Share News

Will Punyagiri's fortunes turn around? పుణ్యగిరి దశ తిరిగేనా?

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:19 PM

Will Punyagiri's fortunes turn around? శృంగవరపుకోట... పేరు వినబడగానే టక్కున గుర్తుకొచ్చేది పుణ్యగిరి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దక్షిణ కాశీగా వినుతికెక్కింది. ఆధ్యాత్మికంగాను, పర్యాటక ప్రాంతంగానూ పేరొందింది. కార్తీక మాస పర్వదినాల్లో వన భోజనాలు చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలో ఏళ్లుగా అనేక సమస్యలూ ఉన్నాయి. పుట్టదార వద్ద స్నానం చేసే భక్తులు దుస్తులు మార్చుకోనేందుకు తగిన గదులు ఏర్పాటు చేయడం లేదు.

Will Punyagiri's fortunes turn around? పుణ్యగిరి దశ తిరిగేనా?
ఎస్‌.కోట శ్రీఉమా కోటి లింగేశ్వర స్వామి(పుణ్యగిరి) ఆలయం

పుణ్యగిరి దశ తిరిగేనా?

అభివృద్ధి బాట పడుతుందని భక్తుల్లో ఆశ

కొలువుదీరిన కొత్త పాలక మండలి

పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అకర్షిస్తున్న ఆలయం

జీతాలు.. దీప దూప నైవేద్యాలకు సరిపోతున్న ఆదాయం

పర్యాటకులకు, భక్తులకు తప్పని అవస్థలు

శృంగవరపుకోట... పేరు వినబడగానే టక్కున గుర్తుకొచ్చేది పుణ్యగిరి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దక్షిణ కాశీగా వినుతికెక్కింది. ఆధ్యాత్మికంగాను, పర్యాటక ప్రాంతంగానూ పేరొందింది. కార్తీక మాస పర్వదినాల్లో వన భోజనాలు చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలో ఏళ్లుగా అనేక సమస్యలూ ఉన్నాయి. పుట్టదార వద్ద స్నానం చేసే భక్తులు దుస్తులు మార్చుకోనేందుకు తగిన గదులు ఏర్పాటు చేయడం లేదు. అస్తిక నిమజ్జన పూజా సమయంలో కోతులు చొరబడుతున్నాయి. మెట్ల మార్గంలోని బ్రిడ్జి కూలే స్థితిలో ఉంది. ఇలా పలు సమస్యలు ఏళ్లుగా తిష్ఠవేశాయి. కొత్త పాలకవర్గం రాకతోనైనా ఆలయ దశ మారుతుందని భక్తులు ఆశ పడుతున్నారు.

శృంగవరపుకోట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

పుణ్యగిరి ఆలయ ప్రాంతాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకంగాను తీర్చిదిద్దాలని దశాబ్దాల కాలంగా స్థానికులు పాలకుల దృష్టికి తీసుకువస్తున్నారు. ప్రతి ప్రభుత్వంలోనూ ధార్మిక పరిషత్‌ నియమిస్తున్న బోర్డు ఆఫ్‌ ట్రస్టీలను అడుగుతున్నారు. వీరు పదవిని ఆలయంపై పెత్తనంగా భావిస్తూ అభివృద్ధిని విస్మరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కొలువుతీరిన కొత్త బోర్డు ఆఫ్‌ ట్రస్టీ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని స్థానికుల ఆశ. దేవదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ధార్మిక పరిషత్‌ నియమించిన శ్రీధారగంగమ్మ, ఉమాకోటి లింగేశ్వరస్వామి బోర్డు ఆఫ్‌ ట్రస్టీల(పాలక మండలి సభ్యులు)తో గురువారం స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి పుణ్యగిరి రోడ్డులోని ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు.

జీతాలకే సరిపోతున్న పుణ్యగిరి ఆదాయం

ఆలయానికి ఏడాదికి రూ.54లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇందులో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.20లక్షల వరకు పోతుంది. రూ.24 లక్షల వరకు ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు చెల్లించేస్తున్నారు. మిగిలిన రూ.10 లక్షలు వర్షాల కారణంగా పాడవుతున్న మెట్లదారిని బాగు చేసేందుకు, మహాశివరాత్రి, కార్తీక మాసం పర్వదినాల్లో భక్తులకు తాత్కాలిక సదుపాయాలు కల్పించేందుకు వినియోగించేస్తున్నారు. ప్రభుత్వం, దేవదాయ, ధర్మాదాయ శాఖ ఎటువంటి నిధులు విదల్చడం లేదు. ఎన్నికల సమయంలో ఈ ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రచార అస్త్రంగా అన్ని పార్టీలూ వాడుకుంటున్నాయి.

రోడ్డుతో సరి

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు కొండపైకి రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకుంది. అప్పటి పర్యాటక శాఖా మంత్రి గీతారెడ్డి రూ.20 లక్షలు, అప్పటి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బొత్స ఝాన్సీ రూ.20లక్షలు కలిపి రూ.40 లక్షలు కేటాయించారు. అయితే ఆ నిధులు రోడ్డు నిర్మాణానికి చాలవని పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రోడ్డు పనులు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ నిధులు వెనక్కి తరలిపోకుండా ప్రస్తుత, అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రయత్నించారు. కొన్ని అభివృద్ధి పనులు చేశారు. 2024లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆలయాన్ని కలుపుకొని కొండపైనున్న రేగ పుణ్యగిరి గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. దాదాపు పనులు పూర్తయ్యాయి. అయితే ఆలయ అభివృద్ధికి చర్యలు మాత్రం లేవు.

ఏమేమి చేయాలంటే..

- పుట్టదార వద్ద స్నానం చేసే భక్తులు దుస్తులు మార్చుకొనేందుకు తగిన గదులు ఏర్పాటు చేయాలి. ఆలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో శాశ్వతంగా నీడ కల్పించాలి.

- రాళ్లు, రప్పలతో వున్న త్రినాథ గృహం వద్దకు వెళ్లేందుకు సిమెంటు రహదారి నిర్మించాలి.

- మెట్ల దారిలో నీడకోసం పైకప్పుగా రేకులు ఏర్పాటు చేయాలి.

- అస్తిక నిమజ్జనాలు చేపట్టే జలపాతం ఒకేచోట పడేలా చర్యలు తీసుకుంటే స్నానాలు చేసేందుకు అనువుగా వుంటుంది.

- అస్తిక నిమజ్జన సమయంలో పూజా సామగ్రిని కోతులు ఎత్తుకువెళ్తున్నాయి. చుట్టూ ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి.

- మెట్ల మార్గంలోని బ్రిడ్జి కూలేలా ఉంది. మళ్లీ నిర్మించాల్సి ఉంది.

- టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద వున్న పార్కింగ్‌ స్థలాన్ని భక్తుల విశ్రాంతి గదులుగాను, రద్దీ సమయంలో క్యూలైన్‌ వేచి వుండే గదిగాను తీర్చిదిద్దాలి.

- దారగంగమ్మ జలపాతం నుంచి వచ్చే నీరంతా ఒకేచోట పడేలా చూడాలి.

- ఎస్‌.కోట దేవి గుడి కూడలి నుంచి పుణ్యగిరి కొండ వరకు రెండు కిలోమీటర్ల రోడ్డును విస్తరించాలి.

పాలక మండలి సభ్యులు వీరే

చైర్మన్‌ : పెదగాడ అప్పలరాజు

సభ్యులు: బి.నాగరవీంద్రబాబు, పి.లక్ష్మిదేవి, ఎన్‌.ఈశ్వరమ్మ, కె.కొండమ్మ, కె.అప్పారావు, ఎం.కృష్ణబాబు, బి.చంద్రశేఖర్‌, వై.అక్కుబాబు, కె.లక్ష్మి, కె.సంతోషి కుమారి

అర్చక ఎక్స్‌ అఫిషియో మెంబరు: ఏ.రాజగోపాలాచార్యులు

ఆలయాన్ని అభివృద్ధి చేస్తాను

కూటమి ప్రభుత్వం నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సహకారంతో పుణ్యగిరి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను. పర్యాటక కేంద్రంగాను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాను. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్‌ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు.

- పెదగాడ అప్పలరాజు, చైర్మన్‌, పాలక మండలి

ఆలయ అభివృద్ధికి నిధులు అడిగాను

ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిధులు అడిగాను. మంజూరైతే బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలుగా నియమించిన కొత్త సభ్యులతో అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటాను. దక్షణ కాశీగా ఈ ఆలయానికి పేరుంది. అరకు పర్యాటక ప్రాంతానికి ముఖ ద్వారంగా కూడా వుంది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాను. ప్రాధాన్య క్రమంలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాను.

కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్యే, శృంగవరపుకోట

Updated Date - Aug 13 , 2026 | 11:19 PM