Share News

Will the houses be completed in Ugadi? ఉగాదికి ఇళ్లు పూర్తవుతాయా?

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:11 AM

Will the houses be completed in Ugadi? ఉగాది నాటికి గృహాల నిర్మాణం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇళ్లే కాదు.. ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం ఆర్భాటం చేసింది.

Will the houses be completed in Ugadi? ఉగాదికి ఇళ్లు పూర్తవుతాయా?
రాజాం సమీపంలో అసంపూర్తిగా నిలిచిన జగనన్న కాలనీ ఇళ్లు

ఉగాదికి ఇళ్లు పూర్తవుతాయా?

పెండింగ్‌లో 24,833 ఇళ్లు

వెంటాడుతున్న వైసీపీ శాపం

అవి పూర్తయితేనే కొత్తవి మంజూరు

లక్ష్యం చేరేందుకు ప్రభుత్వం ఆపసోపాలు

రాజాం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి):

నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో లేఅవుట్లు వేసింది. కొండలు చెంత, ఊరికి దూరంగా సెంటు, సెంటున్నర స్థలాలు కేటాయించింది. ఇదే లబ్ధిదారుల విముఖతకు కారణమైంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిస్థాయిలో ఇంటి నిర్మాణం జరగలేదు. వాటిని పూర్తిచేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. అయితే లక్ష్యం తలకు మించిన భారంగా మారింది. లబ్ధిదారులకు భరోసా కల్పించి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నా స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయితే కానీ కేంద్ర ప్రభుత్వం కొత్త ఇళ్లను మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని పూర్తిచేసే పనిలో పడింది. ఉగాదికి టార్గెట్‌ పెట్టుకుంది. పూర్తయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 984 లేఅవుట్లలో 1,16,447 మందికి ఇళ్ల స్థలం కేటాయించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి 583 లేఅవుట్లలో 71,854 ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. రకరకాల కారణాలు చెప్పి లబ్ధిదారులు నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. గత 20 నెలల్లో కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో 47,021 మంది పనులు పూర్తిచేశారు. ఇంకా 24,833 ఇళ్లకు సంబంధించి పనులు పూర్తికాలేదు. ఆ లబ్ధిదారులంతా విముఖత చూపుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంట్లో నివాసం ఉండేందుకు సైతం సుముఖత చూపడం లేదు. దీంతో ఉగాదికి మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తికావడం అనేది అనుమానమే అని అధికారులు చెబుతున్నారు.

తగ్గిన నిర్మాణ వ్యయం..

ఒక్కో ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. అప్పటికి ముందున్న టీడీపీ ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు మంజూరు చేయగా.. ఇళ్ల స్థలాలు ఇచ్చామన్న నెపంతో జగన్‌ ప్రభుత్వం రూ.20 వేలు తగ్గించి రూ.1.80 లక్షలు అందించడానికి నిర్ణయించింది. అయితే పెరిగిన గృహనిర్మాణ సామగ్రి ధరలతో ఆ మొత్తం ఎటూ చాలకపోవడంతో లబ్ధిదారులు విముఖత చూపారు. చాలా మంది అసలు పనులే ప్రారంభించలేదు. చివరకు లబ్ధిదారుల్లో డ్వాక్రా సంఘాల సభ్యులు ఉంటే అదనంగా రూ.30 వేలు అందిస్తామని అధికారులు ప్రోత్సహించినా ముందుకు రాలేదు. కనీసం వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్ల పనులైనా పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల హౌస్‌ ఫర్‌ ఆల్‌ పేరిట ఇంటి నిర్మాణ దరఖాస్తులు స్వీకరించారు. ఉగాదికి ఇవి పూర్తయితే జాబితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మెలిక..

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేదల గృహనిర్మాణానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. గతంలో మంజూరైన ఇళ్లలో కొంత శాతం పూర్తయితే కానీ కేంద్రం కొత్త ఇళ్లు మంజూరుచేసే అవకాశం లేదు. అందుకే కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడానికి చర్యలు చేపడుతోంది. గత కొద్దిరోజులుగా ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ గృహనిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో సైతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరవుతాయని ఆశించారు. ప్రధానమంత్రి అవాస్‌ యోజన (అర్బన్‌) 2.0 పథకం కింద..ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.4 లక్షలు అందించనున్నారు. అంటే వైసీపీ హయాంలో కంటే ఇంటి నిర్మాణ సాయం రూ.2.20 లక్షలు పెరగనుందన్న మాట. కానీ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పుణ్యమా అని ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం గృహనిర్మాణం విషయంలో ప్రత్యేక వ్యూహంతో ఉండడంతో త్వరలో పెండింగ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లబ్ధిదారులను కలుస్తున్నాం

మంజూరైన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నాం. ఉగాదికి పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. లబ్ధిదారులను కలిసి పనులు ప్రారంభించేలా ఒత్తిడి చేస్తున్నాం. సిబ్బంది కొరత దృష్ట్యా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు చేపడుతున్నాం. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తాం. కొత్త ఇళ్ల మంజూరుకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.

- మురళీమోహన్‌, హౌసింగ్‌ పీడీ, విజయనగరం

Updated Date - Feb 06 , 2026 | 12:12 AM