Share News

Will the border issue be resolved? సరిహద్దు తేల్చుతారా?

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:55 PM

Will the border issue be resolved?

Will the border issue be resolved? సరిహద్దు తేల్చుతారా?
లక్కవరపుకోట మండలం రంగారాయపురం వ్యూ

సరిహద్దు తేల్చుతారా?

రంగరాయపురానికి హద్దులు చూపాలని కలెక్టర్‌కు సూచన

స్పందించిన సీఎంవో కార్యాలయం

ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి గతంలో విన్నపం

మూడు దశాబ్దాల క్రితం ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు

అప్పటి నుంచి సరిహద్దు తగాదాలు

- లక్కవరపుకోట మండలం రంగరాయపురం (పిల్ల ఆగ్రహారం), సంతపేట, ఎల్‌.కోట గ్రామ పంచాయతీల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం కారణంగా రంగరాయపురం గ్రామ పరిపాలన, శ్మశాన వాటిక, చెత్త నిల్వ ప్రదేశం, ఇతర అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 1995 గజిట్‌, రెవెన్యూ, సర్వే, ఎఫ్‌ఎంబీ, పంచాయతీ రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించండి. శాశ్వత సరిహద్దులను ఏర్పాటు చేయండి. అవసరమైతే ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించండి.

- సీఎంవో కార్యాలయం నుంచి ఇటీవల కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసన్‌

శృంగవరపుకోట సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): లక్కవరపుకోట మండలం రంగారాయపురం గ్రామ పంచాయతీకి వున్న సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విన్నవించారు. దీనికి స్పందించిన సీఎంవో కార్యాలయం ఆ గ్రామ సమస్యకు పరిష్కారం చూపాలని తాజాగా కలెక్టర్‌కు సూచించారు. ఈ పరిణామంతో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది మార్చిలో ఈ సమస్య పరిష్కారానికి డివిజనల్‌ పంచాయతీ అధికారి విచారణకు పూనుకున్నారు. గ్రామానికి సరిహద్దులుగా వున్న ఎల్‌.కోట, సంతపేట గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్‌లతో పాటు తహసీల్దార్‌, ఎంపీడీవో, ఈఓపీఆర్డీలను రంగరాయపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టే విచారణకు రావాలని కబురు పంపించారు. ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ఎటుంటి అధికారక సమాచారం ఇవ్వకుండా విచారణను రద్దు చేశారు. ఇక సమస్యకు పరిష్కారం దొరకదేమోనని భావించిన ప్రజలకు సీఎంఓ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు అందిన ఆదేశంతో కాస్త ఊరట చెందుతున్నారు.

సమస్యలు ఇలా..

పంచాయతీ ప్రజలు పూర్వీకుల నుంచి రామప్పచెరువు గర్భాన్ని శ్మశానంగా వాడుకుంటున్నారు. ఆ మధ్య అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నారు. అయితే ఇదీ లక్కవరపుకోట రెవెన్యూలో వున్నందున ఆ పంచాయతీ నాయకుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇలా రంగరాయపురం గ్రామంలో ఏ అభివృద్ది పనులు చేయాలన్నా పక్కనున్న సరిహద్దు గ్రామాలతో అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రత్యేక పంచాయతీగా ఏర్పటు చేసిన సమయంలో అధికారులు సరిహద్దులు చూపలేదు. గజిట్‌ పబ్లికేషన్‌కు సంబంధించిన వివరాలు లభ్యం కావడం లేదు.

మూడు దశాబ్దాలైనా..

ప్రత్యేక పంచాయితీగా ఏర్పడి మూడు దశబ్ధాలు కావస్తోంది. ఇంతవరకు ఈ గ్రామానికి సరిహద్దులేవో ఎవరికీ తెలియదు. వీటి కోసం గత కొన్నేళ్లగా ప్రస్తుత టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన తెలుగు దేశం ప్రభుత్వంలో మండల ప్రాదేశిక సభ్యునిగా (జడ్పీటీసీ) పలు మార్లు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావించారు. స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి సహకారంతో అప్పటి ప్రభుత్వ దృష్టిలోనూ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ దృష్టికీ తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు.

పంచాయతీ ఆవిర్భావం ఇలా..

1981లో కిత్తన్నపేట పంచాయతీ నుంచి రెండు వార్డులతో రంగరాయపురంను, లక్కవరపుకోట పంచాయతీ పరిధిలో వున్న శివారు పిల్ల ఆగ్రహరంను వేరు చేసి ప్రత్యేకంగా సంతపేట పంచాయతీను ఏర్పాటు చేశారు. సంతపేట గ్రామం కంటే జనాభా, విస్తీర్ణం పరంగా ఎక్కువగా వున్న రంగరాయపురం (పిల్ల అగ్రహారం) శివారుగా వుండడాన్ని ఇష్టపడని గ్రామస్థులు తమకు ప్రత్యేకంగా పంచాయతీ కావాలని అడగడంతో 1995లో ప్రత్యేక పంచాయుతీగా గుర్తించారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు పర్యాయాలు స్థానిక ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌, పాలకమండలి సభ్యులు కొలువుతీరుతున్నారు. ఇదే సమయంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావు గజిట్‌ పబ్లికేషన్‌ నకలు కోసం పట్టుబడుతున్నారు. గజిట్‌ పబ్లికేషన్‌లో ప్రత్యేక పంచాయతీకి కేటాయించిన భూములు, ఇతర ఆస్తుల వివరాలు, గ్రామాల హద్దులు ఉంటాయి. తద్వారా తమ హక్కులను పొందవచ్చునన్న ఆలోచనతో దీని కోసం పోరాటం చేస్తున్నారు.

ఈసారి న్యాయం జరుగుతుంది

ఆగస్టులో ఎల్‌.కోటలోని ఎమ్మెల్యే లలితకుమారి నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ గ్రామ సమస్యను తీసుకెళ్లాను. లిఖిత పూర్వకంగా సమస్య వివరాలను అందంచాను. సమస్యను పరిష్కరించాలని సీఎంవో కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఇప్పుడు తప్పక న్యాయం జరుగుతుంది.

కరెడ్ల ఈశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు, లక్కవరపుకోట

Updated Date - Sep 28 , 2026 | 11:55 PM