Share News

బొబ్బిలి ఆస్పత్రి దశ మారేనా?

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:05 AM

బొబ్బిలి పట్టణంలోని సామాజిక కమ్యూనిటీ ఆసుపత్రికి ప్రతిరోజూ సగటున 150 నుంచి రెండువందల మంది రోగులు వస్తుంటారు.

బొబ్బిలి ఆస్పత్రి దశ మారేనా?
బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి

- పేరుకే 50 పడకలు.. ఉండేది 30

- రోగులకు తప్పని ఇబ్బందులు

- ప్రతీ నియోజకవర్గంలో 300 పడకల

ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం

-ఆ ప్రకటనతో సర్వత్రా హర్షం

బొబ్బిలి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని సామాజిక కమ్యూనిటీ ఆసుపత్రికి ప్రతిరోజూ సగటున 150 నుంచి రెండువందల మంది రోగులు వస్తుంటారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులు ప్రసవాల కోసం పెద్దసంఖ్యలో వస్తుంటారు. జిల్లాలోని పది మండలాలకు చెందిన రోగులతో పాటు మన్యం జిల్లాలోని బలిజిపేట, మక్కువ, సీతానగరం మండలాలకు చెందిన రోగులు బొబ్బిలిలో వైద్యసేవలు అందుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇది పేరుకే 50 పడకల ఆస్పత్రి గానీ, ఉండేది 30 పడకలు మాత్రమే. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోనికి వచ్చిన బొబ్బిలి సీహెచ్‌సీలో నూతనంగా భవనాన్ని నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో వసతి సదుపాయాలు లేక రోగులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో సర్వత్రాహర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రకటనతో బొబ్బిలి ఆస్పత్రి దశ మారుతుందని రోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి అవసరం ఎంతో ఉంది. గత చాలా ఏళ్లుగా ఇక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నప్పటికీ ఇంకా 50 పడకల ఆసుప త్రి స్థాయిని పూర్తిగా చేరుకోకుండాపోయింది. ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 50 పడకల స్థాయికి పెంచినట్లు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, ఇప్పటికీ ఆస్పత్రిలో 30 పడకలు మాత్రమే ఉన్నాయి.పైగా బొబ్బిలి సీహెచ్‌సీకి ఉండే సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు జీఎస్‌ పోస్టును రద్దు చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఆశలు..

రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల ఆసుపత్రులన్నిటికీ ఒకే విధంగా వైద్యులు, సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు, జనరల్‌ సర్జరీ, జనరల్‌ పోస్టులు మూడు, డిప్యూటీ డెంటల్‌ సర్జన్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టు జీవీ, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టు ఎన్‌, జీఎం, ఈఎన్‌, ఓపీ, ఓఆర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ 8 పోస్టులు, ఒక హెడ్‌ నర్స్‌, 11 మంది స్టాఫ్‌ నర్సులు (ప్రస్తుతం ఆరు స్టాఫ్‌నర్స్‌ పోస్టులు) మంజూరు చేశారు. రేడియో గ్రాఫర్‌, ఫార్మసిస్టు గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, థియేటర్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 2, ఆఫ్త్మాలిక్‌ అసిస్టెంట్‌, పోస్టుమార్టం అసిస్టెంట్‌, రికార్డు అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ 2, సీనియర్‌ అసిస్టెంట్‌ -1, జనరల్‌ డ్యూటీ అటెండెంట్స్‌ 7, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఒకరు చొప్పున 43 పోస్టుల ప్యాటర్న్‌తో 50 పడకల ఆసుపత్రిని నిర్వహించాల్సి ఉంది. 30 పడకల ఆసుపత్రిలో అన్ని రకాలు కలిపి 22 పోస్టులు ఉండగా వాటిని 43కి పెంచారు. ఇంతవరకు ఇక్కడ ఉండే ఒక సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు జీఎస్‌ , రెండు డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, ఒక వాటర్‌మన్‌ కమ్‌ వాచ్‌మన్‌, దోబీ, స్వీపర్‌ /తోటీ/జేఎస్‌డబ్ల్యూ 3 పోస్టులను రద్దు చేసి పునర్వ్యవస్థీకరించి కొత్త పోస్టులను ఏర్పాటు చేశారు.

అదనపు వసతి కోసం ప్రతిపాదనలు

బొబ్బిలి సీహెచ్‌సీలో 50 పడకలతో సేవలు అందాలంటే పైఅంతస్తులో భవన నిర్మాణాలు జరగాలి. ఇందుకోసం సుమారు రూ.10 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిబంధనల ప్రకారం 50 పడకల ఆసుపత్రికి రెండున్నర ఎకరాల స్థలం ఉండాలి. పీపీ యూనిట్‌ డీఎంహెచ్‌వో పరిధిలోనికి వస్తుంది. వారికి కావల్సిన వసతి సదుపాయాలను ప్రత్యేకంగా సమకూర్చాలి. సీహెచ్‌సీ వైద్యవిధానపరిషత్‌ పరిధిలో పనిచేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 300 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం.

-జి.శశిభూషణరావు, వైద్యాధికారి, బొబ్బిలి

స్థాయిని పెంచాలి

ప్రతిరోజూ ఆస్పత్రికి 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. రోజుకు ఏడు నుంచి 8 ప్రసవాలు జరుగుతాయి. దీంతో ఆసుపత్రి చాలా రద్డీగా ఉంటుంది. ఇందుకు అవసరమైన వసతుల స్థాయిని పెంచాల్సి ఉంది. ఆసుపత్రిని ఆనుకొని ఉన్న సబ్‌రిజిస్ర్టార్‌, వసతి గృహం స్థలాలను ప్రభుత్వాన్ని ఒప్పించి సీహెచ్‌సీకి సాధిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన చెప్పారు. ఆయన సొంత సొమ్ముతో సీహెచ్‌సీకి కొన్ని సదుపాయాలు కల్పించారు. 300 పడకల ఆసుపత్రి మంజూరైతే రోగులకు ఇబ్బందులు తప్పుతాయి.

- వెలగాడ వాసు, హెచ్‌డీఎస్‌ సభ్యుడు

Updated Date - Feb 26 , 2026 | 12:05 AM