Will Kharif ఖరీఫ్‌కైనా మోక్షం కలిగేనా?
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:04 AM
Will Kharif Get Any Relief at Least Now? జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని వంతెనలు, కాలువలు అధ్వానంగా మారాయి. ప్రధానంగా కొత్తవలస, బాలగడబ ప్రాంతాల్లో గత 30 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అవి ఎప్పుడు కూలు తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వంతెనల గుండా రాకపోకలు సాగించేందుకు సమీప గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
కాలువలకు గండ్లు.. సాగునీటి సరఫరాకు ఆటంకం
పనుల కోసం ఎదురుచూపు
కూటమి ప్రభుత్వంపైనే రైతుల ఆశలు
గరుగుబిల్లి, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని వంతెనలు, కాలువలు అధ్వానంగా మారాయి. ప్రధానంగా కొత్తవలస, బాలగడబ ప్రాంతాల్లో గత 30 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అవి ఎప్పుడు కూలు తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వంతెనల గుండా రాకపోకలు సాగించేందుకు సమీప గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. వంతెనలు కూలితే పలు గ్రామాలకు పూర్తిగా రాక పోకలు నిలిచిపోనున్నాయి. మరోవైపు ప్రాజెక్టు పరిధిలో ప్రధాన కాలువలు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. కాలువలకు గండ్లు పడడంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ఖరీఫ్ సమయంలో తులసిరామినాయుడువలస ప్రాంతంలో కాలువకు గండి పడినా.. నేటికీ పూడ్చలేదు. దీంతో శివారు ప్రాంత భూములకు సాగునీరు సరఫరా కావడం లేదు.
జంఝావతి ప్రాజెక్టు పరిధిలో సీతానగరం, కొమరాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, మక్కువ మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉన్నా.. ప్రస్తుతం తొమ్మిది వేల ఎకరాలకే నీరందుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాకపోవడంతో ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. రబీకి సంబంధించి తోటపల్లి ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అవుతుంది. రెండు కాలువల పరిధిలోని రైతులు పలు రకాల పంటలకు సన్నద్ధమవుతున్నారు. అయితే జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని రైతులకు కూడా రబీకి సాగునీరు అందించాలని ఆయా ప్రాంత రైతులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి రూ. 56 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. కాలువల నిర్వహణ, గుర్రపు డెక్క తొలగింపు, స్లూయిస్‌లు, వంతెనల నిర్మాణాలకు అవసరమైన నిధుల మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదించాం. జనవరిలో పూర్తిస్థాయిలో సమాచారాన్ని రాష్ట్ర సచివాలయానికి అందించాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. రానున్న ఖరీఫ్‌కు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
- పి.పవన్‌కుమార్, ఏఈ, జంఝావతి ప్రాజెక్టు, పార్వతీపురం