Local Body Elections స్థానిక ఎన్నికలు జరుగుతాయా?
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:25 AM
Will Local Body Elections Be Held? స్థానిక ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగుతాయా? అన్నది జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం. వాస్తవంగా 2021 ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో వారు కొలువుదీరారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంది.
ప్రత్యేక అధికారుల పాలనలో ఇక స్థానిక సంస్థలు
ఆశావహుల్లో అలజడి
పార్వతీపురం, జనవరి11(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగుతాయా? అన్నది జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం. వాస్తవంగా 2021 ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో వారు కొలువుదీరారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ఆగస్టులో, పురపాలక సంఘాల పాలక వర్గాల పదవీకాలం మార్చిలో ముగియనుంది. ఇకపోతే ఫిబ్రవరిలో జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సచివాలయ సిబ్బందితో పాటు మరికొంతమంది అధికారులకు జనగణనపై శిక్షణ ఇవ్వనున్నారు. దీనిపై మరో వారం రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నట్లు సమాచారం. జనగణన ప్రారంభమైతే గ్రామ సచివాలయాలకు చెందిన ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నం కానున్నారు. ఇది పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికల జరిగే పరిస్థితి ఉండదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని 451 పంచాయతీలున్నాయి. సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచా యతీతో పాటు 15 జడ్పీటీసీలు, 15 మండలాల పరిధిలో ఎంపీటీసీలు ఉన్నాయి. జనగణన నేపథ్యంలో.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం పూర్తయిన తర్వాత ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జనగణనతో సంబంధం లేదని, స్థానిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మరోవైపు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల అధిష్ఠానాల వద్ద ఆశీర్వాదాలు తీసుకునేందుకు వారు క్యూ కడుతున్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక పంచాయతీలను ఆ పార్టీ వారే కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల పాలకవర్గాలన్నీ వైసీపీ చేతిలోనే ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో పాలనపరంగా వైసీపీ నేతలు, కూటమి పార్టీలకు చెందిన నాయకుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే గ్రామాల్లో, పట్టణాల్లో ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి వలస వచ్చి నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.