Will the revenue clinics click! రెవెన్యూ క్లినిక్‌లు క్లిక్ అవుతాయా!
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:44 PM
Will the revenue clinics click! జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పరిష్కరించే వీలున్నా పెండింగ్ పెడుతున్నారు. కారణాలు ఏమిటన్నది అధికారులకే తెలియాలి. ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో ఎక్కువగా భూ సమస్యలపై వినతులు వస్తున్నాయి.
రెవెన్యూ క్లినిక్‌లు
క్లిక్ అవుతాయా!
పీజీఆర్‌ఎస్‌లో వచ్చే వినతుల్లో 50 శాతం భూ సమస్యలే
సంవత్సరాలుగా సాగుతున్న వివాదాలు
ఇకపై ఎలాంటి పరిష్కారం చూపుతారోనని రైతుల్లో ఆశలు
విజయనగరం కలెక్టరేట్, జనవరి 22(ఆంధ్రజ్యోతి):
- గంట్యాడ మండలంలోని ఓ గ్రామ పరిధిలో జిరాయితీ భూమిని భర్త పేరు నుంచి భార్య పేరుకు మార్చడానికి కుటుంబ సభ్యులు మూడుసార్లు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి భర్త చనిపోయిన తరువాత ఆ ఆస్తి వారసత్వంగా భార్యకే వస్తుంది. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో మరణ ధ్రువ పత్రం, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్ జత చేశారు. అయినా మూడుసార్లు ఏ కారణంతో తిరష్కరించారో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
- గంట్యాడ మండలంలోనే మరో గ్రామానికి చెందిన రైతు గత ఏడాది మే 5న కొంత భూమిని కొనుగోలు చేశాడు. దీనికి విజయనగరం రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఆటో మ్యుటేషన్ కూడా చేశారు. అయితే కొనుగోలు చేసుకున్న వ్యక్తి పేరున వెబ్‌ల్యాండ్‌లో 1బి నమోదు కాలేదు. ఆన్‌లైన్‌లో మరో వ్యక్తి పేరు చూపిస్తోంది. సంబంధం లేని మూడో వ్యక్తి పేరున 1బీ చూపించడంతో కొనుగోలు చేసుకున్న వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు.
జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పరిష్కరించే వీలున్నా పెండింగ్ పెడుతున్నారు. కారణాలు ఏమిటన్నది అధికారులకే తెలియాలి. ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో ఎక్కువగా భూ సమస్యలపై వినతులు వస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పార్వతీపురం మన్యం జిల్లాలో అక్కడి కలెక్టర్ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ పేరిట ప్రత్యేక కార్యక్రమం ఇదివరకే చేపట్టారు. మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రం అంతా నేడు అమలు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది డిసెంబరు 29న రెవెన్యూ క్లినిక్‌లను ప్రారంభించారు. ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ వినతులు స్వీకరిస్తున్న సమయంలో రెవెన్యూ క్లినిక్‌లో కూడా భూ సమస్యలపై విన్నపాలు తీసుకుంటారు. జిల్లా కేంద్రంలో కలెక్టరు, జేసీ, డీఆర్‌వో, ఆర్‌డీవోలు, అన్ని మండలాలకు చెందిన తహసీల్దార్లు అందుబాటులో ఉంటారు. గత నెల 29న మొత్తం 232 వినతులు వస్తే రెవెన్యూ సమస్యలపై 136 వినతులు వచ్చాయి. ఈనెల 4న నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 297 వినతులు రాగా ఇందులో 149 వినతులు భూ సమస్యలపై వచ్చాయి. ఈ నెల 12న నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 164 వినతులు అధికారులకు అందగా ఇందులో 110 వినతులు రెవెన్యూకు సంబంధించినవిగా నమోదయ్యాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఏ ప్రజాప్రతినిధి ప్రజా దర్భార్ నిర్వహించినా భూ సమస్యలపైనే ఎక్కువ వినతులు వస్తున్నాయి. రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. భూ విస్తీర్ణంలో తేడాలు, సరిహద్దు సమస్యలు ఉన్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా లక్ష వరకూ జాయింట్ ఎల్‌పిఎంలు ఉన్నాయి. వీటిని విడదీయాల్సిన అవసరం ఉంది. వీటివల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో సమస్యలు యథావిధిగా ఉంటున్నాయి. రెవెన్యూ క్లినిక్‌లలో ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తారా.. లేదా అనేది చూడాలి.