Share News

water problem ప్ర‘జల’ కష్టాలు తీరేనా?

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:16 AM

Will the People’s Hardships Be Resolved? వేసవి ఇంకా ప్రారంభం కాకముందే సాలూరు పట్టణంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.

water problem  ప్ర‘జల’ కష్టాలు తీరేనా?
నిర్వహణకు నోచని సాలూరు ఒరియా పండా వీధిలో ఉన్న రక్షిత నీటి పథకం

  • సాలూరు వాసులకు నిత్యం అవస్థలే..

  • మున్ముందు పరిస్థితేమిటోనని ఆందోళన

  • పద్దగెడ్డ నుంచి నీరు వచ్చేదెప్పుడో..

  • పట్టించుకోని అధికారులు, పాలకవర్గం

సాలూరు, ఫిబ్రవరి21(ఆంధ్రజ్యోతి): వేసవి ఇంకా ప్రారంభం కాకముందే సాలూరు పట్టణంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఇక శివారు ప్రాంతవాసుల పరిస్థితి సరేసరి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా మునిసిపాలిటీ వాసుల తాగునీటి అవసరాల కోసం 1960లో పట్టణంలోని మజ్జులపేటలో 682 కేఎల్‌, 500 కేఎల్‌ నీటి సామర్థ్యంతో రక్షిత నీటి పథకాలను ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల తరువాత గాంధీపార్కులో 800 కేఎల్‌, ఒరియా పండా వీధిలో 800 కేఎల్‌ నీటి సామర్థ్యంతో నీటి పథకాలను నిర్మించారు. కాగా పట్టణంలో 29 వార్డుల్లో సుమారు 59 వేల వంద జనాభా ఉండగా వారికి సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. పురపాలక సంఘంలో 13వేల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా పట్టణంలో పలుచోట్ల 700 వరకు ముసిపల్‌ కుళాయిలు ఉన్నాయి. పట్టణానికి ఆనుకొని ఉన్న వేగావతి నది నుంచి రక్షిత పథకాల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారు. కాగా మునిపాలిటీలో షుల్జిపేట, పెద్ద కుమ్మరివీధి, రామా కాలనీలో కొంతభాగం, బంగారమ్మకాలనీలో ఎరుకులవీధి, బంగారమ్మపేట, బైపాస్‌రోడ్డు, పీఎన్‌ బొడ్డవలస ప్రాంతాల ప్రజలు నిత్యం తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం వారు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీనిపై మునిసిపల్‌ పాలకవర్గం, అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

పెద్దగెడ్డ నుంచి నీరు వచ్చేదెప్పుడో?

సాలూరు/పాచిపెంట: ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో పాచిపెంట పెద్దగెడ్డ జలాశయం నుంచి సాలూరుకు నీటిని తీసుకొస్తామని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకులు చెప్పిన మాటలు కేవలం నీటిమూటలయ్యాయి. నాడు శిలాఫలకాలకే పరిమిత మయ్యారు తప్ప పనులు చేయించలేకపోయారు. అసలు 2018లో ఈ వాటరు స్కీం గాను రూ.64 కోట్లు మంజూరయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివైజ్‌ చేసి టెండర్లు పిలిచారు. కాగా గతేడాది నవంబరు 22న పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్‌ చీఫ్‌ ప్రభాకరరావు పెద్దగెడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. సంక్రాంతి పండుగ తరువాత వాటరు స్కీం పనులు ప్రారంభిస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పటికీ పనుల ఊసేలేదు. పెద్దగెడ్డ జలాశయం నుంచి భూగర్భ పైపులైన్లు వేసి కాకులతోట వద్ద నిర్మించబోయే ( ఏడు మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) పర్‌ డే ) ప్లాంటుకు అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి మున్సిపాలిటీ వాసులకు తాగునీటి సరఫరా చేయనున్నారు. ఏదేమైనా ఈ వాటరు స్కీం పూర్తయితే సాలూరు మున్సిపాలిటీ వాసులకు పూర్తిస్థాయిలో తాగునీటి కష్టాలు తీరనున్న నేపథ్యంలో దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

త్వరలోనే పనులు

‘పెద్దగెడ్డ జలాశయం నుంచి సాలూరుకు నీటిని తెచ్చే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటర్‌ స్కీం నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. అనేక కారణాలతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు రూ.వంద కోట్లతో రీటెండర్‌ విధానం ద్వారా త్వరలో పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాం.’ అని మున్సిపల్‌ డీఈ ప్రసాదరావు తెలిపారు.

Updated Date - Feb 22 , 2026 | 11:47 AM