Will the Fate of Projects Change?” ప్రాజెక్టుల దశ మారేనా?
ABN , Publish Date - May 10 , 2026 | 12:20 AM
Will the Fate of Projects Change?” జిల్లాలో రెండు సాగునీటి ప్రాజెక్టుల పనుల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇరిగేషన్ క్యాలెండర్‌లో వాటికి చోటు కల్పించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తోటపల్లి డిస్ర్టిబ్యూటరీతో పాటు జంఝావతి ప్రాజెక్టు పనుల పూర్తికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ క్యాలెండర్‌లో వాటికిచోటు
వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
భూసేకరణ సమస్య పరిష్కారమయ్యేనా..
ఒడిశాతో వివాదంపై సందేశాలు
పార్వతీపురం, మే9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు సాగునీటి ప్రాజెక్టుల పనుల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇరిగేషన్ క్యాలెండర్‌లో వాటికి చోటు కల్పించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తోటపల్లి డిస్ర్టిబ్యూటరీతో పాటు జంఝావతి ప్రాజెక్టు పనుల పూర్తికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయని, ఈ ప్రాంతం సస్యశ్యామలవుతుందని చెబుతున్నారు. త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కీలకంగా ఉన్న భూ సేకరణ, ఒడిశాతో ఉన్న వివాదం కొలిక్కి వచ్చినప్పుడే గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
- తోటపల్లి డిస్ర్టిబ్యూటరీ పనులు 2027, జూన్ నాటికి పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే ఇందుకోసం 33.70 ఎకరాల డీ పట్టాతో పాటు ఐదు ఎకరాల 43 సెంట్ల జిరాయితీ భూమిని సేకరించాల్సి ఉంది.
- గతంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు అప్పగించిన వారికి నేటికీ నష్టపరి హారం అందలేదని రైతులు చెబుతున్నారు. దీంతో డిస్ర్టిబ్యూటరీ పనులను వారు వ్యతిరేకి స్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో కూడా ఈ ప్రాంతంలో పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. తమ భూములకు నష్టపరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని రైతులు పట్టుబట్టారు. దీంతో అప్పట్లో ఇరిగేన్‌శాఖ, భూసేకరణ అధికారులు చేతులెత్తేశారు.
- గతంలో భూసేకరణ సమయంలో అందరికీ డబ్బులు చెల్లించామని సంబంధిత అధికారులు వాదిస్తున్నప్పటికీ.. రైతులు మాత్రం తమకు ఎటువంటి పరిహారం అందలేదని చెబుతున్నారు.
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ కోసం రూ.6.75 కోట్లు మంజూరు చేసింది. డిస్ర్టిబ్యూటరీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు యంత్రాలతో వెళ్తే కొంతమంది రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ సమస్యను పరిష్కరిస్తేనే తోటపల్లి డిస్ర్టిబ్యూటరీ పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.
భూసేకరణ చేపట్ట్టాల్సిన గ్రామాలు
- తోటపల్లి డిస్ర్టిబ్యూటరీ పనుల పూర్తికి సీతానగరం మండలం పరిధిలో జగన్నాథపురం, జయంతిపురం, బూర్జ, బలిజిపేట మండలంలో పనుకువలస, అరసాడ, బర్లి, మిత్తివలస, బైరిపురం, పెదపింకి, జనార్దనపురం పరిధిలో ఐదు ఎకరాల 43 సెంట్లు జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది.
- డీ పట్టాకు సంబంధించి సీతానగరం మండలంలో పి.బుచ్చింపేట, జగన్నాథపురం, గాజుల వలస, బూర్జ, బలిజిపేట మండలంలో అరసాడ, శివరాంపురం, వెంగళరాయపురం, అంపావల్లి, బర్లి ప్రాంతాల్లో 33 ఎకరాల 70 సెంట్ల భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి నష్టపరిహారం చెల్లింపు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత భూసేకరణ అధికారులపై ఉంది.
- తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి జిల్లాలోని తొమ్మిది డిస్ర్టిబ్యూటరీ పనులు పూర్తయ్యాయి. మరో ఐదు డిస్ర్టిబ్యూటరీ పనులు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలోని బొమ్మికపాడు, అరసాడ, బర్లి, గాదిలవలసతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి ప్రాంతాల్లో డిస్ర్టిబ్యూటరీ పనులు పూర్తి చేయాల్సి ఉంది. బొబ్బిలి మండలంలో పనులు పూర్తిచేస్తే మన్యం జిల్లాలో ఉన్న బలిజిపేట మండలం గ్రామాల్లో భూములకు కూడా సాగునీరు అందుతుంది.
సాగునీటి సరఫరా ఇలా..
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని బలిజిపేట, సీతానగరం మండలాల పరిధిలో 13,638 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ డిస్ర్టిబ్యూటరీ పనులు పూర్తికాక పోవడంతో కేవలం 5,380 ఎకరాలకు మాత్రమే నీరందుతుంది. ప్రభుత్వం ఇరిగేషన్ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగా తోటపల్లి డిస్ర్టిబ్యూటరీ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తే జిల్లాలో వేలాది ఎకరాలతో పాటు విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న మరో 7137 ఎకరాలకు సాగునీరు అందనుంది.
జంఝావతికి
ఒడిశాతో నెలకొన్న వివాదం కొలిక్కిరాకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా జంఝావతి ప్రాజెక్టు పనులు పూర్తికావడం లేదు. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం .. 2027, డిసెంబరు నాటికి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించింది. రెండు రాష్ర్టాల్లోనూ రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 24 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ కేవలం 9 వేల ఎకరాలకే నీరందుతుంది.