోముఖి కాజ్‌వే

Updated Date - Jan 19 , 2026 | 11:35 PM