Share News

Flooding Problem ముంపు సమస్య పట్టదా?

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:26 PM

Will the Flooding Problem Be Addressed? వర్షం పడితే చాలు పార్వతీపురం పట్టణవాసులకు ముంపు సమస్య తప్పడం లేదు. ఏటా ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా వరదనీరు మళ్లింపు అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఏటా వర్షాకాలంలో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో వర్షపు నీటితో పాటు మురుగునీరు నిలిచిపోవడం వల్ల నివాసితులు, పాదచారులు, వాహనచోదకులకు అవస్థలు తప్పడం లేదు.

  Flooding Problem  ముంపు సమస్య పట్టదా?
పార్వతీపురం ప్రధాన రహదారిలో నిలిచిన వర్షపునీరు

  • ఎక్కడిక్కడే నిలిచిపోతున్న మురుగు, వర్షపునీరు

  • ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించలేని వైనం

  • వరదనీటి మళ్లింపు ప్రతిపాదనలు కాగితాలకే పరిమతం

  • చోద్యం చూస్తున్న మున్సిపల్‌ అధికారులు

పార్వతీపురం టౌన్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వర్షం పడితే చాలు పార్వతీపురం పట్టణవాసులకు ముంపు సమస్య తప్పడం లేదు. ఏటా ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా వరదనీరు మళ్లింపు అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఏటా వర్షాకాలంలో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో వర్షపు నీటితో పాటు మురుగునీరు నిలిచిపోవడం వల్ల నివాసితులు, పాదచారులు, వాహనచోదకులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లా కేంద్రంగా ఏర్పడి నాలుగేళ్లవుతున్నా.. పార్వతీపురంలో తాగునీరు, పారిశుద్య, వీధి లైట్ల నిర్వహణతో పాటు వరదనీటి మళ్లింపు తదితర సమస్యలు కొలిక్కి రావడం లేదు. వాటిపై అధికారులు , ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని మేదర వీధి కూడలి నుంచి పాతబస్టాండ్‌ కూడలి వరకు ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతంలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లోకి కూడా వర్షపునీరు చేరింది. మురగునీరు కూడా రోడ్డెక్కడంతో నివాసితులు, వ్యాపారులు , వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భూగర్భ కాలువల నిర్మాణం ఎప్పుడు..?

- ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో నిలిచిపోతున్న వరదనీటిని మళ్లించేందుకు 2008లో భూగర్భ కాలువల నిర్మాణానికి అప్పటి పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అఽధికారులు కూడా ప్రతిపాదనలు తయారు చేసి... ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఆ ప్రతిపాదలనలు కాగితాలకే పరిమితమైంది. సుమారు రెండు దశాబ్దాలు గడుస్తున్నా.. వాటికి మోక్షం లభించడం లేదు.

- మురుగు, వరదనీటి మళ్లింపును పట్టించుకోని అధికారులు, పాలకవర్గ సభ్యులు.. ఆ నీటి శుద్ధి ప్లాంట్‌ని ఏర్పాటు చేసేందుకు 2009లో ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే ఆ ఆ ప్రతిపాదనలు కూడా బుట్టదాఖలయ్యాయి.

- వరద, మురుగునీరు వెళ్లే మున్సిపాల్టీ చుట్టు పక్కల ఉన్న చెరువులు, బందలు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. దీంతో వర్షం పడిన ప్రతిసారీ పట్టణవాసులు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. రోజుల తరబడి నీరు అలానే నిల్వ ఉండడం వల్ల స్థానికులు తరచూ రోగాలపాలవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్రవాసులు కోరుతున్నారు.

ప్రత్యేకాధికారికి నివేదిస్తా

వరదనీటి మళ్లింపునకు సంబంధించి మున్సిపల్‌ ప్రత్యేకాధికారికి నివేదిస్తాం. ప్రధాన రహదారితో పాటు పలువీధుల్లో వరదనీరు నిలిచిపోకుండా తక్షణమే చర్యలు చేపడతాం. భూగర్భ కాలువల నిర్మాణంపై మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చిస్తా.

- అశోక్‌కుమార్‌, ఎఫ్‌ఏసీ కమిషనర్‌, పార్వతీపురం మున్సిపాల్టీ

Updated Date - Sep 12 , 2026 | 11:26 PM