Share News

Least Now? ఇకనైనా గాడిలో పడేనా?

ABN , Publish Date - May 25 , 2026 | 11:55 PM

Will It Get Back on Track at Least Now? జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) గాడిలో పడేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ శాఖకు నూతన పీడీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పలు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.

  Least Now? ఇకనైనా గాడిలో పడేనా?
డీఆర్‌డీఏ కార్యాలయంలో మూలనపడిన యంత్రం

  • యంత్రాలు మూలన పడినా.. స్పందించని వైనం

  • అక్రమాలపై విచారణ పూర్తయినా బహిర్గతం కాని నివేదికలు

  • డీఆర్‌డీఏ పనితీరు మెరుగుపడేనా..

  • నూతన పీడీకి సవాల్‌గా మారిన సమస్యలెన్నో..

పార్వతీపురం, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) గాడిలో పడేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ శాఖకు నూతన పీడీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పలు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా డీఆర్‌డీఏలో వెలుగు శాఖ విలీనానికి ముందు అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోణలొచ్చాయి. ఏపీడీలుగా పనిచేసిన వారిపై వరుస ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు గతంలో విచారణ జరిపినా.. నివేదికలు కూడా బహిర్గతం కాలేదు. అసలు అక్రమాలు జరిగాయా? లేదా! తీసుకున్న చర్య లేమిటో? ఇంతవరకు తేలలేదు. మరోవైపు మండల స్థాయిలో అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్ర్తీ నిధి , రైతు మిత్ర గ్రూప్‌ల ద్వారా అందించే రుణాల మంజూరు, రికవరీలపై అనేక విమర్శలున్నాయి. అదేవిధంగా లక్షలాది రుపాయలతో కొనుగోలు చేసిన యంత్రాలు కూడా నిరుపయోగంగా మారాయి. అయితే వాటిపై నూతన పీడీ దృష్టి సారించాల్సి ఉంది.

యంత్రాలను వినియోగంలోకి తెస్తారా?

గతంలో వీడీవీకేల కోసం కొనుగోలు చేసిన యంత్రాల్లో కొన్ని మూలన పడ్డాయి. ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్‌ మండలాల్లోని ఇదే పరిస్థితి నెలకొంది. చింతపండు కేక్‌తో పాటు కొండచీపుర్లు కటింగ్‌ తదితర వాటి కోసం గతంలో యంత్రాలను కొనుగోలు చేశారు. కొన్నింటిని మండల సమైక్య కేంద్రాలకు తరలించారు. అయితే చాలా మండలాల్లో అవి వినియోగంలోకి రాలేదు. స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో నేటికీ కొన్ని యంత్రాలు దిష్టిబొమ్మల్లా దర్శన మిస్తున్నాయి. లక్షలాది రుపాయలతో కొనుగోలు చేసిన యంత్రాలు ఇలా మూలనపడినా.. స్పందించేవారే కరువయ్యారు. ఈ యంత్రాల కొనుగోలులో కూడా గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

‘ఉన్నతి’ రికవరీ 17 కోట్లు పైనే..

ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం గతంలో ఉన్నతి పథకం కింద పెద్దమొత్తంలో రుణాలు మంజూరు చేశారు. అయితే రికవరీపై మాత్రం దృష్టి సారించలేదు. 2015 నుంచి మంజూరైన రుణాలకు సంబంధించి సుమారు రూ. 17 కోట్లుపైనే రికవరీ చేయాల్సి ఉంది. బకాయిలు పెరిగిపోతున్నా.. సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదు. వాస్తవంగా ఉన్నతి రుణాలు అర్హులైన వారికి అందించారా? లేదా! అన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తమవు తున్నాయి.

ప్రత్యేకంగా దృష్టి సారిస్తా..

కొత్తగా బాధ్యతలు స్వీకరించా. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే విధంగా అందరి సహకారంతో డీఆర్‌డీఏ ద్వారా ప్రజలకు సేవలందిస్తాం. రుణాల మంజూరుతో పాటు రికవరీ, మూలనపడిన యంత్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటాం.

- సీహెచ్‌ ప్రభావతి, పీడీ, డీఆర్‌డీఏ

Updated Date - May 25 , 2026 | 11:55 PM