Kharif Season ఖరీఫ్‌కు కష్టాలు తప్పవా?
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:42 AM
Will Kharif Season Face Hardships? తోటపల్లి భారీ సాగు నీటి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువలకు చెందిన ప్రధాన షట్టర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిధుల్లేని కారణంగా ఏడాది గడుస్తున్నా.. అవి వినియోగంలోకి రావడం లేదు. దీంతో గత పది నెలలుగా సాగునీరు వృథాగా పోతుండడంతో.. ఈ ఖరీఫ్‌కు కష్టాలు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరమ్మతులకు నోచని షట్టర్లు
అధ్వానంగా తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలో కాలువలు
ఆందోళనలో రైతులు
గరుగుబిల్లి, ఏప్రిల్13(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగు నీటి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువలకు చెందిన ప్రధాన షట్టర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిధుల్లేని కారణంగా ఏడాది గడుస్తున్నా.. అవి వినియోగంలోకి రావడం లేదు. దీంతో గత పది నెలలుగా సాగునీరు వృథాగా పోతుండడంతో.. ఈ ఖరీఫ్‌కు కష్టాలు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఎడమ, కుడి ప్రధాన కాలువ షట్టర్ల మరమ్మతులకు రూ. 25 లక్షలు అవసరం. దీనికోసం అధికారులు ప్రతిపాదనలు పంపించినా.. ఇంకా నిధులు మం జూరు కాలేదు. బిల్లులు మంజూరవుతాయో లేదోనని మరోవైపు కాంట్రాక్టర్లు కూడా పనులు చేట్టేందుకు ముందుకు రావడం లేదు. కాగా గతంలో రైతులు చందాలేసుకుని కుడి కాలువకు సంబంధించి షట్టరు మరమ్మతులు చేసుకున్నారు. అయినప్పటికీ సాగునీరు వృథాగా పోతుం డడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు కాలువలు అధ్వానం, మరోవైపు షట్టర్ల మొరా యింపులతో ఈ ప్రాంతవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
వాస్తవంగా గత ఖరీఫ్ జూలై నెలలో రెండు కాలువల నుంచి సాగునీరు విడుదల చేశారు. అయితే నాటి నుంచి ఏకధాటిగా రోజుకు 300 క్యూసెక్కుల మేర నీరు వృఽథాగా పోతుంది. ఎడమ ప్రధాన కాలువ పరిధిలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. దీని పరిధిలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పాలవలసతో పాటు గరుగుబిల్లి, వీరఘట్టం, జియ్యమ్మవలస, పాలకొండ మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో అవసరం లేకున్నా గత పది నెలలుగా సాగునీరు సరఫరా అవుతుంది. ఇక సుంకి ప్రాంతంలోని కుడి కాలువ నుంచి 9 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. కాగా ఈ కాలువ పరిధిలోని రెండు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. షట్టర్లు కూడా మరమ్మతులకు నోచుకోకపోవడంతో నీరు వృథాగా పోతోంది. అయితే గరుగుబిల్లి, బలిజిపేట, వంగర మండలాల్లో గ్రామాలకు ఏటా సాగునీటి కష్టాలే తప్పడం లేదు. కాగా షట్టర్ల మరమ్మతులతో ఈ ఏడాది వేసవిలో కొంతమంది రైతులు ఆరుతడి పంటలతో పాటు రబీ వరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏదేమైనా ప్రాజెక్టు పరిధిలోని ఎడమ, కుడి ప్రధాన కాలువలు, షట్టర్లు మరమ్మతులు నిర్వహించకపోతే ఖరీఫ్‌కు గడ్డు కాలమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు తెలియజేశాం
తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువల పరిస్థితిని కలెక్టర్, పాలకొండ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కొన్నాళ్లుగా నెలకొన్న సమస్యలను తెలియజేశాం. వారి ఆదేశాల మేరకు రెండు కాలువలకు సంబంధించి రూ.25 లక్షలతో అంచనాలు తయారు చేశాం. మర మ్మతుల కోసం కాంట్రాక్టర్లకు తెలియపర్చాం. నిధులు మంజూరు కాగానే చెల్లింపులు చేస్తామన్నా.. ఎవరూ ముందుకు రావడం లేదు. ఏదేమైనా ఖరీఫ్ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతాం.
- డీవీ రమణ, ఏఈ, వీరఘట్టం సెక్షన్