రోడ్లకు మోక్షం కలిగేనా?
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:21 PM
ప్రతి గిరిజన గ్రామానికీ కనీసం అంబులెన్స్ వెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
- అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూపు
- 53 రహదారుల పనులకు ఆటంకం
- నిధులు మురుగుపోయే అవకాశం
- చర్యలు చేపడుతున్నామంటున్న డీఎఫ్‌వో
పార్వతీపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి గిరిజన గ్రామానికీ కనీసం అంబులెన్స్ వెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటికోసం ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరు చేసింది. అయితే, అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ రోడ్లు నిర్మాణానికి నోచుకోవడం లేదు. దీంతో అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 81 రహదారులు నిర్మించాల్సి ఉంది. ఇందులో పార్వతీపురం పంచాయతీ డివిజన్ పరిధిలో 11, పాలకొండ డివిజన్‌లో 38, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 26, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఆరు రహదారులు ఉన్నాయి. మొత్తం 81 రోడ్లకు రూ.109కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 53 రహదారులకు అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. వీటిలో పార్వతీపురం డివిజన్‌లో 11, పాలకొండ 23, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 19 రహదారులు ఉన్నాయి. అనుమతులు వస్తేగానీ ఈ పనులు ప్రారంభంకావు.
నిధులు మురిగిపోయే పరిస్థితి...
ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో గాని, మైదాన ప్రాంతాల్లో గాని బీటీ రహదారులు లేదా నూతన రోడ్ల నిర్మాణానికి అత్యధికంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులను వినియోగిస్తున్నారు. ఈ నిధులే కీలకంగా మారుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ పథకం పేరుమార్చి కొత్త బిల్లును తెచ్చి పలు నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు రహదారుల నిర్మాణానికి పెద్ద ఆటంకంగా మారాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు చెల్లించేవి. దీనివల్ల నిధులకు కొరత ఉండకపోవడంతో పనులు వేగవంతంగా జరిగేవి. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇవ్వనుంది. మిగతా 40శాతం రాష్ట్రమే భరించాలి. సకాలంలో ఈ నిధులు ఖర్చు చేయకపోతే మురుగుపోయే పరిస్థితి ఏర్పడనుంది. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ద్వారా రహదారులు నిర్మాణాలు జరుగుతాయా? లేదా అన్న సందేహం నెలకొంది. ఇప్పటికైనా ఇంజనీరింగ్, అటవీశాఖాధికారులు సంయుక్తంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి జిల్లాలో మంజూరైన రహదారులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
అనుమతులు మంజూరు చేస్తున్నాం..
అటవీశాఖకు సంబంధించి రోడ్ల నిర్మాణాల కోసం పంచాయతీల వారీగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఈ ప్రక్రియ ప్రారంభించి సుమారు ఇరవై రోజులు అవుతుంది. ఇప్పటికే కొమరాడ మండలంలో రోడ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశాం. మరో రెండు రోజుల్లో మిగతా రోడ్లకు కూడా అనుమతులు ఇస్తాం.
-ప్రసూన, జిల్లా అటవీశాఖాధికారి, పార్వతీపురం మన్యం