సమస్యలు పరిష్కారమయ్యేనా?
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:50 PM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతిలో మన్యం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
-నేడు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం
- వివిధ అంశాలపై చర్చించే అవకాశం
పార్వతీపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతిలో మన్యం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, జిల్లా అభివృద్ధితో పాటు పారిశ్రామిక, పర్యాటకం, సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై చర్చించి నిధులు కోరనున్నట్లు తెలిసింది. దీంతో నిధుల మంజూరుపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
నియోజకవర్గాల వారీగా..
జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో గత కొన్ని దశాబ్దాలుగా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తోన్నాయి. కురుపాం నియోజకవర్గంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు నిలిచిపోయాయి. పాచిపెంట నుంచి అరకు వెళ్లే రహదారి పనులు మధ్యలో ఆగిపోయాయి. ఈ సమస్యలతో పాటు నియోజకవర్గ పరిధిలో వీఆర్‌ఎస్ ప్రాజెక్టు, ఆక్వాడక్ట్ నిర్మాణం, తదితర సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. పార్వతీపురంలో చేపడుతున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, బైపాస్ రహదారి నిర్మాణం, పట్టణ ప్రజల తాగునీటి సమస్యలను సీఎంకు వివరించనున్నారు. పాలకొండలో రహదారి విస్తరణ, భామినిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, తోటపల్లి పాత రెగ్యులేటర్ ద్వారా సాగునీటి సరఫరాకు ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ సమస్యలు ప్రస్తావిస్తే మేలు..
జిల్లా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అనేక ప్రభుత్వ శాఖలకు పూర్తి స్థాయి అధికారులు లేరు. కొన్ని శాఖలకు సొంత భవనాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖకూ పూర్తిస్థాయి అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా వైద్య కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు అందేలా చూడాలి. గర్భిణి వసతిగృహాల నిర్వహణతో పాటు సంబంధిత సిబ్బందికి జీతాలు చెల్లించాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు అనుసంధానంగా వసతిగృహాలు ఏర్పాటు చేయాలి. ఇలాంటి ప్రధాన సమస్యలను సీఎం వద్ద ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.