Share News

లక్ష్యం చేరుకునేనా?

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:39 PM

ఫైలేరియా ప్రభావిత గ్రామమైన పెదపెంకిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో సుమారు రూ.6.10 కోట్లు మంజూరయ్యాయి.

లక్ష్యం చేరుకునేనా?
పెదపెంకిలో జరుగుతున్న పనులు

- పెదపింకిలో పూర్తికాని అభివృద్ధి పనులు

-మరో రెండు రోజులే గడువు

సీతానగరం (బలిజిపేట), జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఫైలేరియా ప్రభావిత గ్రామమైన పెదపెంకిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో సుమారు రూ.6.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే గడువు మరో రెండు రోజులే మిగిలి ఉండగా, పలు పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో లక్ష్య సాధనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో మొత్తం 66 పనులకు ఆమోదం లభించగా, వాటిలో 17 పనులను వివిధ కారణాలతో చేపట్టడం లేదు. మిగిలిన పనుల్లో ఇప్పటివరకు కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతుండగా, మిగిలినవి ఇంకా పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు.

పవన్‌కల్యాణ్‌ వస్తే పరిస్థితి ఏమిటి?

ఈ నెల 24న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పెదపెంకిని గ్రామాన్ని సందర్శించే అవకాశాలు ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఉత్కంఠ నెలకొంది. అసంపూర్తిగా ఉన్న పనులను చూసి ఆయన ఏమంటారోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో పనులు వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయమై జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి డబ్ల్యూవీఎస్‌ఎస్‌ శర్మను వివరణ కోరగా.. ‘అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి రోజూ పనులను పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట అదనపు సిబ్బంది, యంత్రాలను వినియోగిస్తున్నాం. నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పనులను పూర్తి చేయడమే మా లక్ష్యం’ అని అన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 11:40 PM