పురపాలనను గాడిలో పెడతారా?
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:07 AM
Will Municipal Governance Get Back on Track? జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాలు మరికొద్దిగంటల్లో కొలువుదీరనున్నాయి. చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అభ్యర్థులు ప్రమాణస్వీకారాలు చేయనున్నారు. అయితే నూతన పాలవర్గాలకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు వారు చొరవ చూపాల్సి ఉంది.
పూర్తిస్థాయిలో సరఫరా కాని తాగునీరు
అంతటా పారిశుధ్య లోపం
అధ్వానంగా రహదారులు, కాలువలు
రోజురోజుకూ పెరుగుతున్న ఆక్రమణలు
తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు
మున్సిపల్ నూతన పాలకవర్గాలపైనే ప్రజల ఆశలు
జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాలు మరికొద్దిగంటల్లో కొలువుదీరనున్నాయి. చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అభ్యర్థులు ప్రమాణస్వీకారాలు చేయనున్నారు. అయితే నూతన పాలవర్గాలకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు వారు చొరవ చూపాల్సి ఉంది. వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీరు, పారిశుధ్యం మొదలుకొని రహదారులు, ట్రాఫిక్, ఇళ్ల స్థలాల వరకు అనేక సమస్యలపై దృష్టి సారించి.. పురాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సి ఉంది. వాస్తవంగా గత వైసీపీ ఐదేళ్ల పాలనలో పురాల్లో చెప్పుకోదగ్గ పనులేవీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచి.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీని ప్రగతి పథంలో నడిపించాలని ‘పుర’ వాసులు కోరుతున్నారు.
అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తారా?
సాలూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పట్టణంలో 32 వార్డులున్నాయి. 70 వేలకు మించి జనాభా ఉన్నారు. అయితే వారికి పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. ఈ నేపఽథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించాలనే ఉద్దేశంతో భారీగా నిధులు మంజూరు చేసింది. అయితే పనులను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మున్సిపల్ నూతన పాలకవర్గంపైనే ఉంది.
పట్టణ నడిబొడ్డున సుమారు 300లకుపైగా షాపులతో ఉన్న పెద్దబజారు వివాదం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో పట్టణ పెద్ద బజారు ప్రక్షాళనతో పాటు దాని ఆధునికీకరణకు సంబంధించి బ్యాంకులో ఉన్న రూ.40 లక్షలను వినియోగంలోకి తేవాల్సి ఉంది. సాలూరులో సుమారు రూ.40 లక్షలతో ఇటీవల ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు మంజూరు చేయాలి. అదేవిధంగా పట్టణంలో దండిగాం రోడ్డులో 2018లో టీడీపీ హయాంలో సుమారు రూ.25 లక్షలతో నిర్మించిన రైతు బజారును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాల్సి ఉంది. పట్టణంలో ఉన్న మాంసం, చేపల విక్రయాల షాపులను రైతు బజారుకు తరలిస్తే అద్దె రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పట్టణంలో 32 వార్డుల్లో నిర్వహణ లోపంతో మూలకు చేరిన సామూహిక మరుగుదొడ్లపై దృష్టి సారించాలి. పట్టణంలోని పోస్టాఫీసు ఆవరణలో రూ.10లక్షలతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్ల పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాల్సి ఉంది. పట్టణంలో చంద్రంపేట సమీపంలో 1400పైగా టిడ్కో గృహ సముదాయాలను అందు బాటులోకి తేవాల్సి ఉంది. అదేవిధంగా జగనన్న కాలనీల్లోని మంజూరు చేసిన ఇళ్లను కూడా పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సాలూరు పట్టణానికి ఆనుకొని దుగ్ధసాగరం నుంచి జీగిరాం వరకు ఉన్న బైపాస్‌రోడ్డులో విద్యుద్ధీకరణ పనులను పూర్తి చేయాల్సి ఉంది. పలు కారణాలతో మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో సగం దుకాణాలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో అవి వినియోగించకుండానే మరమ్మతులకు గురవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. పట్టణానికి ఆనుకుని ప్రవహిస్తున్న వేగావతి నది మురుగునీరు, వ్యర్థాలతో కలుషితమైంది. ఈ నేపథ్యంలో నీటిశుద్ధి ప్లాంట్, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులు ప్రారంభించాల్సి ఉంది. పార్కుల అభివృద్ధిపైనా దృష్టి సారించాల్సి ఉంది.
వసతుల కల్పన అంతంతమాత్రమే
పాలకొండ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పాలకొండలో 28 వార్డులు ఉండగా.. 2011 జనాభా లెక్కలు ప్రకారం 31,466 మంది జనాభా ఉన్నారు. అయితే నగర పంచాయతీగా అప్ గ్రేడ్ అయినప్పటి నుంచి పట్టణ ప్రజలపై పన్నుల భారం పెరిగింది. మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. దీనిపై నూతన పాలకవర్గం శ్రద్ధ వహించాల్సి ఉంది.
- నగర పంచాయతీకి శాశ్వత ప్రాతిపదికన డంపింగ్‌యార్డు లేకపోవడం వల్ల పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. ప్రధాన కూడళ్లలో చెత్తాచెదారాలు కుప్పలుగా దర్శనమిస్తుండగా.. ప్రజారోగ్యంపై ఆ ప్రభావం పడుతుంది. పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగు కాలువల్లో సకాలంలో పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారులపైకి మురుగునీరు చేరుతుంది.
- పాలకొండ పట్టణంలో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో శివారు ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- డివిజన్ కేంద్రమైన పాలకొండలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. ఆక్రమణలతో ప్రధాన రహదారి ఇరుకుగా మారింది. ఈ రహదారి గుండా నిత్యం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌తో పాటు విశాఖ వైపు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణ పనులు చేపట్టి.. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.
- స్థానిక నగర పంచాయతీలో ప్రభుత్వ స్థలాలు అన్యా క్రాంతమవుతున్నాయి. కొంతమది పెద్దలు ఇప్పటికే వారి వారి కదంబ హస్తాల్లోకి విలువైన స్థలాలను తీసుకున్నారు. దీనిపై నూతన పాలకవర్గం దృష్టి సారించాల్సి ఉంది.
- నగర పంచాయతీ వాసులను వేధిస్తున్న తాగునీటి సమస్య పరిష్కారానికి పాలకవర్గం ప్రత్యేక చొరవ చూపాలి. రూ.72 కోట్లతో నాన్ అమృత్ పథకం ద్వారా చేపడుతున్న తాగునీటి పైపులైన్ విస్తరణ, రక్షిత పథకాలు నిర్మాణాలు వేగవంతం చేయాల్సి ఉంది.
దశాబ్దాల సమస్య.. తాగునీటికి కటకట
పార్వతీపురం టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురంలో 36 వార్డులు, 70 వేలకు మించి జనాభా ఉన్నారు. అయితే పుర వాసులను కొన్ని దశాబ్దాలుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. వారం, పదిరోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతవాసులైతే వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో 36 వార్డుల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించాల్సిన బాధ్యత మున్సిపల్ నూతన పాలకవర్గంపై ఉంది.
- మున్సిపాల్టీలో శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే పారిశుధ్య కార్మికులు 125 లోపే ఉన్నారు. దీంతో పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. జనాభాకు తగ్గట్లుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో వార్డుల్లో చెత్త పేరుకుపోతుంది. కాలువలు వ్యర్థాలు, పూడికలతో దర్శనమిస్తున్నాయి. దోమల బెడద దుర్వాసన కారణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లో పారిశుధ్య నిర్వహణకు కనీసం ఐదు నుంచి ఆరుగురు మంది పారిశుధ్య కార్మికులు అవసరమని 2004లో ప్రజారోగ్యశాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే అవి కాగితాలకే పరిమితమయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు తరచూ రోగాల బారిన పడుతున్నారు.
- పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు 30 వార్డుల్లోని వీధుల్లో వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. వీధిలైట్ల సమస్యపై ఇంజనీరింగ్ విభాగం అధికారులకు రోజు ఫిర్యాదు లొస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వీధిలైట్ల నిర్వహణ బాధ్యతను గత కొన్ని నెలలుగా ప్రైవేట్ సంస్థకు అప్పగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
- మున్సిపాల్టీలో డంపింగ్ యార్డు తరలింపు కలగా మారింది. వీధులు, ప్రధాన రహదారుల్లో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ.. ఆస్పత్రిపాల్జేస్తున్నాయి. కనీసం నెలకు 100 మంది కుక్కల దాడిలో క్షతగాత్రులవుతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.
- ఇక చిన్నపాటి వర్షం పడినా పట్టణవాసులు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. ఏటా వర్షాకాలం, తుఫాన్ల సమయంలో రెండు, మూడు రోజుల పాటు ప్రజలు వరదనీటిలోనే ఉండాల్సి వస్తోంది.