‘మేజర్’ సమస్యలు పరిష్కరిస్తారా?
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:29 AM
శృంగవరపుకోట మేజర్ పంచాయతీని దశాబ్దాలుగా ఎన్నో సమస్యలు వేధిస్తోన్నాయి.
- ఆధునీకరణకు నోచుకోని కుళ్లికోనేరు, కళెంగెడ్డ
- ఆక్రమణలతో కుచించుకుపోతున్న విశాఖ-అరకు రోడ్డు
- విజయనగరం రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు
- నిరుపయోగంగా పాతబస్టాండ్, ప్రకాశం మార్కెట్లు
-ఎస్.కోట పంచాయతీలో ప్రజలకు తప్పని ఇబ్బందులు
- కొత్త పాలక వర్గంపైనే ఆశలు
శృంగవరపుకోట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట మేజర్ పంచాయతీని దశాబ్దాలుగా ఎన్నో సమస్యలు వేధిస్తోన్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పిస్తున్న నాయకులు గెలిచిన తరువాత వాటిని మరిచిపోతున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ మేజర్ పంచాయతీలోని సమస్యలను ప్రజలు మరోసారి గుర్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడే పాలకవర్గమైనా ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
కంచెవాని చెరువు..
ఎస్.కోట పట్టణ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డును ఆనుకుని కంచెవాని చెరువు(కుళ్లి కోనేరు) ఉంది. ఒకప్పుడు పుణ్యగిరి కొండల నుంచి వచ్చే వర్షపు నీరు ఈ కోనేరులోకి చేరేది. ఈ నీటిని రైతులు పంటల సాగుకు ఉపయోగించుకునేవారు. రెండు దశబ్దాల కిందట ఈ కోనేరుకు పైనున్న ప్రభుత్వ స్థలంలో అధికారులు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీంతో ఇక్కడ శ్రీనివాసకాలనీ అవతరించింది. ఈ కాలనీ నుంచి వచ్చే వాడుక నీరు కోనేరులో చేరుతుంది. వ్యర్థాలను కూడా స్థానికులు కోనేరులో పడేస్తుండడంతో పూర్తిగా కలుషితమైంది. ఈగలు, దోమలు, పందులకు ఆవాసంగా మారింది. వేసవిలో ఎలాంటి చెరువైన ఇంకిపోతుంది. ఈ కోనేరు మాత్రం మురుగు నీటితో నిండుకుండలా కనిపించడంతో పాటు దుర్గంధభరితంగా ఉంటుంది. వర్షాకాలంలో రోడ్డుపైకి నీరు వచ్చేస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. కోనేరుకు సమీపంలోనే బీసీ వసతి గృహం, గిరిజన సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కోలపర్తి నర్సింగ్ హోమ్, షిరీడీ సాయిబాబా ఆలయం, శ్రీనివాసకాలనీ, గాంధీనగర్, ఆర్టీసీ కాంప్లెక్, డిపో ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, విద్యార్థులు, రోగులు, భక్తులు కోనేరు నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనేరును శుద్ధి చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆధునికీకరణకు ఐదేళ్ల కిందటే రూ.1.50 కోట్ల వరకు ఖర్చువుతుందని అంచనా వేశారు. కేవలం ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి బాగు చేస్తామని హమీలు ఇవ్వడం, గెలిచిన తరువాత తప్పించుకు తిరగడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళెంగెడ్డ..
ఎస్.కోట పట్టణానికి ఆనుకుని ఉన్న జగ్గుచెరువు పంట కాలువే ఈ కళెం గెడ్డ. మేజర్ పంచాయతీని రెండుగా చీలుస్తూ సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి ఆనుకుని ఉన్న నివాసితుల ఆక్రమణలతో గెడ్డ కుచించుకుపోయింది. కొందరు స్థానికులు మరుగుదొడ్లలోని వాడుక నీరు ఇందులోకి విడిచిపెడుతున్నారు. చెత్తాచెదారం వేసేయడంతో మురికికూపంగా మారింది. వర్షాకాలంలో బయటకు వరద నీరు వెళ్లేదారిలేక నివాసాల్లోకి వచ్చేస్తుంది. ప్రతి ఏటా ఈ కాలువలోని చెత్తను బయటకు తీసేందుకు పంచాయతీ రూ.లక్షల్లో వెచ్చిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దీన్ని భూగర్భకాలువగా మార్చేందుకు రూ.2.30 కోట్లు నిధులు రాబట్టారు. ఇరువైపులా సిమెంట్ గోడల నిర్మాణంతో పాటు పైన సిమెంట్ పలకలు వేయాలనుకున్నారు. పనులకు టెండర్లు పిలిచారు. ఇంతలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్లూ దీన్ని పట్టించుకోలేదు.
కుచించుకుపోయిన విశాఖ-అరకు రోడ్డు
మేజర్ పంచాయతీ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డు ఆక్రమణలతో కుచించుకుపోయింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీని ఆనుకుని కొందరు దుకాణాలను నిర్మించారు. వీటిని అద్దెకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. రోడ్డుపైనే దుకాణాలు పెట్టడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోతుంది. ఇటీవల రూ.30లక్షల ఉపాధి నిధులతో కాలువ నిర్మించిన ప్రయోజనం లేదు.
ట్రాఫిక్‌తో నరకం
విజయనగరం రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ సమస్యతో వాహనచోదకులు నరకం చూస్తున్నారు. దేవిబొమ్మ కూడలి నుంచి వన్‌వే ట్రాఫిక్ రోడ్డు వరకు ఎదురెదురుగా భారీ వాహనాలు వస్తే అటు కిలోమీటరు, ఇటు కిలోమీటరు వాహనాలు ఆగాల్సిందే. రోడ్డుపై కొబ్బరి బొండాలు, అరటి పండ్ల దుకాణాలను అడ్డదిడ్డంగా పెడుతున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించి సరుకులతో వచ్చిన వాహనాల లోడింగ్, ఆన్‌లోడింగ్‌తో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. దేవిబొమ్మ ఎదురుగా రోడ్డుపైనే కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయి.
విస్తరణ జరిగినా ఇక్కట్లే..
పుణ్యగిరి రోడ్డును విస్తరించినా ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రితో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలకు ఈ రోడ్డు నుంచే వెళ్లాలి. అయితే, వాహనదారులు రోడ్డుపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం అత్యవసర అంబులెన్స్, రోగుల వెళ్లే వాహనాలకు కూడా దారి ఇవ్వడం లేదు.
నిరుపయోగంగా మార్కెట్లు..
పాత బస్టాండ్, ప్రకాశం మార్కెట్లు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో పంచాయతీ రూ.లక్షల్లో ఆదాయాన్ని కోల్పోతుంది. పదేళ్ల కిందట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన రైతుబజార్‌లోకి పాతబస్టాండ్ వద్ద ఉన్న కూరగాయల దుకాణాలన్నీ వచ్చేశాయి. పాతబస్టాండ్ వద్ద వ్యాపార సముదాయాన్ని నిర్మించి అద్దెకు ఇవ్వాలని అధికారులు భావించారు. దీనిపై గత టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిధులు ఇచ్చేందుకు ప్రతిపాదన జరిగింది. ఇంతలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో దానిగురించి ఆలోచించడం మానేసింది. పంచాయతీ కార్యాలయ సమీపంలోని ప్రకాశం మార్కెట్‌ను కూడా గాలికి వదిలేశారు. ఒకప్పుడు నిత్య మార్కెట్‌గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఖాళీగా వుంది. ఈ రెండు ప్రాంతాలను వినియోగంలోకి తీసుకువస్తే పంచాయతీకి భారీ ఆదాయం సమకూరనుంది.
లీజుదారుల చేతుల్లో వాణిజ్యసముదాయాలు..
నాలుగే దశాబ్దాల కిందట నిర్మించిన 32 వాణిజ్య సముదాయాలు అప్పట్లో లీజుకు తీసుకున్న యజమానుల చేతుల్లోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీరు అద్దె పెరగనివ్వరు.. మరొకరికి అద్దెకు ఇవ్వనివ్వరు. వీరే వేరొకరికి అద్దెలకు ఇచ్చుకొని లాభం పొందుతున్నారు. ప్రస్తుతం ఈ సముదాయాలు శిథిల వ్యవస్థకు చేరాయి. గత టీడీపీ ప్రభుత్వం వీటిని పునఃనిర్మాణం చేపట్టాలని అనుకుంది. అంచనా బడ్జెట్‌ను కూడా రూపొందించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే వైసీపీ అధికారంలోకి రావడంతో దుకాణాల పునఃనిర్మాణం మరుగున పడింది.
అభివృద్ధికి నోచుకోని ఆలయం
పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి ఆలయానికి చారిత్రకంగా, పర్యాటకంగా పేరొందింది. అరకు పర్యాటకానికి వెళ్లే వారంతా ఇక్కడకు వస్తుంటారు. కానీ, ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీన్ని అభివృద్ధి చేయాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది. రోడ్డు సదుపాయంతో పాటు దారగంగమ్మ లోయ అభివృద్ధి పనులు జరిగేలోపే ప్రభుత్వం మారడంతో పర్యాటకం అటకెక్కింది.