Share News

Problems Resolved? సమస్యలకు మోక్షం కలిగేనా?

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:12 AM

Will the Problems Finally Be Resolved? జిల్లాకేంద్రం కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా సమీక్ష మండలి(డీఆర్‌సీ) సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా ఇన్‌చారి మంత్రి కె.అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో పాటు ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

  Problems  Resolved? సమస్యలకు మోక్షం కలిగేనా?

  • హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

  • ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు

పార్వతీపురం, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా సమీక్ష మండలి(డీఆర్‌సీ) సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా ఇన్‌చారి మంత్రి కె.అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో పాటు ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను వేధిస్తున్న పలు సమస్యలను చర్చించి.. వాటికి మోక్షం కల్పించాలని, అభివృద్ధి పనులను పరుగు పెట్టించాలని మన్యం వాసులు కోరుతున్నారు.

ప్రధాన సమస్యలివీ..

- పార్వతీపురం, సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల భవన నిర్మాణాలు పూర్తికావడం లేదు. దీంతో జిల్లా కేంద్రాసుపత్రితో పాటు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో రోగులకు వసతి సమస్య వేధిస్తోంది. ప్రధానంగా సీజనల్‌ వ్యాధులు విజృంభించే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బెడ్‌పై ఇద్దరు లేదా ముగ్గురు సర్దుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచాల్సి ఉంది. జిల్లాకేంద్రాసుపత్రిలో రేడియాలజిస్ట్‌ , స్టాఫ్‌ నర్సులు, వైద్య నిపుణుల పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది.

- జిల్లా కేంద్రానికి బైపాస్‌ రహదారి ఎంతో అవసరం. కాని ఈ రహదారి నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించడం లేదు. దీంతో ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు.

- కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణం కొలిక్కిరావడం లేదు. దీంతో జిల్లా యువత ఉన్నత విద్యకోసం పొరుగు జిల్లాలకు పరుగు పెట్టాల్సి వస్తోంది.

- మన్యంలో చాలాచోట్ల జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు కూడా పూర్తికాలేదు. కొన్నిచోట్ల ఇంటింటికీ ఏర్పాటు చేసిన కుళాయిలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

- జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసినట్లు ప్రకటించినా.. ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.

- వీఆర్‌ఎస్‌, పెద్దగెడ్డ , పెదంకలాం తదితర ప్రాజెక్టుల పరిధిలో జైకా నిధులతో చేపట్టాల్సిన పనులు పునఃప్రారంభం కాలేదు. అదేవిధంగా జంఝావతి, తోటపల్లి తదితర ప్రాజెక్టుల పెండింగ్‌ పనులపై దృష్టి సారించి రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలి.

- జిల్లా కేంద్రం పార్వతీపురం వాసులను దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. డంపింగ్‌యార్డు తరలింపు హామీ నేటికీ నెరవేరలేదు.

- పాలకొండ ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు కూడా ప్రారంభం కావడం లేదు.

- సాలూరు, పార్వతీపురం పట్టణాల్లో పేదలకు టిడ్కో ఇళ్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

- జాయింట్‌ కలెక్టర్‌తో పాటు గృహ నిర్మాణశాఖ తదితర కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సి ఉంది. అదేవిధంగా జిల్లావాసులకు ఏనుగల బెడద కూడా తప్పించాలి.

- భద్రగిరి, సాలూరు వైటీసీలో దాదాపు మూతపడే స్థితికి చేరుకున్న గిరిజన గర్భిణుల వసతి గృహాలపైనా దృష్టి సారించాలి. అక్కడి సిబ్బంది వేతనాలు చెల్లించి.. ఈ కేంద్రాలకు పూర్వ వైభవం తేవాలి. ప్రధానంగా మాతా శిశు మరణాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అడ్డూఅదుపు లేకుండా అక్రమ రవాణా సాగుతుంది. ముఖ్యంగా కొమరాడ, భామిని, సాలూరు తదితర సరిహద్దు మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక ఒడిశాకు తరలివెళ్లిపోతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.

- గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణాలను పర్యవేక్షించి.. పనులను వేగవంతం చేయాలి. బిల్లులు చెల్లింపుల్లో జాప్యాన్ని అరికట్టాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులకు కూడా వేగవంతంగా చెల్లింపులు చేయాల్సి ఉంది.

- కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. నిధులు మంజూరైనా పనులు పూర్తికావడం లేదు.

Updated Date - Jun 16 , 2026 | 12:12 AM