Will the Bhojarajapuram bridge be completed? భోజరాజపురం వంతెన పూర్తయ్యేనా?
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:28 AM
Will the Bhojarajapuram bridge be completed?Will the Bhojarajapuram bridge be completed?
భోజరాజపురం వంతెన
పూర్తయ్యేనా?
సాకారం కావాలంటే మున్సిపాలిటీకి రూ.4 కోట్లు చెల్లించాలి
ముందుపడని పంచాయతీరాజ్ శాఖ
ప్రజలకు కొనసాగుతున్న అవస్థలు
భోజరాజపురం వంతెన నిర్మాణం పూర్తికావాలంటే అదనంగా మరో రూ.4 కోట్లకు పైగా నిధులను మున్సిపాలిటీకి పంచాయతీరాజ్ శాఖ చెల్లించాలి. లేకుంటే ఆ నిధులతో మున్సిపాలిటీ సూచించిన వాటర్‌వర్క్స్ ప్రధాన పైపులైను పనులు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పనులను పంచాయతీరాజ్ శాఖ అయినా చేపట్టాలి. రెండింటిలో ఏదో ఒకటి చేస్తేనే వంతెన నిర్మాణానికి గల అవాంతరాల నుంచి గట్టెక్కడానికి వీలవుతుంది. అంతవరకు ప్రజలకు అవస్థలు తప్పేలా లేవు.
బొబ్బిలి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి నుంచి వేగావతి నదిని దాటి భోజరాజపురం గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న పలు గ్రామాల ప్రజల కోసం మంజూరైన వంతెన పనులు ఎనిమిదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. వంతెన నిర్మాణం కోసం 2018లో రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ఆ తరువాత రెండేళ్ల వరకు పనులు ప్రారంభం కాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు రాకపోవడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో కాంట్రాక్టరు పనులను మధ్యలో ఆపేశాడు. కూటమి ప్రభభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సవరించిన అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. అదనంగా రూ.5 కోట్లు మంజూరు చేయించారు. ఈ లోగా మరిన్ని అవాంతరాలు ముంచుకొచ్చాయి. నాడు భోజరాజపురం మున్సిపల్ ప్రధాన వాటర్ వర్క్స్‌నుంచి వేగావతి నదిపై వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల వాటర్‌వర్క్స్‌కు చెందిన ప్రధానపైపులైన్లు, విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగిస్తే గాని వంతెన నిర్మాణం సాధ్యం కాని పరిస్థితి తలెత్తింది. అలాగే చిలకపాలెం-రాయగడ్డ రోడ్డు జంక్షన్ నుంచి భోజరాజపురం వంతెన వరకు ప్రత్యేకంగా బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అదే మార్గంలో పారాది పంట కాలువపై కల్వర్టును నిర్మించాల్సి ఉంది. ముందుగా మున్సిపాలిటీ తమ పరిధిలోని పైపులైన్, విద్యుత్ పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలి. ఇదేదీ జరగకపోవడంతో వంతెనకు గ్రహణం పట్టినట్లయింది. వీటన్నింటికీ కలిపి సుమారు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల నిధులు అవసరం
అవాంతరాలను అధిగమించేందుకు చర్యలు
రుక్మాంగధనాయుడు, పీఆర్ ప్రాజెక్ట్స్ ఏఈ, బొబ్బిలి
వంతెన నిర్మాణానికి ఎదురవుతున్న అవాంతరాలను ఒక్కటొక్కటిగా అధిగమించేందుకు చర్యలు తీసుకున్నాం. మున్సిపాలిటీకి చెందిన పైపులైన్, విద్యుత్ వ్యవస్థ షిఫ్టింగ్‌కు అవసరమైన రూ.2 కోట్లు వారికి చెల్లించేందుకు అనుమతి లభించింది. మున్సిపాలిటీ వారు సైట్ క్లియరెన్స్ ఇస్తే పనులు జరుగుతాయి. రోడ్డు నిర్మాణ పనులు కూడా అందుబాటులో ఉన్న నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. వంతెన నిర్మాణాన్ని ఏడాది లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఒక్క పిల్లర్ శ్లాబ్ పనులు మాత్రమే జరగాల్సి ఉంది.