Eligible Be Supported? అర్హులను ఆదుకుంటారా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:17 PM
Will the Eligible Be Supported? జిల్లాలో ఎంతోమంది అర్హులైన దివ్యాంగులు రూ.15వేల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
గత వైసీపీ హయాంలో అక్రమాలు
అసలైన లబ్ధిదారులకు మొండిచేయి
మంచానికే పరిమితమైన వారెందరో..
సాయం పెంచాలని వేడుకోలు
రూ.15 వేలు పింఛన్ మంజూరు చేయాలని విన్నపం
సాలూరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి):
- బంధువులు మోసుకుంటూ తీసుకొస్తున్న ఆమె పేరు కందుకూరి సుందరమ్మ(70) సాలూరు పట్టణంలో నివాసం ఉంటుంది. కాళ్లు, చేతులు పని చేయకపోవడంతో కొన్నాళ్లుగా మంచం పట్టి చికిత్స పొందుతోంది. వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం దివ్యాంగ పింఛన్ రూ.6 వేలు వస్తుంది. రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని ఆమె బంధువులు గతనెలలో సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ ఎస్‌లో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.
- అన్నదమ్ములైన జవానా వైకుంఠం(17), వినయ్(14)కు కొన్నేళ్లుగా కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి ఈశ్వరమ్మ పట్టణంలోని ఓ ప్రైవేట్ షాపులో పని చేసుకుంటూ వారిని షోషిస్తోంది. ఆ అన్నదమ్ములకు దివ్యాంగ పింఛన్ కింద ప్రతినెలా రూ.ఆరు వేల చొప్పున ఇస్తున్నారు. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని ఈశ్వరమ్మ గత నెల 31న మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని వేడుకుంది.
- పట్టణంలో మెంటాడ వీధిలో ఉంటున్న యువకుడు పేరు పతేడ వంశీకృష్ణ (20)కు పుట్టిన నాటి నుంచి కాళ్లు, చేతులు పని చేయడం లేదు. పూర్తిగా మంచానికే పరిమితమైన వంశీకి తల్లి జ్యోతి, తండ్రి రాము నిత్యం సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యువ కుడికి దివ్యాంగ పింఛన్ రూ.6 వేలు వస్తుంది. కాగా గతంలో వంద శాతం వైకల్యం ఉన్నట్లు అధికారులు ధ్రువపత్రం మంజూరు చేయగా.. ఇటీవల జరిగిన సదరంలో మాత్ర పది శాతం తగ్గించారు. దీంతో ఆ బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
... ఇలా జిల్లాలో ఎంతోమంది అర్హులైన దివ్యాంగులు రూ.15వేల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు. అదే విధంగా నేటికీ దివ్యాంగ పింఛన్లు పొందుతున్న అనర్హులపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది వలంటీర్ల ద్వారా జిల్లాలో అనర్హులు అత్యధికంగా పింఛన్లు పొందారనే ఆరోపణలున్నాయి. మరోవైపు వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు, పూర్తిగా మంచానికే పరిమితమైన రోగులకు పింఛన్ మంజూరు చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం చూపించారనే విమర్శలు కూడా లేకపోలేదు. నాడు ఆసుపత్రి సిబ్బంది ధ్రువపత్రానికో రేటు నిర్ణయించి అనర్హులకు సర్టిఫికెట్లు మంజూరు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాటి వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాల కారణంగా నేటికీ జిల్లాలో ఎంతోమంది అనర్హులు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారు. పూర్తిస్థాయిలో మంచానికి పరిమితమైన లబ్ధిదారులకు మాత్రం గతంలో మొండిచేయి చూపించారు.
- జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కింద ప్రతినెలా దాదాపు లక్షా 38 వేల మందికి వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నారు. వారిలో 71 వేల మంది వృద్ధులు, 37,898 మంది వితంతువులు, 16,115 మంది దివ్యాంగులు ఉన్నారు. పూర్తిగా మంచానికి పరిమితమైన 63 మందికి రూ.15 వేల చొప్పున అందజేస్తున్నారు. వాస్తవంగా ఇటువంటి వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగానే ఉంది. అయితే అనర్హులు దివ్యాంగ పింఛన్లు పొందుతుండడంపై జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం నకిలీ పింఛన్ల ఏరివేతకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా వైద్య బృందాలను నియమించి.. తనిఖీలు చేపట్టింది. ఆసుపత్రుల్లో సదరం క్యాంపులను కూడా నిర్వహించి.. దివ్యాంగ పింఛన్‌దారులకు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది. అయితే త్వరితగతిన అనర్హులను తేల్చి.. తమకు న్యాయం చేయాలని అర్హులైన దివ్యాంగ పింఛన్‌దారులు కోరుతున్నారు.
ఆదేశాలు రాలేదు
జిల్లాలో పింఛన్‌దారుల సంఖ్య పెరగలేదు. 2024 నుంచి ఉన్నవారందరికీ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ అందిస్తున్నాం. అయితే అత్యధికంగా అనర్హులు పింఛన్ పొందుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. వారు ఆదేశాలిచ్చిన వెంటనే.. నకిలీ పింఛన్లపై దృష్టి సారించి అనర్హులను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- సుధారాణి, పీడీ, డీఆర్‌డీఏ, పార్వతీపురం మన్యం