కల సాకారమయ్యేనా?
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:18 PM
సీతంపేట మండలం తాడిపాయి, మానాపురం గ్రామాల మధ్యలో ఉన్న కొండల వద్ద మినీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
- మినీ రిజర్వాయర్ కోసం రైతుల ఎదురుచూపు
- రాళ్లగెడ్డపై నిర్మిస్తే 15 వేల ఎకరాలు సస్యశ్యామలం
- ఇప్పటికే డిప్యూటీ సీఎం, నీటి పారుదలశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు
- బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వడంతో చిగురించిన ఆశలు
రాళ్లగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఏడు దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. మినీ రిజర్వాయర్‌ను నిర్మిస్తే మూడు మండలాల్లోని వేలాది ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. దీనికోసం గత వైసీపీ సర్కారు సమయంలో అధికారులు ప్రతిపాదనలు చేయగా అవి బుట్టదాఖలయ్యాయి. దీంతో కూటమి ప్రభుత్వంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతో మినీ రిజర్వాయర్ నిర్మాణంపై రైతుల్లో కొంత ఆశలు చిగురిస్తున్నాయి.
జియ్యమ్మవలస, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సీతంపేట మండలం తాడిపాయి, మానాపురం గ్రామాల మధ్యలో ఉన్న కొండల వద్ద మినీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే రాళ్లగెడ్డ కుడి , ఎడమ ప్రధాన కాలువల ద్వారా మొత్తం 15 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరంది భూములన్నీ సస్యశ్యామలమవుతాయి. సీతంపేట మండలంలోని తాడిపాయి, మానాపురం, దుగ్గి, రాయిలంక, వీరఘట్టం మండలంలోని మూలలకం, చినగోరకాలనీ, సంతనర్సిపురం, జియ్యమ్మవలస మండలంలోని అంకవరం, డంగభద్ర, గడసింగుపురం, అర్నాడ, జియ్యమ్మవలస పంచాయతీలకు చెందిన రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. మినీ రిజర్వాయర్ కోసం గత వైసీపీ ప్రభుత్వంలో నీటి పారుదలశాఖ అధికారులు రూ.2కోట్లతో ప్రతిపాదనలు పంపించినా ఫలితం శూన్యం. గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పరిశోధన జరిగింది. అయితే పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత ఆ ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నీటి పారుదలశాఖ సర్కిల్ కార్యాలయం సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు ఆ ఫైల్ పంపిస్తే మినీ రిజర్వాయర్ విషయంలో కదలిక ఉంటుందని రైతులు చెబుతున్నారు.
అధ్వానంగా లైనింగ్
రాళ్లగెడ్డ కుడి , ఎడమ ప్రధాన కాలువల పొడవు 11.5 కిలో మీటర్లు. ప్రస్తుతం ఈ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. డ్రాపులు, కల్వర్టులు, స్ట్రక్చర్లు, చప్టాలు, మదుములు అన్నీ పాడైపోయాయి. దట్టమైన పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. దీనివల్ల పది వేల ఎకరాలకు కూడా సాగునీరందని పరిస్థితి నెలకొంది. 2014-19 మధ్యలో ఈ కాలువల దుస్థితిని చూసి అప్పటి నీటి పారుదలశాఖ అధికారులే నోరెల్లబెట్టారు. ఆ తరువాత కనీసం ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. నిధులు మంజూరైతే మినీ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు నార్త్ ప్రధాన కాలువ పొడవు 5.5 కిలో మీటర్లు, సౌత్ ప్రధాన కాలువ 6 కిలో మీటర్లు లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది.
ప్రభుత్వంపైనే ఆశలు..
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ సాగునీరందించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో రైతులకు భరోసా ఇచ్చారు. రెండు రోజుల కిందట ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా సాగునీటి ప్రాజెక్టులకు సముచిత స్థానం కల్పించి అధిక నిధులు మంజూరు చేశారు. దీంతో రాళ్లగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణంపై జియ్యమ్మవలస, సీతంపేట, వీరఘట్టం మండలాలకు చెందిన రైతుల్లో ఆశల రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మినీ రిజర్వాయర్ విషయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సహకారంతో ఈ ప్రాంత టీడీపీ నాయకులు, రైతులు తీసుకెళ్లారు. ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలి..
రాళ్లగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం ఈ ప్రాంత రైతుల కల. ఏడు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నారు. వారి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మినీ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే మూడు మండలాల్లోని 15 వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.
-ఎం.సత్యంనాయుడు, చైర్మన్, వట్టిగెడ్డ ప్రాజెక్టు కమిటీ, జియ్యమ్మవలస
ఆదేశాలు రావాలి
రాళ్లగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం విషయాన్ని ఇటీవలే కొందరు నాయకులు, రైతులు మా దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం, మాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి.
-బి.శంకరరావు, ఏఈ, నీటి పారుదలశాఖ, జియ్యమ్మవలస